" ప్రవర్గ్య హోమము " గురించి ఒక వీడియో అంతర్జాలములో లభ్యమగుచున్నది.. అందులో ఒక దర్విలో వేసిన తక్కువ ప్రమాణములోనున్న హవిస్సు ను యజ్ఞేశ్వరుడికి ఆహుతి ఇవ్వగానే అణ్వస్త్రము విస్ఫోటమైనట్టు పెద్దఎత్తున మంటలు, వెలుగు యాగశాల అంతా నిండిపోయినది చూడవచ్చు. అది ఎలా సాధ్యము ?
యజురారణ్యకములో ఈ ప్రవర్గ్యము గురించిన ఉటంకింపు ఉంది. కొన్ని విశేషాలు ఉన్నాయి.
.
" ప్రవర్గ్యము "అంటే ఏమిటో తెలుసుకుందాము. కాని, ఇది తెలియాలంటే మొదట, " అరుణకేతుకాగ్ని " అన్నది తెలియాలి.
వైదిక దేవతలలో అగ్ని , ఇంద్రుడు, మిత్ర, వరుణులు, విశ్వేదేవతలు ముఖ్య దేవతలు. ఋగ్వేదమంతా ఈ దేవతల వర్ణన తో ఉంటుంది. అగ్ని అంటే మనము అనుకునే అగ్ని కాదు. ఋగ్వేదము ప్రకారము, ’ అగ్ని ’ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎన్నిరూపాలైనా తీసుకుంటాడు. మనము చూసే అగ్ని కూడా ఆ రూపాలలో ఒకటి. సూర్యుడు కూడా అగ్ని రూపాలలో ఒకటి. అయితే సూర్యులు అనేకులు ఉన్నారు . ముఖ్యముగా ద్వాదశ సూర్యులు ద్వాదశ మాసాలకు అధిపతులు. మాసాలకు అధిపతులు ఉన్నట్టే , ఋతువులకు కూడా అధిపతులు ఉన్నారు.
.
సూర్యరూపములో నదులనుండి, సముద్రమునుండి నీటిని తీసుకొని, ఆ నీటిని వేయిరెట్లుగా వర్షింపజేయువాడు ద్రవరూపములోని అగ్ని. అవును , అగ్ని ద్రవరూపములో ఉంటాడు. నీటిలో ఉన్న వేడిమి ఏదుందో, అది ద్రవరూపమైన అగ్ని. ఆ ద్రవరూపుడైన అగ్ని మనకు వానలు కురిపిస్తాడు. ఆ ద్రవరూపుడైన అగ్నినే " అరుణ కేతుకాగ్ని " అంటారు.
ఇంకో విషయము..
అగ్ని దేవుడు జిహ్వా రూపముగా కూడా ఉంటాడు. మనము చూసే అగ్ని దేవుడి నాలుకలు యేడు.. అవే , కాళీ , కరాళీ , మనోజవా , సులోహితాయా, సుధూమ్ర వర్ణా , స్ఫులింగినీ , విశ్వ రుచి అనేవి.. "
" మనము చేసే అనేక యాగాల ముఖ్యోద్దేశము , రాజ్యము సకాల వృష్ఠులతో సస్య శ్యామలముగా ఉండి , ప్రజలు సుఖజీవనము సాగించుట . దానికి సహాయపడువాడే అగ్నిదేవుడు. సూర్యుడు నదీ జలములను తీసుకొనుట , వేయిరెట్లు వర్షించుటకే గదా, ఆ వర్షమును కలిగించువాడే , ద్రవరూపుడైన అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడినే " అరుణ కేతుకాగ్ని " అంటారు..." అని తెలుసుకున్నాము గదా..
అదీ కాక,
.
" క్షణములు , ఘడియలు , దివారాత్రాలు , పక్షములు , మాసములు , ఋతువులు , సంవత్సరమును కలిగించు సూర్య రూపుడే ఈ అరుణ కేతుకాగ్ని. అంటే , ఈ అరుణ కేతుకాగ్నియే కాలము యొక్క విభాగములను కలిగించువాడు... ఒకో రుతువుకు ఒక్కో దేవతను అధిపతి లేక అధిదేవత గా నియమించినాడు. ఆయా అధి దేవతలు అందరూ అరుణకేతుకాగ్ని ప్రతిరూపాలే.
కాలము లోని ఈ విభాగాల్లో ఋతువులు ఒకటి అని మనకు తెలుసు కదా,
శిశిర ఋతువుకు అధిదేవతలైన విశ్వేదేవతలు కూడా అరుణకేతుకాగ్ని కి ప్రతి రూపాలు. మరి, ఈ విశ్వే దేవతలు అంటే ఎవరు ?
ఏయే దేవతలకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు ఉండవో, ప్రత్యేక నామములు ఉండవో, వారే విశ్వేదేవతలు. అంటే యుగాలు గడిచేకొద్దీ వీరు ఒక సమూహముగా పిలవబడ్డారు. [ ఆదిత్యులు, మరుత్తులు , వంటి వారు కూడా అటువంటి సమూహాలే ..]
.
ఈ దేవతలు ముఖ్యముగా ధర్మాన్ని, నైతికతను --అంటే ’ ఋతము ’ ను కాపాడు వారు. తమ భక్తుల శత్రువులను నాశనము చేసి, మంచిని కాపాడి, వారికి ఉన్నత లోకాలను కలిగించేవారు ఈ విశ్వేదేవతలు.
.
ఒకసారి ఈ విశ్వే దేవతలు అరుణకేతుకాగ్ని రూపమయిన తమ జిహ్వలతో బిగ్గరగా కేకలు వేస్తూ , ఒకానొక సందర్భములో , ’ మానవులు , వరుణుడు , ఇంద్రుడు , అగ్నిహోత్రుడు , వాయువు ఎవరైనా గానీ మాతో సమానులు గారు’ అని ఉచ్ఛ స్వరముతో ధ్వనులు చేసినారు..
.
అందు చేత , ఇంద్రుడు భయపడినాడు. అంతేగాక , విశ్వేదేవతల జిహ్వా రూపమైన అరుణ కేతుకాగ్ని యొక్క ధనుస్సు , భూమ్యాకాశములను నిండియుండుట చేత , ఇంకా భయపడి , ఒక చలి చీమ రూపములో వెళ్ళి ఆ ధనుస్సు యొక్క నారిని కొట్టివేసినాడు. అలా కొట్టివేయగా , ఆ ధనువు ఆకాశమునకు ఎగిరి , ధనుస్సు యొక్క ఒక కొన తగిలి , అరుణకేతుకాగ్ని యొక్క శిరస్సు తెగి , చూర్ణమై కిందపడినది. ఆ చూర్ణము , యజ్ఞములో ఉపయోగించు ’ ప్రవర్గ్యము ’ అను ఒక హవిస్సుగా మారినది. కాబట్టి , యే మనుష్యుడు ప్రవర్గ్యముతో కూడిన యజ్ఞము చేస్తాడో , అతడు అరుణకేతుకాగ్ని యొక్క శిరస్సును తిరిగి కూర్చినవాడే యగుచున్నాడు.
.
ఇది తెలుసుకొన్న వాడిని అరుణకేతుకాగ్ని హింసింపదు. కావలసిన కోరికలను తీర్చును. అందుచేతనే ఈ ప్రవర్గ్యేష్టి చేయుట. తపస్సు చేయువారిని అగ్ని కానీ ఇతరులుకానీ అన్ని ఋతువులలోనూ బాధించక , కాపాడవలెనంటే ఈ ఇష్టి చేయుట మిక్కిలి లాభదాయకము. "
ఈ ఇష్టిని కేవలము ప్రవర్గ్యేష్టి గా మాత్రమే ప్రత్యేకముగా చేయరు. సామాన్యముగా ’ సోమయాగము ’ లో ఒక భాగముగా ఈ ప్రవర్గ్యేష్టి ని చేస్తారు.
.
పైదంతా అలాగే జరిగి ఉండవచ్చు, లేక జరిగినదానిని ఒక చిహ్న రూపములో అలా చెప్పి ఉండవచ్చు. వేదము నేరుగా దేనినీ చెప్పదు. బీజరూపములో మాత్రమే చెపుతుంది. దానిని విస్తృత పరచుటకే వేదవ్యాసులు అష్టాదశ పురాణాలను వ్రాసినది.
.
[ సంస్కృతము వచ్చినంత మాత్రాన వేదార్థమును తెలుసుకోలేము, వేదానికి భాష్యము చెప్పలేము. దానికి ’ నిరుక్తము ’ అనే వేద సంస్కృతపు నిఘంటువు అవసరమవుతుంది. మామూలు సంస్కృతము వేరే, వేదములోని సంస్కృతము వేరే. రెండూ ఒక్కలాగే ఉంటాయి. అర్థమయినట్టే అనిపిస్తాయి. కాని అవే పదాలకు ఈ రెండు సంస్కృతాలలోనూ అర్థాలు వేరువేరు ఉండచ్చు. అన్ని పదాలకూ అలా వేరు వేరు అర్థాలు ఉంటాయని కాదు. అనేక పదాలకు విపరీత, వ్యతిరేక అర్థాలు కూడా ఉన్నాయి.
.
ఆచార్య సాయణుడు ఒక్కరు మాత్రమే అన్ని వేదాలకూ భాష్యము వ్రాసినారు. వారి భాష్యమే ప్రామాణికముగా ఇప్పటివరకూ అనుసరింపబడుతున్నది. ]
( ఇది తెలియని ఈనాడు కొందరు మ్లేఛ్ఛులు నాలుగు సంస్కృతము ముక్కలు నేర్చుకొని వేదాలకు వక్రభాష్యాలు చెబుతున్నారు... అది విషయాంతరము )
.
మరి, ఇప్పటి కాలములో ఈ ఇష్టిని చేయడము ఎలాగ ? ప్రవర్గ్యము అంటే ఏమిటి, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ?
ఈ కాలము అరుణకేతుకాగ్ని శిరస్సును అతికించగల తంత్రాలు లేవు, అయితే మంత్రాలు ఉన్నాయి. అగ్ని దేవుడి కి ఇష్టమైనవి గా చెప్పబడిన సద్యోఘృతము, ఆవు పాలు, మేకపాలతో ఈ ప్రవర్గ్యాన్ని చేస్తారు. ఈ పదార్థాలతో చేసిన ’ ఘర్మము ’నే ప్రవర్గ్యము అంటారు.
.
ఉడుకుతున్న నేతిలోకి ఆవుపాలు, మేకపాలు ప్రత్యేక నిష్పత్తిలో ప్రత్యేక మంత్రాలతో కలిపి ఘర్మాన్ని తయారు చేస్తారు. అదే ప్రవర్గ్యము. అది ప్రవర్గ్యముగా మారాలంటే , దానిని హవిస్సుగా అర్పించేటప్పుడు ప్రత్యేక సిద్ధియైన మంత్రాలు పఠించాలి. అలా పఠించి హవిస్సును తయారు చేసి, ఆయా ప్రత్యేక మంత్రాలతో ఆ ప్రవర్గ్యమును హవిస్సుగా ఇవ్వాలి. అప్పుడు అది అరుణకేతుకాగ్ని శిరస్సును తిరిగి అతికించిన ఫలాన్నే ఇస్తుంది.
.
వీడియోలో మనము చూసే విస్ఫోటనము ఆయా పదార్థాల వల్ల కాదు. ఆ మంత్ర శక్తి వల్ల మాత్రమే.
.
// సర్వం జగదంబార్పణమస్తు //
-- విభాతమిత్ర
[ భాస్కర జనార్దన శర్మ ]