SHARE

Saturday, June 1, 2019

సంతాన భాగ్యము- వేదవిహిత ఉపాయము

సంతాన భాగ్యము- వేదవిహిత ఉపాయము
-----------------------------------------------------



సంతానము లేక చాలా మంది దంపతులు అన్ని రకాల ప్రయత్నాలూ చేసి ఫలము దక్కక విసిగి వేసారి ఉంటారు. భౌతికంగా, లైంగికముగా , మానసికముగా వారిలో ఎట్టి లోపాలూ ఉండవు. అయినా సంతానము కలగదు. దానికి కారణము ఎవరూ చెప్పలేరు.

 అయితే వేదము మనకు ఆ కారణాన్ని తేటతెల్లము చేస్తుంది. 
నిజానికి ఇదేమీ కొత్తవిషయము కాదు. వేదోక్తమైన కర్మలను అనాదిగా ఆచరిస్తూ, సంతానాన్ని పొందినవారు అన్నికాలాల్లోనూ ఉన్నారు.
సంతానము కోసము యాగాలు చేయుట మనకు తెలిసినదే. దశరథుడి వంటివాడే పుత్రకామేష్టి యాగము చేసినాడని పురాణము చెబుతుంది. 
అయితే, సంతానము కోసము, యాగమే ఎందుకు చేయాలి ? ఇతర పద్దతులు లేవా ? 

ఈ ప్రశ్నకు సమాధానము కూడా వేదమే చెబుతుంది.

కృష్ణ యజుర్వేదములోని రెండవ కాండములోని , మొదటి ప్రశ్నలో ఈ విషయము దీర్ఘముగా చర్చించబడినది.

అసలు, సంతానము కలుగుటకు, కలగక పోవడానికి గల కారణాలు తెలిస్తే, మిగతావి సులభముగా అర్థము అవుతాయి..

మొదట తెలుసుకోవలసినది, సంతానానికి కారణము మన దేహములో చరించే వాయువు. ఈ వాయువే ఐదురకాలుగా పిలవబడుతుంది. వీటినే పంచప్రాణాలు అంటారు. దేహములో  వాయు సంచారమే ప్రాణము ఉండుటకు, లేకపోవుటకు కారణము. ఉఛ్చ్వాస నిశ్వాసాలు లేకపోతే ప్రాణము ఉంటుందా ? 

ఈ ఐదు ప్రాణాలలో, ప్రాణము, అపానము-- ఇవి రెండే సంతానానికి కారణము. 
మన ముఖమునుండీ బయటికి సంచరించే వాయువే ప్రాణము.
మన దేహములో ఉదరభాగములో లోలోపలే సంచరించు వాయువే అపానము. దీనినే నియుత్ అని వేదభాషలో అంటారు. 
ఈ ప్రాణము, అపానము ఒకదానినొకటి పొందినపుడు-- అనగా కలసినపుడు మాత్రమే , సంతానము కలిగే సాధ్యత ఉంటుంది. ప్రాణము , అపానము ఒకదానినొకటి కలియక, వేరువేరు అయిపోతే అప్పుడు ఆ మనుష్యుడికి సంతానము కలుగదు. 

కాబట్టి, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానము కలుగక పోవుటకు, ఈ ప్రాణాపానాలు దూరమగుటయే  కారణము. 

మరి, వాటిని కలుపుట ఎలాగ ? 

దీనికి వాయువే మనకు సహకరించాలి. అనగా , వాయువు మనకు సహకరించుటకు తగ్గ ప్రయత్నాలు మనము చేయాలి. 
అది ఎలాగ అంటే, వాయువు అతివేగముగా సంచరించువాడు. అందుకే వాయువేగము... అంటుంటాము. వాయువు అతివేగముగా సంచరించినట్టే , అతివేగముగా ఫలము కూడా ఇస్తాడు. 
.
కాబట్టి వాయువు అనుగ్రహము పొందాలంటే మనము చేయవలసినది-- శ్వేతపశు యాగము. శ్వేత పశువు వాయువుకు ప్రియమైనది. 
అపానవాయువును ’ నియుత్ ’ అంటారని తెలుసుకున్నాము కదా , నియుత్ అంటే , వాయువు సంచరించే రథము ను లాగే గుర్రాలు. అంటే దేహములో ఏదో రథము పరుగెడుతూ ఉంటుంది అని అర్థము కాదు. వేదము ఏమి చెప్పినా నేరుగా చెప్పదు. ఒక చిహ్నారూపముగానో, సంజ్ఞా రూపముగానో చెబుతుంది. ఈ నియుత్ అనే వాయువు దేహములో తిరుగుతుంది కాబట్టి, వాయువును ’ నియుత్వంతుడు ’ అంటుంది వేదము. ఈ నియుత్వంతుడికి, శ్వేత పశువు అతి ప్రియమైనది.....అని కూడా వేదము చెబుతుంది. 
కాబట్టి, శ్వేతపశువు నుండీ వచ్చిన ద్రవ్యాలతో [ అనగా తెల్లటి పశువు-- అది గుర్రము, మేక, ఆవు, గొర్రె వీటిలో ఏదైనా కావచ్చు.. అయితే గోవుకున్నంత శ్రేష్ఠత్వము, ప్రాముఖ్యత వలన పంచగవ్యాలతో]  ఇట్టి యాగము చేయుట ఈ కలికాలములో రూఢియైనది .

ఈ  శ్వేత పశుయాగము చేయడము వలన , వాయువు, తన భాగము తనకు దొరకుట వలన తృప్తుడై, దేహములో ప్రాణాపానములను కలియునట్లు చేస్తాడు.  అప్పుడు సంతాన నిరోధకముగా ఉన్న దోషము తీరి, సంతానము కలుగుతుంది. 

_____________
ఇదే విధముగా దీర్ఘరోగుల శరీరములో కూడా ప్రాణాపానాలు కలియక, ఆ రోగి మరణించే అవకాశము ఉంటుంది. దీర్ఘ రోగులు ఈ శ్వేత పశుయాగము చేయడము వల్ల, వారుకూడా రోగము పోగొట్టుకొని ఆరోగ్యము పొందుతారు. 

ఇదేవిధముగా ధనప్రాప్తి కోసము కూడా ఈ యాగము చేస్తారు. 
అదే విధముగా, ప్రజల మీద అధికారము సంపాదించి నాయకుడు కాగోరినవారు కూడా ఇదే యాగాన్ని చేసి ఫలితాన్ని పొందవచ్చు.]

ఇప్పుడొక ముఖ్య ప్రశ్న 
--------------------------------
ఈ యాగము వలన అనేక ఫలితాలు కలుగుతాయి నిజమే, కానీ అందరికీ ఇది సాధ్యమా? 
అందరికీ సాధ్యము కాకపోవచ్చు. యాగమంటేనే ఖర్చుతో కూడినది. పైగా ఎన్నెన్నో వసతులు, సౌకర్యాలు ఉండాలి. అవిలేనివారు, ప్రతి దినమూ బ్రహ్మ యజ్ఞములో వేదములోని ఈ రెండవ కాండము, మొదటి ప్రశ్న లోని మొదటి అనువాకాన్ని [ వాయుర్వై క్షేపిష్ఠా దేవతా.... ] పారాయణము చేసినా అంతే ఫలితము ఉంటుంది. బ్రహ్మ యజ్ఞములో కాకపోయినా, మామూలుగా అయినా పారాయణ చేయవచ్చు. అది కూడా వీలుకాని వారు, వేదవిదుడైన బ్రాహ్మణుడితో తమ స్వగృహమునందు నలభై రోజులు ఈ పారాయణము చేయించవచ్చు. 
. వేదము ఉన్నది మానవుల అభ్యుదయము , క్షేమము కోసము మాత్రమే గనుక, వేదములో చెప్పబడిన ఈ విధానాన్ని పాటించి సత్ఫలితాలను పొందుదాము. 
*************************

|| జగదంబార్పణమస్తు || 
|| వేద నారాయణార్పణమస్తు || 

_____________________
దీనినే ఈనాటి శాస్త్రజ్ఞులు, వైద్యులు పరిశోధనలు చేస్తే, ఈ కారణాలను, పరిష్కారాన్ని ఇప్పటి పదజాలము ఉపయోగించి, సంతాన సాఫల్య కేంద్రాలలో కొత్తపేరు పెట్టి , యాగానికి ప్రత్యామ్నాయాలను కనుగొని అదే ఫలితము వచ్చునట్టుగా చేయగలరేమో..