కల్ప సూత్రములు -ఒక లఘు పరిచయము
________________________________________
ఈ వ్యాసములో కల్ప సూత్రములు ఏవి అనునది చర్చించలేదు.
అసలు కల్ప సూత్రముల గురించి తెలియని వారికి, అవంటే ఏమిటి, వాటి పేర్లు, వాటిలోని భేదములు, వాటి ఉపయోగము--వంటి విషయాలు మాత్రమే ఇవ్వడము జరిగింది.
కల్పసూత్రములు అంటే ఏమిటో చాలా మందికి తెలియకున్నా, వాటిని దాదాపు అందరు హిందువులూ నిత్యజీవితములో ఆచరించి, ఉపయోగిస్తున్నారు.
వేదములో ఉపయోగింపబడిన భాష వల్ల కానీ, అందులో వివరింపబడిన సంక్లిష్టమైన అనుష్ఠాన పద్దతుల వల్ల కానీ, వేదాలను చదివి అర్థము చేసుకొనుట దుస్సాధ్యము. దాదాపు అసంభవము.
కానీ వేదాల ఉనికి మానవుల అభ్యుదయము కోసము మాత్రమే. అటువంటప్పుడు అర్థము కాకపోవుట వల్ల ప్రయోజనము లేదు. వేదాలు ఆ విధముగా సామాన్యులకు అందుబాటులో ఉండకపోవుటకు కారణము, కేవలము వాటి పరిరక్షణార్థము మాత్రమే.
మరి వాటిని అర్థము చేసుకొనుట ఎలాగ అంటే , వాటి అంగాల వల్ల మాత్రమే. ఇవే వేదాంగాలు.
దాదాపు వేదములు ఆవిర్భవించిన కాలము నుండే ఈ అంగాలు కూడా ఉన్నాయి. వీటివల్ల, వేదములయందున్న ధర్మ సూక్ష్మాలను, వాటి రహస్యాలను తెలుసుకొనుట, వాటిలోని విషయములను అర్థము చేసుకొనుట, ఆచరించుట సులభము అవుతుంది.
ఆ వేదాంగాలు,
శిక్ష,
ఛందస్సు,
వ్యాకరణము,
నిరుక్తము,
జ్యౌతిష్యము [ జ్యోతిష్యము కాదు ] ... జ్యౌతిష్యము అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించినది.
ఆఖరిది, ’ కల్పము ’.. ఈ ఆరింటినీ శాస్త్రములు అనికూడా అంటారు, వాటి విషయ ఆధిక్యత వల్ల.
ఆఖరిదైన ఈ కల్పమే మన అనుష్ఠాన, ఆచారములను వివరించేది.
కల్పము అంటే ప్రయోగము అనవచ్చు కూడా.
ఇందులో నాలుగు శాఖలున్నాయి, శ్రౌత, గృహ్య, ధర్మ, మరియు శుల్బ సూత్రములు. ఇవన్నీ కలిపితే కల్పసూత్రములు అవుతాయి.
ఇప్పుడు ఈ నాలుగింటి గురించీ క్లుప్తముగా తెలుసుకుందాము..
మొదటిది,
****************
శ్రౌత సూత్రములు
****************
శ్రౌత సూత్రములు ముఖ్యముగా వైదిక యజ్ఞ యాగాదుల గురించీ, వాటిని ఆచరించవలసిన పద్దతులు, వివరాలను వర్ణిస్తాయి.
కొన్ని శ్రౌత సూత్రములను కిందివిధముగా వర్గీకరించవచ్చు.
యజమానుడు, ఋత్త్విక్కులు, వారి ధర్మములు, వారి కార్య కలాపములు
అగ్న్యాధేయము --అనగా, అరణులను రాపిడి చేసి అగ్నిని పుట్టించుట
దర్శపూర్ణమాస యాగము, సోమయాగము, చాతుర్మాస్య బలులు, సత్రయాగములు వంటివాటి వర్ణన, వివరణ.
అగ్నిచయనము --అనగా, ఇటుకలను యాగవేదికలు చేయుటలో ఉపయోగించు పద్దతులు, విధములను వర్ణించుట.
వేదములోని అన్ని శాఖలలోను వాటికి సంబంధించిన శ్రౌత సూత్రములు ఉన్నాయి.
వాటిని కింది విధములైన పేర్లతో తెలుసుకొనవచ్చును.
ఋగ్వేదము ; ఆశ్వలాయన శ్రౌత సూత్రములు, సాంఖ్యాయన శ్రౌత సూత్రములు.
శుక్ల యజుర్వేదము : కాత్యాయన శ్రౌత సూత్రములు.
కృష్ణ యజుర్వేదము : ఆపస్తంబ శ్రౌత సూత్రములు, బౌధాయన శ్రౌత సూత్రములు, భారద్వాజ శ్రౌత సూత్రములు, మానవ శ్రౌత సూత్రములు, మరియూ వైఖానస శ్రౌత సూత్రములు.
సామవేదము : ఆర్షేయ కల్పసూత్రములు [ లేక ] మశక కల్పసూత్రములలోని శ్రౌత సూత్రములు, ద్రాహ్యయణ శ్రౌత సూత్రములు, జైమినీయ శ్రౌత సూత్రములు, లాట్యాయన శ్రౌత సూత్రములు.
అథర్వ వేదము : వైతాన శ్రౌత సూత్రములు.
ఈ శ్రౌత సూత్రములు లేకున్నచో, అనేకములైన వైదిక యజ్ఞాలు చేయుట అసాధ్యము.
*****************
గృహ్య సూత్రములు
*****************
మనము గృహములలో ఆచరించతగిన, ఆచరించవలసిన సాంప్రదాయాలను , తంతులను --అనగా షోడశ సంస్కారములను , పాకయజ్ఞములను వివరించేవి గృహ్య సూత్రాలు..
నాలుగు వేదశాఖలకు చెందిన గృహ్య సూత్రాల పేర్లు[ ఇప్పటికి తెలిసినవి ]
ఋగ్వేదము : ఆశ్వలాయన గృహ్య సూత్రములు, సాంఖ్యాయన గృహ్య సూత్రములు
శుక్ల యజుర్వేదము : పారస్కర గృహ్య సూత్రములు
కృష్ణ యజుర్వేదము : ఆపస్తంబ గృహ్య సూత్రములు, బౌధాయన గృహ్య సూత్రములు,భారద్వాజ గృహ్య సూత్రములు.
సామవేదము : గోభిల గృహ్య సూత్రములు, జైమినీయ గృహ్య సూత్రములు, ఖాదిర గృహ్య సూత్రములు.
అథర్వ వేదము : కౌశిక గృహ్య సూత్రములు.
*****************
ధర్మ సూత్రములు
*****************
ధర్మ సూత్రములనే, " సామయాచారిక సూత్రములు " అని కూడా అంటారు. ఈ ధర్మ సూత్రములు ముఖ్యముగా ఆచారములు, వ్యవహారములు , మరియు వర్ణాశ్రమ ధర్మములను గురించి వివరిస్తాయి.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమును గుర్తుంచుకొనుట అవసరము. ధర్మ సూత్రములు, గృహ్య సూత్రములు ఇంచుమించు కలగలసి ఉండి, రెంటికీ దగ్గర సంబంధము ఉండును. అందులోని సూత్రములు ఇందులోను, ఇందులోనివి అందులోను ఉండే అవకాశము ఉంది. అయినా, వాటి ముఖ్య భేదము ఏమనగా, గృహ్య సూత్రములు పాకయజ్ఞములకు, సంస్కారములకూ పరిమితము కాగా, ధర్మ సూత్రములు వర్ణాశ్రమ ధర్మాలను ఎత్తి చూపుతాయి.
ధర్మసూత్రములు కింది విధములుగా ఉంటాయి.
ఋగ్వేదము : వాశిష్ట ధర్మ సూత్రములు.
శుక్ల యజుర్వేదము : శంఖ లిఖిత ధర్మ సూత్రములు.
కృష్ణ యజుర్వేదము : ఆపస్తంబ ధర్మ సూత్రములు, బౌధాయన ధర్మ సూత్రములు, హారీత ధర్మ సూత్రములు, హిరణ్యకేశి ధర్మ సూత్రములు, వైఖానస ధర్మ సూత్రములు, విష్ణు ధర్మ సూత్రములు.
సామవేదము : గౌతమ ధర్మ సూత్రములు
అథర్వ వేదమునకు ధర్మ సూత్రములు ఉన్నవీ లేనిదీ తెలియదు. ఒకవేళ ఉంటే , వాటిపేర్లు తెలియవు.
******************
శుల్బ సూత్రములు
******************
శుల్బము అనగా, కొలతలు కొలుచుటకు ఉపయోగించు దారము , లేక తాడు.
యజ్ఞ వేదికలు, యాగవాటికలు, యాగ శాలలు నిర్మించుటకు పాటించవలసిన కొలతలను ఈ శుల్బ సూత్రములు వివరిస్తాయి.
శుల్బ సూత్రములను అధ్యయనము చేసి పరిశీలిస్తే , వేదకాలములోనే రేఖాగణితము యొక్క అద్భుత జ్ఞానము మన ప్రాచీన ఋషులు అందించినది చూసి ఆశ్చర్యపోక తప్పదు. ఆయా కొలతలు, ఆకారములు చూస్తే అబ్బురముతో నిశ్చేష్టులము కాక తప్పదు.
ప్రస్తుతము మనకు ఏడు శుల్బ సూత్రములు లభ్యముగా ఉన్నవి. అవి కూడా శ్రౌత సూత్రాలకు చాలా సన్నిహితముగా సంబంధించి ఉన్నాయి. అవి,
ఆపస్తంబ శుల్బ సూత్రములు,
బౌధాయన శుల్బ సూత్రములు ,
కాత్యాయన శుల్బ సూత్రములు ,
మైత్రాయణ శుల్బ సూత్రములు ,
మానవ శుల్బ సూత్రములు ,
వాధూల శుల్బ సూత్రములు ,
వరాహ శుల్బ సూత్రములు
*****************
ఈ కల్ప సూత్రములన్నీ కూడా , వేదాంతములైన ఉపనిషత్కాలానికి తరువాత ఉనికిలోనికి వచ్చినాయి.
___________________
బ్రహ్మ సూత్రములు
___________________
సూత్రముల గురించి విన్నపుడు, చదివినపుడు, సహజముగా గుర్తొచ్చేది " బ్రహ్మ సూత్రములు " అనే పేరు. కల్ప సూత్రములకు , బ్రహ్మ సూత్రములకు ఎట్టి సంబంధమూ లేదు. వీటిలో కల్ప సూత్రములు ప్రాచీనమైనవి, బ్రహ్మ సూత్రములు అర్వాచీనమైనవి.
బ్రహ్మ సూత్రముల గురించిన లఘు పరిచయము మరొకసారి.
|| శుభం భూయాత్ ||
సర్వం జగదంబార్పణమస్తు..