సంస్కృత భాషా బోధన
-------------------------------
సనాతన ధార్మికులకు ఒక విశేష సూచన
---------------------------------------------------
సనాతన ధర్మాన్ని ఎందరెందరు ఎన్నెన్నిసార్లు అణచాలని చూసినా ప్రతిసారీ లేచి తలఎత్తి నిలబడింది. దీనికి కారణము అది మరణము లేనిది కాబట్టి. " జాతస్య మరణం ధృవమ్ " అయితే సనాతన ధర్మము పుట్టుక లేనిది..అనాదిగా వస్తున్నది. కాబట్టే దానికి మరణము లేదు.
కానీ అడుగడుగునా ధర్మాన్ని కించపరచే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
సనాతన ధర్మానికి వేదము , సంస్కృత భాష-ఇవి రెండూ ఆయువుపట్టులాంటివి. వేదాన్ని ఎందరు ప్రయత్నించినా ఏమీ చేయలేరు. ఇక మిగిలింది దేవభాష అని పిలవబడే సంస్కృత భాష.
వేదము , శాస్త్రాలు వంటివి సంస్కృత భాషలోనే ఎందుకు ఉన్నాయి, వేద, శాస్త్రాల ప్రచారముకోసము సంస్కృత భాష ఎందుకు అవసరము--- అనే విషయము పైన శృంగేరీ శ్రీ జగద్గురువుల అనుగ్రహ భాషణము మీరు ఇదే బ్లాగులో చదివి యున్నారు.
సంస్కృత భాషలో మన పురాతన సంస్కృతికి సంబంధించిన అతి గొప్పదీ పెద్దదీ అయిన ఖజానాయే ఉంది. భాష రాని కారణముగా అధికశాతము ప్రజలు అపారమైన ఆ విజ్ఞానాన్ని అందుకోలేక వంచితులయినారు.
విదేశీయుల కుయుక్తులవల్ల సంస్కృత వాజ్ఞ్మయం చాలాభాగము వారి అనువాదాల్లో వక్రీకరింపబడినది.
ఒక జాతిని నిర్వీర్యం చేసి నశింపజేయాలంటే మొదట ఆజాతి సంస్కృతిని నాశనము చేయాలి అన్న సిద్ధాంతముతో వారు కొంత విజయము సాధించారు. దాని ఫలితమే ఈనాడు సంస్కృత భాషకు పట్టిన దుస్థితి.
ఈ విషయాలు కొత్తవేమీ కాదు. ఈమధ్య సామాజిక మాధ్యమాల వల్ల ఇటువంటి విషయాలు బయటికి వచ్చాయి. నేటి యువతలోను , సనాతన ధర్మాచరణలో ఆసక్తి గలవారి లోనూ, సంస్కృతము మీద విశేష ఆకర్షణ , ఆదరణ, అభిమానము నానాటికీ పెరుగుతున్నది.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య కూడా ఉంది.
సంస్కృతము నేర్చుకోవాలని ఆసక్తి నానాటికీ ప్రబలము అవుతున్నా, వారికి నేర్పించేవారు దొరకక పోవడము , అధ్యాపకులు ఉన్నచోట విద్యార్థులు లేకపోవడము , ఉన్నాకూడా సమయాభావము , దూరాలు వంటి అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి.
అంతర్జాలములో ఇప్పటికే అనేక వెబ్ సైటులు, వీడియోలు, పాఠాలు ఉచితముగా దొరకుతున్నాయి. కానీ వాటి ఉపయోగము చాలా పరిమితమైనది . ఎందుకంటే , ఇటువంటి వాటిని నేరుగా గురుముఖతా నేర్చుకోవాలి. ప్రశ్నోత్తరాలు, సందేహాలు, ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. అంతేకాక, ఒక్కోవిద్యార్థి గ్రాహకశక్తి ఒక్కోలా ఉంటుంది. దానికి తగినట్టు అధ్యాపకులు/ గురువులు తమ బోధనా శైలినికానీ పద్దతులను కానీ కొంత మార్చుకోవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న సౌలభ్యాలు ఆ ప్రయోజనాన్ని సాధించలేవు. ఈ కారణము చేతనే , చాలామంది మొదలుపెట్టి, అనతి కాలములోనే మానేస్తున్నారు.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచములో ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులను , అధ్యాపకులనూ అనుసంధానించి, అంతర్జాలము ద్వారా సంస్కృతము నేర్పించాలన్న సంకల్పము ఆ శారదాదేవి అనుజ్ఞ, అనుగ్రహము మేరకు కలిగిన కొందరు ఈ విషయముపై తీవ్రముగా శ్రమించి, పదుగురికి మేలు జరగాలన్న సదుద్దేశముతో ఒక కార్యాచరణను ఏర్పాటు చేస్తున్నారు.
దానిలో భాగముగా , మొదట , ప్రపంచములో ఎక్కడున్ననూ , సంస్కృత అధ్యాపకులు తమ పేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరడమైనది.
అలాగే , ఆసక్తిగల విద్యార్థులు తమపేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరడమైనది.
మొదట ఈ అధ్యాపక-విద్యార్థుల వివరాలు సేకరించిన తరువాత, వారికి ఒకరినొకరికి అంతర్జాలము ద్వారా సంధానించే ప్రక్రియ చేపట్టబడుతుంది. సంస్కృత భాష నేర్చుకొనుటకు సులభపద్దతిలో పాఠ్యాంశములను కూడా సిద్ధము చేసే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుంది. దీనిలో భాగముగా , మూడు నాలుగు అంచెలుగా పాఠములు ఉంటాయి.
ప్రాథమిక పరిచయము , పుస్తకముల ద్వారా బోధన , భాషణము ద్వారా బోధన, పరీక్షలు వంటి అంచెలలో బోధన ఉంటుంది.
గ్రాహక శక్తిని బట్టి విద్యార్థులు ఒకటి రెండు సంవత్సరాలలో స్వయముగా సంస్కృతము చదివి అర్థము చేసుకొనుట, భగవద్గీత , ఇతర కావ్యాలను అర్థము చేసుకొనుట, తామే స్వంతముగా సంస్కృతములో రచనలు చేయుట వంటి లబ్ధిని పొందగలరు.
ఆసక్తి గల అధ్యాపకులు, మరియూ విద్యార్థులూ కింది మెయిలుకు తమ వివరాలు పంపగలరు. అలాగే ఫోన్ చేసి ఇతర వివరాలు పొందవచ్చు
Mail : mitraparishat@gmail.com
Cell: 6362685006
ఇంతవరకూ ఈ ప్రక్రియను వేదము నేర్చుకొను విద్యార్థులకు , నేర్పించే గురువులకు సంధానము చేయుట కొరకు విజయవంతముగా నడపడమైనది. ఇంకా నడుస్తున్నది. నేను వ్యక్తిగతముగా గత పదేళ్ళుగా వేదము ఈ పద్దతిలో , విదేశాల్లో ఉన్న కొందరికి నేర్పిస్తున్నాను.
అయితే ఇప్పుడు మొదలుపెట్టబోవుతున్నది ప్రస్తుతము కేవలము సంస్కృత భాషా బోధనకే పరిమితము.
సూచన : ఇది కేవలము సమాజహితము గురించి మాత్రమే చేయబడుతున్నది. లాభములకోసము కాదు.
మరొక్క విషయము:
ఈ కాలములో అనేక పండితులు, సంస్కృతములో అత్యంత ప్రావీణ్యము కలిగియుండి, విద్వత్తు, ప్రతిభలు ఉండి కూడా విద్యార్థులు దొరకక, వారితో అనుసంధానించే పద్దతులు తెలీక, ప్రభుత్వము నుండీ గానీ ఇతర ధార్మిక సంస్థలనుండీ గానీ తగిన ఆదరణ లేక, దారిద్ర్యరేఖ ను అంటుకొని ఉన్నారు. అటువంటి వారికి కొందరికైననూ సహాయము అందించాలని ఆ శారదామాత ప్రబోధముచేత బద్ధ కంకణులై ఉన్న బృందము ఈ కార్య క్రమాన్ని చేపడుతున్నది. అటువంటి వారు తప్పక మా సేవలను అందుకోవలసినదిగా కోరుతున్నాము.
మొదట , మాకు తమ ఆసక్తిని ప్రకటిస్తూ మెయిల్ పంపినవారికి ఒక బయోడాటా ఫారమ్ పంపబడును. దానిని నింపి మాకు పంపవలసి ఉంటుంది.
పేర్లు, వివరాలతో కూడిన బయోడేటా సేకరణ అయ్యాక ప్రతిఒక్కరూ వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది.
వచ్చిన వివరాలను పరిశీలించిన పిమ్మట , విడతల వారీగా వారికి ఆయా వివరాలు అందజేస్తాము.
అధ్యాపకులకు విద్యార్థులు చెల్లించాల్సిన రుసుము , ఇతర వెసులుబాట్లు, సౌకర్యాలు , కావలసిన అంశాలు -తదితర విషయాలను తరువాతి టపాలో చూడవచ్చు.
|| శుభం భూయాత్ ||