SHARE

Friday, March 30, 2018

శృంగేరీ జగద్గురువుల సంస్కృత అనుగ్రహ భాషణము-- తెలుగు అనువాదము

|| ఓం శ్రీ గురుభ్యో నమః ||


శృంగేరీ జగద్గురువులు గత జనవరి నెలలో శృంగేరీ క్షేత్రములోని ఒక సంస్కృత విద్యాపీఠపు రజత మహోత్సవములో , సంస్కృత భాష , శాస్త్రములు , వేదములు మానవజీవితానికి ఎందుకు అవసరమో తెలుపుతూ చేసిన సంస్కృత భాషలోని అనుగ్రహ భాషణమును తెలుగులోకి అనువదించాను. 

ఇందులో  సరిగ్గా నేను అనువాదము చేసి ఉంటే , అదంతా జగద్గురువుల ఆశీర్వాద బలముచేతమాత్రమే . ఏవైనా తప్పులు ఉంటే అవి నా అజ్ఞానము వల్లనే. దానికి ముందస్తు క్షమాపణలు .


|| నిత్యాక్ష హారం మణివలయ 
మనోజ్ఞేః పాణి పద్మైర్దధానా ||
|| సితవసన లలామా  తుంగ ముక్తాభిరామా |
| వసతు శశినిభాస్యా వాచి వాగ్దేవతా నః ||


పాతిక సంవత్సరాల పూర్వము ఈ శృంగగిరి క్షేత్రములో  ప్రారంభించబడిన ’ రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయము’   పేరుతో వ్యవహరింపబడుతున్న ఈ సంస్కృత విద్యాలయము యొక్క రజత మహోత్సవము ప్రస్తుతము జరుపుకుంటున్నందుకు  అత్యంత సంతోషించినాము.

ఈ విద్యాలయము యొక్క ప్రారంభము ఏవిధముగా జరిగినది అన్నది , ఈ మఠము యొక్క ప్రశాసనములో స్వకీయమైన భాషణము ద్వారా నిరూపించబడినది . 

దీనికి ముందే , శృంగగిరి క్షేత్రములో చాలా కాలమునుండీ వేద, శాస్త్రముల ప్రచారము కోసము ఒక సంస్కృత పాఠశాల నడుస్తున్నది. మా పూజ్య గురువులు , ప్రాతఃస్మరణీయులుయైన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామి వారి చేత నూట ఇరవై ఐదు సంవత్సరముల ముందు ఈ క్షేత్రములో " సద్విద్యా సంజీవిని " పేరుగల సంస్కృత మహాపాఠశాల ఆరంభింపబడినది. ఆ పాఠశాలయొక్క ఏకైక లక్ష్యము, ’ వేద, శాస్త్రముల ’ ప్రచారము చేయుట. 

’ వేద శాస్త్రముల గురించి మాత్రమే ఎందుకు ’ అని మీరు అడిగితే , వేదశాస్త్రముల ప్రచారమే లేకపోతే , అప్పుడు మనము మన ధర్మము యొక్క స్వరూపాన్ని తెలుసుకొనుటకు అశక్తులము అవుతాము. ఏలననగా , ధర్మముయొక్క స్వరూపము వేదశాస్త్రముల చేతమాత్రమే తెలుసుకొనదగినది. వేదశాస్త్రాల్లో ధర్మము యొక్క స్వరూపము నిక్షిప్తమై ఉంటుంది. ఒకవేళ వేదముయొక్క , లేదా శాస్త్రము యొక్క జ్ఞానము లేకుంటే , ఆ ధర్మమును ఇంకేవిధముగానూ తెలుసుకోలేము. ఎప్పుడైతే ధర్మముయొక్క స్వరూపమునే  తెలుసుకోలేమో, అప్పుడు దాన్ని ఎలాగ అనుష్ఠించగలము , ధర్మానుష్ఠానము లేకుండా సుఖము ఏలాగున లభ్యమగును ?. సర్వజనులూ తమకు సుఖమునే కోరుకొందురు. ఆత్మ సుఖము కోరనివాడు, లేదా తనకు దుఃఖము కోరుకొనువాడు ఎవరూ ఉండడు. అట్టి సుఖముయొక్క అభిలాష ధర్మాచరణ చేత మాత్రమే సిద్ధిస్తుంది. ధర్మాచరణము లేకుండా సుఖప్రాప్తిగానీ , సుఖవాంఛ గానీ అత్యంత అనుచితమైనది. అసాధ్యమైనది కూడా!  కాబట్టి, ధర్మాచరణము చేయవలెనంటే , ధర్మపు జ్ఞానము అవసరము , ధర్మాన్ని తెలుసుకొనుటకు వేదశాస్త్రాల పరిచయము అత్యావశ్యకము. 

అందుకని ఈ వేదశాస్త్రముల ప్రచారము అత్యంత అపేక్షితమైనది అని భావించి ఆ పాఠశాల ఈ క్షేత్రములో నూట ఇరవై అయిదు సంవత్సరాల పూర్వము ప్రారంభింపబడినది. 

ప్రస్తుతము, లోకుల మనసులలో విదేశసంస్కృతి , మన సంస్కృతికన్నా ఎక్కువగా ప్రచారములో ఉంది. విదేశ సంస్కృతి చేత ఆకర్షింపబడిన ప్రజలు విదేశ సాంప్రదాయాలను ఆచరించుట చాలా సముచితము అన్న భ్రమలో ఉన్నారు. విదేశీయులు దేన్ని ఆచరిస్తున్నారో, వారు ఎలాగ వేషభూషణ భాషలను ప్రదర్శిస్తున్నారో , వారు ఏ విధముగా భోజనము చేస్తారో ,ఏ విధముగా గానము చేస్తారో అదే మంచిది అన్న భ్రమ, మనవారి మనసులలో నిలచిపోయింది. మన వాస్తవికమైన స్థితి ఎటువంటిది, మన నిజమైన సాంప్రదాయాలు ఎట్టివి అన్నది మనవారు అందరూ మరచిపోయారు.


 ఈ దుష్ట పరిస్థితి, రెండువందల యాభై సంవత్సరాలనుండీ, ఆంగ్లేయుల పరిపాలన జరగడము వలన మన మనసులు కలుషితమై  ప్రావిర్భవించినది . ఆ ఆంగ్లేయులు, " ఎప్పుడైతే ఈ భారతీయులు తమ స్వధర్మాన్ని మరచిపోతారో,  తమ సంస్కృతిని మరచిపోతారో,  తమ సంస్కృత భాషను మరచిపోతారో, అప్పుడే తమ కార్యము సులభముగా చేయవచ్చును "  అని వారు అనేక కార్యాలను చేయనెంచినారు.  వారికి ఇఛ్ఛ వచ్చినట్టు చేయవచ్చని , మన సంస్కృత భాషను ’ మృత భాష ’ గా ప్రచారము చేయాలని భావించి అటువంటి కార్యాలను మొదలుపెట్టారు. 

" ఎప్పుడైతే   మన సంస్కృత భాషపై జనులకు శ్రద్దాసక్తులు తగ్గిపోతాయో , అప్పుడు ఎవరూ ఈ భాషను అభ్యసించరు, మరియు, ఈ భాషయొక్క అనభ్యాసము వలన వేద శాస్త్రాల అభ్యాసము లుప్తమవుతుంది, సనాతన ధర్మపు గ్లాని కలుగుతుంది అప్పుడు అందరూ విదేశీ సంస్కృతిని ఆచరిస్తారు " అని వారు తలచి, సర్వ ప్రథమముగా సంస్కృత భాషను ’ మృతభాష ’ అని ప్రచారము చేసి మన మనసులలో సంశయాలకు బీజము వేసినారు.

 మనలోని కొందరు మూర్ఖులు, వారు చెప్పినది సత్యమని తలచి మన భాషను విస్మరించి, సంస్కృత భాషపైన శ్రద్ధను వహించక తాత్సారము చేసి సంస్కృత భాషాభ్యాసము మానేసి తమ జీవితాలను గడుపుచుండేవారు. దానితో ఆంగ్లేయులు తాము కృతార్థులమైనట్టు భావించారు. తాము అనుకున్నది జరిగింది, అందరూ తమ సంస్కృతభాషను మరచేటట్టు చేశాము , దీనితో మేము పూర్తిగా కృతార్థులము అయినట్టే అని వారనుకున్నారు. 


అయితే పరమేశ్వరుని కృపవల్ల, మన భారతీయుల మనసులలో సంస్కృతభాష పైన శ్రద్ధ అంకురించింది. ఆ శ్రద్ధను అంకురింపజేయుటకు , ఆ శ్రద్ధను వృద్ధిచెందించుటకే మన పరమపూజ్య గురుసమానులు కొన్ని ప్రయత్నాలను చేయాలని అనుకున్నట్టుగానే , వారి ప్రయత్నములచేతనే శృంగేరీ ’ సద్విద్యా సంజీవిని ’ సంస్కృత పాఠశాల సమారంభమైనది. వారిమార్గములోనే నడుస్తున్న మనము , ఆ సంస్కృత భాషా ప్రచారము కోసము ఎన్నో దారులు వెతికాము. " సుర సరస్వతీ సభా" యొక్క ప్రతిష్ఠాపనము, అక్కడక్కడ సంస్కృత పాఠశాలల ఉద్ఘాటన , శాస్త్ర సభల ఆయోజనము , శాస్త్రవిద్వాంసుల సమ్మానము, శాస్త్రాధ్యయనము చేసేవారికి ప్రోత్సాహము , ఇటువంటి విహితమైన క్రమములు మాచేత చేపట్టబడినవి. 

దీని ఫలితముగా అక్కడక్కడా సంస్కృత విద్వాంసులను ఈనాడు మనము చూస్తున్నాము. సంస్కృతము మీద ఉత్సాహము , శ్రద్ధ గల విద్యార్థులను చూడగలుగుతున్నాము.  మరియూ , శాస్త్ర , వేద విషయములలో కూడా శ్రద్ధ కలిగిన ఆస్తికులను కూడా చూడగలుగుతున్నాము. ప్రస్తుతము చాలామంది ఆస్తికులు ఉన్నారు. వారు స్వయముగా సంస్కృతము గానీ , వేదమునుగానీ నేర్వకున్ననూ , ఎరుగకున్ననూ , వాటిలో అతిగొప్ప శ్రద్ధను కలిగిఉన్నారు. 

సంస్కృతముయొక్క ప్రచారమునకు సహాయము చేయుటకు ’ నేనంటే నేను ’ అంటూ ముందుకు వస్తున్నారు. అందువల్ల ఈ సంస్కృత ప్రచారము కొరకు మేము చేస్తున్న ప్రయత్నాలలో ఇక్కడ , శృంగేరీ సంస్కృత విద్యాపీఠము యొక్కస్థాపనము అనన్యమైనది . 

పూర్వ ప్రధాని , మమ్ములను చూచుటకు శృంగేరికి వచ్చినపుడు, వారి సమక్షములో ఈ విషయము మాచేత ప్రస్తావించబడినది. వారు కూడా మా మనసులోని ఈ సంకల్పాన్ని  ఎంతో శ్రద్ధతోను, సంతోషముతోను ఆమోదించినారు. మా సంకల్పము ను తప్పక నెరవేర్చెదమని ప్రతిజ్ఞ చేసినారు. వారి ప్రతిజ్ఞాపాలనము వల్లనే , ఈ ’ రాజీవ్ గాంధీ విద్యాలయము ’ అను  సంస్కృత విద్యాపీఠముయొక్క స్థాపనము జరిగినది. మా మనస్సు అత్యంత ప్రమోదమును పొందినది. భగవతీ శారద మా పైన అత్యంత అనుగ్రహము కలిగియున్నది అన్న తృప్తి కలిగినది. 


విద్యాపీఠముయొక్క స్థాపనమయితే అయింది కానీ అందులో అధ్యాపకులు ఎటువంటి వారుండవలెను , ఇక్కడ అధ్యయనము ఏ విధముగా జరగాలి, అని మరలా మా మనసులో కొంత దిగులు కలిగినది. ఆ దిగుళ్ళు కూడా భగవతీ కృపవల్ల నివారించబడి,  న్యాయము , వేదాంతము , వ్యాకరణములలోను, మీమాంస లోనూ నిష్ణాతులైన విద్వాంసులు ఇక్కడ నియమింపబడినారు.  మరి యే విద్యాపీఠములలోనూ చూచుటకు దొరకనటువంటి విద్వాంసులు ఇక్కడ అధ్యాపనములో నిరతులై ఉండుట మేము భగవతీ శారద యొక్క కృపగా భావిస్తున్నాము. 

ఇక్కడ అధ్యయనము చేస్తున్న విద్యార్థులు కూడా అమిత ఉత్సాహముతో , గొప్ప శ్రద్ధాభక్తులతో అభ్యసిస్తున్నారు. ఇదంతయూ సాక్షాత్కరించుకోవడము , సర్వులకూ శుభము కలుగుట ,  భగవతీ శారద యొక్క అనుగ్రహము తప్ప మరొకటి కాదు అనుటలో యేమాత్రమూ  సంశయమూ లేదు. 


ఈ సురభారతి యొక్క ప్రచారము మా అందరి అన్ని కర్తవ్యములకన్నా అత్యంత ముఖ్యమైనది అని మేమందరమూ  భావిస్తున్నాము. అందరికీ ఒక్కొక్క కర్తవ్యము ఉంటుంది ,  కానీ అందరూ కలసి ఒక్క కార్యమును చేయుట అనేది సుర సరస్వతి యొక్క ప్రచారము. కాబట్టి మా కర్తవ్యమునుండి  ఎప్పుడైనా కూడా , యే మాత్రము కూడా విచలితులము కాకూడదని , ఏ విధమైన కష్టములు వచ్చినా కూడా  ఈ కర్తవ్యము తప్పక నిర్వహించవలసినదే అని, ఈ కర్తవ్యాన్ని మేము నెరవేర్చవలసినదే ఈ సంకల్పము అందరి మనసులలోనూ సుదృఢముగా ఉండాలని నా కోరిక. 

చాలామంది , " శాస్త్రములను అధ్యయనము చేస్తే ప్రయోజనమేమి ? "  అని సంశయిస్తారు. అయితే ఒక్కొక్క శాస్త్రమునూ అధ్యయనము చేస్తేనే గానీ అక్కడ ఎన్నెన్ని విషయములు ఉన్నవి , మన జీవితాలను సార్థకము చేయుటకు ఎన్ని మార్గములు శాస్త్రములలో చెప్పబడినవి , అన్న విషయము శాస్త్రాధ్యయనము  తరువాత మాత్రమే తెలుస్తుంది. శాస్త్రము చదవకుండా వాటిని అర్థము చేసుకొనుట వీలుకాదు. కాబట్టి, శాస్త్రములను అవగాహన చేసుకొని , జీవితమును ఫలవంతముగా గడిపే దారి ని శాస్త్రాధ్యయనము ద్వారా సరిగా  తెలుసుకోగలుగుతాము. 


సర్వులకూ జీవిత అంతిమ లక్ష్యము మోక్ష ప్రాప్తి. మోక్షప్రాప్తితోనే  జీవితము సార్థకము అవుతుంది.  లేకపోతే మరల మరల ఈ జీవన ప్రవాహములో మగ్నము , నిమగ్నము అగుటయే మన భాగ్యము అవుతుంది. ఎంతవరకూ మనము ఈ జనన , మరణ ప్రవాహము నుండీ బయటకు రాలేమో , అంతవరకూ  మనకు సుఖలేశమూ ఉండదు , లేదు.  ఈ జనన మరణ ప్రవాహమునుండి బయటకు ఎప్పుడు రాగలమంటే , శాస్త్రములలో యే సాధన మార్గములు చెప్పబడి ఉన్నవో , వాటి అనుసరణము చేత మాత్రమే అది సాధ్యము. ఆ మార్గములు శాస్త్రములచేత మాత్రమే ప్రదర్శింపబడినవి, శాస్త్రములచేత ఉక్తమైన  ప్రదర్శింపబడిన అట్టి సన్మార్గములు మాత్రమే మన చేత పాటింపదగినవి. కాబట్టి అందుకోసమే మనమందరికీ శాస్త్రాధ్యయనము అనివార్యము అయినది. 

పూర్తిగా శాస్త్రాధ్యయనము చేయలేకున్ననూ , వాటిలోని సారాన్ని గ్రహించి పాటించి , జీవితాలను సార్థకము చేసుకొనుట మన విధి. కాబట్టి మన అందరి అభ్యుదయము కొరకూ మూలభూతమైనవే ఈ రెండూ-- శాస్త్రము , మరియూ సంస్కృత భాష. కాబట్టి శాస్త్రముల అధ్యయనము , వేదాభ్యాసము అనునవి మన శ్రేయస్సుకోసమే కల్పింపబడినవి. మన శ్రేయస్సును మనమే సాధించాలి. వేరొకరు మన శ్రేయస్సుకు సాధకులు కాలేరు. మన శ్రేయస్సును మనమే సాధించాలంటే , శాస్త్రాలను , సంస్కృత భాషను అవశ్యము అభ్యసించవలెను. దానికోసమే ఈ విద్యాపీఠము సమారంభమైనది .. 

ఇప్పుడు దీనికి ఇరవై అయిదేళ్ళు గడచినవి. ఇరవై ఆరో సంవత్సరములో ఈ విద్యాపీఠము అడుగు పెట్టబోతున్నది. ఇదే విధముగా ఇంకో ఇరవై అయిదేళ్ళ తరువాత స్వర్ణోత్సవము , అటు పిమ్మట శతమానోత్సవము కూడా జరుగుతుంది. అటువంటి ఆ ఉత్సవాలలో భాగము వహించుటకు మాకు సాధ్యము కాకున్ననూ , ఈ ఉత్సవాలు తప్పకుండా జరుగుతాయి అని విశ్వసిస్తున్నాము. శారదా భగవతిని మీ అందరి శ్రేయస్సు అనే పరంపరలో భాగము వహించమని ప్రార్థిస్తున్నాము. 


ఈ రజత మహోత్సవము యొక్క ఆచరణలో గొప్ప శ్రద్ధతోను, ఉత్సాహముతోను అనేకులు తమ కర్తవ్యాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ ఆశీర్వాదములను ఇస్తున్నాను. 
ఈ కర్నాటక రాజ్యము యొక్క రాజ్యపాలులైన  సహృదయాగ్రేసరులు వజుభాయి వాలా  మహోదయులు ఇక్కడికి వచ్చి , తమ భావములను ఇక్కడ ప్రకటించినారు. అది విని మాకు అత్యంత ప్రమోదము కలిగినది. మన భారతీయ సంస్కృతి , మన సంస్కృత భాషలలో వారికున్న శ్రద్ధ ఎంతో శ్లాఘనీయము. అందుకు వారికి విశిష్ట ఆశీర్వాదములను అందిస్తున్నాము. ఇదేవిధముగా , మన కర్నాటక సంసద్ సదస్యులు , మన శృంగేరీ శాసక సభ్యులు , కర్నాటక విత్తకోశపు మహా ప్రబంధకులు మొదలుగా అనేకులు ఇక్కడికి వచ్చి సంసృత భాష మీద తమకు గల శ్రద్ధను ఇక్కడ ప్రకటించినారు. వారందరికీ కూడా మా ఆశీస్సులు.  ఈ సంస్థానము యొక్క కులపతి ’ పరమేశ్వర నారాయణ భట్టులు , ఈ  విద్యాపీఠముయొక్క ప్రాచార్యులు సచ్చిదానంద భట్టు లు ఈ కార్యక్రమమును ఎంతో శ్రద్ధతో చేసినందుకు వారికి నా ఆశీర్వాదములు. ఇక్కడ సమావేశమైన సర్వులకు భగవతీ శారద తన శ్రేయః పరంపరతో సర్వదా సర్వులనూ  అనుగ్రహించాలని  ప్రార్థించి , అందరికీ ఆశీర్వాదములతో నా భాషణమును ముగిస్తున్నాను. 

https://www.youtube.com/watch?v=c2Fduv_9dz8