SHARE

Wednesday, February 3, 2016

సనాతన ధర్మపు రహస్యము---మూడవ[చివరి] భాగము

సనాతన ధర్మపు రహస్యము---మూడవ[చివరి] భాగము

గురువులు :- " మీకు పూర్తిగా అర్థము కావలెనంటే నేను క్రైస్తవ మతపు ఉదాహరణ తీసుకొని వివరిస్తే తమరు నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను. 

మోక్షానికీ, లేదా స్వర్గానికీ అవశ్యకమైనది క్రీస్తుపైన విశ్వాసము మాత్రమే అన్నపుడు , క్రీస్తు కన్నా ముందు పుట్టి చనిపోయిన వారందరికీ ముక్తి దొరికే అవకాశము లేకుండినది అని వారికి స్వర్గము నిరాకరించవలసి వస్తుంది. వారంతా యే తప్పూ చేయకున్ననూ కేవలము వారు క్రీస్తు కన్నా ముందు పుట్టినారు అన్న క్షుల్లకమైన కారణముచేత మనము అలాగ చేయవలసి వస్తుంది. అదేవిధముగా , ఆ అవకాశాన్ని , జీసస్ గురించి తెలియని , వినని అతని సమకాలీకులకూ , మరియూ క్రీస్తు గురించి యేమీ తెలియక , ఈ యుగములోనే బతుకుతున్న కోటానుకోట్ల మంది ప్రజలకూ కూడా ముక్తికి అవకాశమే లేకుండా పొమ్మనవలసి వస్తుంది. 

సృష్టి మొదలైన అనేక యుగాల తరువాత ,  అకస్మాత్తుగా ఏదో ఒకరోజు  జ్ఞానోదయమై తెలివితెచ్చుకొని , మానవ కులానికంతటికీ  ముక్తికి సాధనమైన మార్గము ఇదీ ...అంటూ భగవంతుడు  ఒక ధర్మాన్ని విధించినాడా ? అది భగవంతుని లక్షణము కాదని  మీరు గమనించలేదా ?  అలాగచేయుట భగవంతునికి ఉచితమని భావిస్తున్నారా ? ఆ భగవంతుడు , జీసస్ పుట్టుటకు ముందే పుట్టిన వారికి కూడా ఆత్మ ఉంటుంది , ఆ ఆత్మలకు కూడా ముక్తి అవసరము అనేమాట మరచినాడా ? లేకపోతే ముక్తిసాధనమును రూపించుటలో అతడు జాగ్రత్త వహించినాడా ? అలాగ జాగ్రత్త వహించి ఉంటే , అతని ముక్తి సాధనము , ’ ముందు ముందు ఎప్పుడో జనించబోయే జీసస్ పైన నమ్మకము దానికి అత్యవసరము ’  అనే నియమానికి అది లోబడి ఉండుట సాధ్యము కాదు కదా ? కాబట్టి , సృష్టికి ఆదికాలములోనే మొట్టమొదటి వ్యక్తిని  పుట్టించినపుడే , ఆ వ్యక్తికి ముక్తి సాధనమును కూడా కల్పించియే ఉండవలెను. దీన్నే వైచారిక నిరూపణ అంటారు. 
ఎందుకంటే ఆ మొట్టమొదటి మానవుడికి కూడా మోక్షపు అవసరము ఉంటుంది. అందుకే మేము , వేదము మరియూ మొట్టమొదటి మానవుడు [ హిరణ్యగర్భుడు ] ఇద్దరూ కూడా ప్రారంభము నుండే కలిసే ఉన్నారని నమ్మేది. కలిసే ఉన్నారు అంటే ఒకేసారి సృష్టించ బడినారు అని అర్థము కాదు. సృష్టికి ఆరంభమే లేదు. అంతా అనాది అనేది మా నమ్మకము. [ శాస్త్ర ప్రక్రియల అధికరణముల మూలముగా ఈ మాటను ఋజువు చేయవచ్చు ] . ఇవి కలిసే ఉన్నాయి అంటే , భగవంతుని చేత అవి రెండూ ఏకకాలములో వ్యక్తమైనాయి అని అర్థము. [ వేదపు మూలమును , అపౌరుషేయత్వమును అర్థము చేసుకొనవలెనంటే మీమాంసా శాస్త్రమును చదివితే చాలు ] . మొత్తానికి సృష్టి తరువాత " భగవంతుడు కాని " ఎవరో ఒక వ్యక్తి లేదా బోధకుడి ద్వారా తన ప్రారంభాన్ని పొందిన యే ధర్మమైనా దోషపూరితము మరియూ అశాశ్వతము కూడా. 

మిస్టర్ " ఎ ":- " అర్థమయినది.. అయితే మానవుడు ముక్తిసాధనమును లేదా ధర్మమును స్వతః తనంత తానే కనుక్కొనుటకు అసమర్థుడు , అతడికి ఇతరుల సహాయము లేనిదే అది జరగదు అని మీరే చెప్పుచున్నారు కదా .. అటువంటి సహాయాన్ని మానవుడికి ఇచ్చినవారు దేవుడే కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు .. కాదంటారా ? "

గురువులు :- " అలాగ ఇతరులనుండీ సహాయము తెచ్చుకొనుటకు , మానవునికి తాను పొందవలసిన ఒకానొక ’ వస్తువు ’ లేదా ’ లక్ష్యము ’ అనేది ఒకటి ఉంది అన్న అవగాహన ఉండవలెను. అటువంటి వస్తువు యొక్క ’ నిజానుభవము ’ పొందినపుడు మాత్రమే అటువంటి వస్తువు ఉంది అని అతడు తెలుసుకొనుటకు సాధ్యము. అటువంటి లక్ష్యము గురించి అవగాహన లేకుండా ఆ ప్రయత్నము ఎలాగ ప్రారంభమవుతుంది " 

అదీకాక , ఒకటోది---నిర్దిష్ట సాధనము ఒకటి ముక్తికి ఖచ్చితముగా తీసుకొని పోగలదు అని ఒకడికి అవగతము కావలెనంటే , అతడు దానిని మొదటే అవలంబించి , అనుసరించి ఉండవలెను. దీనిని ఒప్పుకుంటే , ఒక వ్యక్తి తాను అనుసరించి సఫలము కాకముందే ఆ మార్గాన్ని ఎలా ఎరుగును ? అనే ప్రశ్న ఉద్భవిస్తుంది.

లేదా , రెండోది--- ఆ వ్యక్తి సర్వజ్ఞత్వము వలన , ’ లక్ష్యము ’ మరియూ ’ సాధనా మార్గము ’ రెంటినీ ఏకకాలములో చూడగల సామర్థ్యము పొందిన వాడై ఉండాలి.. దీనిని ఒప్పుకుంటే , అతడు తనలో ఇంతకు ముందు లేని సర్వజ్ఞత్వాన్ని ఎక్కడ నుండీ , ఎలాగ పొందినాడు ? అనే ఆటంకము వస్తుంది..

కాబట్టి , మూడోది--- అతడు , తానే సాక్షాత్తూ ’ లక్ష్యము ’ అయి ఉండి , తనను పొందే విధానమును ఈ జగత్తుకు బోధించవలెను. అటువంటి వ్యక్తి మనకు ఎవరూ సాక్షాత్కారము కాలేదు... అయితే ,

శృతి లేదా ’ వేదము ’ మోక్షపు దారిని మనకు చూపిస్తుంది కాబట్టి , ఆ వేదము తన మూలాన్ని భగవంతుడిలోనే కలిగి ఉన్నది అనే ఈ మూడోదాన్ని మాత్రమే మనము తార్కికముగా ఒప్పుకోవలసి వస్తుంది.  [ సామాన్య ఇంద్రియాలూ మరియూ మనోబుద్ధుల అనుభవపు పరిధిని దాటితే కలిగే ఈ జ్ఞానమే శృతి లేదా వేదము అని పిలువబడుతుంది ].

మిస్టర్ " ఎ ":- " మోక్షాన్ని , దైవాన్నీ తెలుసుకొనుట కష్టము కావచ్చు . అదే కాక , దానిని తెలుసుకొనుటకు ఒకడికి , అది తెలిసిన మరొకడి మార్గదర్శనపు అవసరమూ ఉండవచ్చు. కానీ అతడికి మోక్షము అనే దొకటి ఉండవచ్చు అనే అవగాహన కలుగుటకు శృతి యొక్క సహాయమేమీ అవసరము లేదు కదా ? మన బుద్ధి శక్తి నుండే మనము దానిని ఊహించవచ్చు కదా ? "

గురువులు :- భగవంతుడి అస్తిత్వమును అంత స్వతంత్రముగా , మరియూ సులభముగా ఊహించగలిగితే , ప్రపంచములోనున్న నాస్తికుల గురించి ఏమి చెపుతారు ? మీకన్నా వారి ఆలోచనా పటిమ , విచార శక్తి తక్కువ స్థాయి లోనిది అనేది మీ అభిప్రాయమా ? భగవంతుడి అస్తిత్వము గురించి ఆలోచించే లక్ష్యాన్ని తీసుకొని ఆ ప్రయత్నములో విఫలమై , దేవుడు లేడు అనే వారు కూడా అసామాన్య బుద్ధిశక్తితో కూడి ఉంటారు. వారి వైఫల్యానికి వారి బుద్ధి , మేధస్సులలోని దోషము కాదు కారణము. " భగవంతుడు మూలతః విచారమునకు నిలుచు వాడు , దొరకువాడూ కాదు " అనేదే దానికి కారణము. ఒక వేళ అలాగ తర్కముతో భగవంతుడిని  ఊహించగలిగితే , అలాగ ఊహకు నిలచు " దైవము ’ లేదా ’ మోక్షము ’ అనే వస్తువొకటి ఉంది అని మీకెవరు చెప్పినారు ? అనే ప్రశ్న వస్తుంది. దైవాన్ని గురించి తర్కించుటకు , లేదా ఊహించుటకు మొదట మీరు ఖచ్చితముగా దైవాన్ని గురించి తెలిపే ఏదో ఒక మూలము నుండీ దానిని గురించి వినియే ఉండవలెను. ఆ మూలమును అవలంబించియే ఉండవలెను. ’ దేవుడున్నాడు ’ అని ఎవరో ఒకరు చెప్పిన తరువాతే  , ఆ మాటను ఒప్పుకొనుటకో లేక విమర్శించుటకో మీరు మీ బుద్ధి శక్తిని , విచార మాధ్యమమునూ ఉపయోగించుటకు సాధ్య పడేది.. దేవుడి గురించి మీరు విననే లేదన్నప్పుడు , మీ బుద్ధిశక్తి ఆవైపు మళ్ళే ప్రసక్తే ఉండదు. 
"

మిస్టర్ " ఎ ":- " నా బుద్ధిశక్తిని ఉపయోగించే ముందు నేను దేవుడి గురించి వినియే ఉండవలెను అనేదేమీ లేదు. ’ దేవుడు ’ అనే పదము మనసులో లేకుండవచ్చు , కానీ , సతతమూ మార్పు చెందుతున్న ఈ జగత్తుయొక్క నేపధ్యములో ఉన్న నిత్యముగనూ , అవికారముగనూ ఉన్న వస్తువొకటి ఉంది అనేది సహజముగానే నా బుద్ధికి గోచరిస్తుంది . "

గురువులు :- కొంచము వివరించండి 

మిస్టర్ " ఎ ":- " జగత్తులో చీకటి- వెలుగు , చైతన్యము- జడత్వము , సుఖము-దుఃఖము , చావు-పుట్టుక మొదలగు అనేక వైరుధ్యములను --లేక ద్వంద్వములను నిర్లక్ష్యము చేయుటకు లేదు. నా ఊహ ఇలాగ ఉంటుంది.... ’ జగత్తులో మార్పులు ఉన్నట్లే , దానికి విరుద్ధముగా , మార్పు పొందని, వికారము లేని వస్తువొకటి జగత్తు నేపధ్యములో ఉండవలెను. ప్రతి క్షణమూ , ప్రతి వస్తువూ నాశము పొందునట్లే , ఆ నాశపు వెనకాల నాశ రహితమైన వస్తువొకటి ఉండే తీరవలెను. ఇలాగ నేను , అనేకము , అనిత్యము , అసమరూపము మరియూ వికారమూ అయిన వస్తువుల ఆధారముతో , ఏకము , నిత్యము , సమరూపమూ మరియూ అవికారమూ అగు వస్తువును తర్కిస్తాను. నా ఈ విధమైన ఊహ జగత్తులోని అన్ని వస్తువులకూ అన్వయిస్తుంది కూడా". 

గురువులు :- " అలాగైతే , ఉదాహరణకు , " గుర్రము " అనే వస్తువు యొక్క విరుద్ధ వస్తువు ఏది ? గుర్రము అనేది ఇంద్రియములకు గోచరమగు ఒక భావాత్మకమైన విషయము. కాబట్టి , దానికి విరుద్ధమైన అస్తిత్వాన్ని ఊహించుటకు మీకు సాధ్యము కావలెను కదా ? ఆ విరుద్ధ వస్తువు ఏది ? నా ప్రశ్న కొంచము అసంగతముగా కనపడవచ్చు.. కానీ మీ సందేహాలను తీర్చుటకు దీనికి ఉత్తరము ఇవ్వవలసిన అవసరముంది".

మిస్టర్ " ఎ ":- " గుర్రానికి " అగుర్రము " లేదా గుర్రము లేకుండుటే దానికి విరుద్ధము. 

గురువులు :- సరిగ్గా చెప్పినారు.. అయితే ఈ " అగుర్రము " ఒక భావాత్మక నైజ వస్తువా ? లేక నిషేధాత్మక మిథ్యా వస్తువా ? " అదొక జంతువా లేక మీ ఈ ’ అగుర్రపు ’  కల్పన జగత్తులోని మిగిలిన [ గుర్రము తప్ప ] అన్ని వస్తువులనూ తనలో కలిగి ఉన్నదా ? "

మిస్టర్ " ఎ ":- " ఖచ్చితముగా చెప్పవలెనంటే అది జగత్తులోని ఇతర అన్ని వస్తువులనూ తనలో కలిగి ఉన్నది.. ఆ అర్థములో ఒక రాయి కూడా ’ అగుర్రము ’ అవుతుంది. కానీ మేము అన్వయిస్తున్న నిషేధము కేవలము గుర్రానికి సంబంధించి నందువల్ల ’ అగుర్రము ’ అనేది ఒక భావాత్మక వస్తువనే చెప్పవలెను. అనగా , గుర్రము లోనున్న " అశ్వత్వము " అనే విశేషణమును దాని విరుద్ధములో నిషేధించుట చాలు అనుకుంటాను. అంటే అగుర్రములో అశ్వత్వము ఉండదు.. కాబట్టి అగుర్రమంటే గుర్రము కాని ప్రాణి అనవచ్చు. "

గురువులు :- " అంటే ఒక వస్తువు యొక్క విరుద్ధము , ఆ వస్తువుయొక్క వర్గానికే చెందినది.. అయితే ఆ వస్తువు పొందిఉండే ఏదో ఒక విశేషణపు విషయములో మాత్రము వస్తువుకన్నా భిన్నముగా ఉంటుంది.. అంతే కదా ? ఇంకా స్పష్టముగా చెప్పాలంటే , ఆ వస్తువుకు , ప్రపంచములోని వేరే యే వస్తువుకూ " సంపూర్ణమైన " విరోధము అనేదే ఉండదు. విరోధము యేమున్ననూ ’ విశేషణము ’ మాత్రమే. అంటే  ఒక వస్తువులో ఉన్న , మరియూ ఇంకో వస్తువులో లేని " విశేషణమే " మనలను అవి రెండూ " పరస్పర విరుద్ధ " ములు అని అనుకునేటట్టు చేస్తుంది. అవునా ? 

మిస్టర్ " ఎ ":- " అవును " 

గురువులు :- అయితే , ఉదాహరణకు , మీరు చెప్పిన  పరస్పర విరుద్ధాలైన చీకటి వెలుగులను తీసుకుందాము. రెంటికీ ఉన్న విశేషణము ఏమంటే , కాంతి యొక్క ఎక్కువ తక్కువలు. అయితే  వెలుగు యొక్క తీక్ష్ణతను మనము చీకటి యొక్క దృష్టికోణము నుండీ చూచుటకు సాధ్యము.. అలాగే , చీకటిని వెలుగు యొక్క మానిని తో కొలుచుటకు సాధ్యము.  అలాగ సాధ్యమయినపుడు , కాంతి యొక్క ఎక్కువ తక్కువలు రెంటిలోనూ ఉంటాయి కాబట్టి అవి ఒకదానికొకటి విరోధములు కావు.  ఇలాగ చీకటి వెలుగులు సంపూర్ణ విరోధములు కాకపోగా , పరస్పర సాపేక్ష వస్తువులుగా పరిణమించి మీ వైరుధ్య సిద్ధాంతము వీగిపోతుంది. 

తర్కపు ఎల్ల [ సీమ ] గురించి మీరు తప్పుగా అర్థము చేసుకున్నా రనిపిస్తుంది. నేను మొదటే చెప్పినట్లు , " తర్కించతగిన వస్తువు ఒకటుంది " అన్న పూర్వ జ్ఞానము లేకుండా తర్కపు ప్రక్రియయే ప్రారంభము కాదు. .. తన జీవితములో ఎన్నడూ మంటను కనీ , వినని వాడు , దూరమునుండీ పొగను చూడగనే అక్కడ దానికింద మంటకానీ నిప్పు కానీ ఉందని ఊహించలేడు. అలాగ ఊహించవలెనంటే అతడు దానికి ముందు ఒకసారైననూ అగ్గిని చుసి ఉండవలెను మరియూ దానినుండీ పొగ వెలువడడము అతడికి తెలిసియే ఉండవలెను. 

దీనిని ఇంకో రకంగా చెప్పాలంటే , నిప్పును ఎన్నడూ చూడని వాడికి , పొగయే సత్యము. అగ్గి కాదు. " గోచరమవుచున్న వస్తువు నిరపేక్షము కాదు. అది తన అస్తిత్వానికి ఇంకొక వస్తువు పై ఆధారపడి ఉంది." అని మొదటే మీకు తెలియక పోతే , ఆ వస్తువు వెనుక ఉండే మరొక వస్తువును తెలుసుకోవలెను అన్న ఆసక్తే మీకు కలగదు. అలాగే , మనము ’ అవికారమైన " వస్తువు గురించి విని ఉండకపోతే మనము ప్రపంచాన్ని , అది మన ఇంద్రియాలకు గోచరించే రీతిలోనే గ్రహిస్తాము. ఈ వికారి యైన జగత్తే మనకు అంతిమ సత్యముగా కనబడుతుంటుంది. అట్టి జగత్తే అందరి ఇంద్రియాలకూ గోచరమగుట వలన దాని ఉనికి గురించి పెద్ద వివరణ అవసరము లేదు. మార్పు చెందే దానిలో చెప్పడానికి ఏముంటుంది ? వికారమే దాని స్వభావము. తన ఆ ’ స్వభావాన్ని ’ అది పోగొట్టుకుంటే అది " ప్రపంచము " అనిపించుకోదు. మనకు  అవికారి అయిన వస్తువుయొక్క పూర్వ జ్ఞానమున్నపుడు మాత్రమే దానికీ , మరియూ ఈ జగత్తుకూ ఉన్న సంబంధమును మనము ఋజువు చేయవచ్చు. అవికార వస్తువు యొక్క అస్తిత్వాన్ని తెలిపి  దాని ద్వారా మనలను విచారపు జాడలోకి వెళ్ళుటకు ప్రేరేపించుటకు మనకు వేదపు అవసరము ఉంది. తర్కము , విచారము , బుద్ధి , యుక్తి/లేదా అనుమానము --ఇవన్నీ ఈ విషయములో సహకారులైననూ , శృతి యొక్క సురక్షిత మార్గ దర్శనము లేక , కేవలము తర్కాన్ని మాత్రమే ఆశ్రయిస్తే చీకట్లో వెదుకులాటే అవుతుంది.
అదీ కాక , " ఈ జగత్తులోని ప్రతీ వస్తువూ వికారానికి లోనవుతుంది " అన్న ఇంద్రియ గోచరమైన విషయపు ఆధారముతో మీరు ఇంకదేన్నో తర్కించుటకు మొదలు పెట్టితే , మీ ఆ తర్కము ఈ [కింది] విధముగా ఉంటుంది...

" ఈ జగత్తులోని ప్రతీ వస్తువూ వికారానికి లోనవుతుంది " కాబట్టి దాని నేపథ్యములో ఉండే ఇంకే వస్తువైనా వికారియే ..--అనుకుంటే , మీ అనుభవము మీకు , ’ ఉన్నదంతా వికారము చెందేదే ’ అని చెప్పినపుడు , మీ తర్కము , వికారి కాని ఇంకో వస్తువు గురించీ తెలుపుటకు సాధ్యము లేదు. అదేకాక , ఆ ’ ఇంకో వస్తువు ’ కూడా ఇంద్రియ ప్రపంచము వలెనే వికారి.... అని ఆ తర్కము చెబుతుంది. అలాగ ,ఆ  తర్కముతో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళిననూ ఇంద్రియ విషయములనుండీ తప్పించుకొనుటకు సాధ్యము కాదు. ఎందుకంటే మీ తర్కము ఆ ఇంద్రియ గ్రాహ్య విషయముల వ్యాప్తిలో మాత్రమే తిరుగుతుంటుంది...[ అంటే అది ఇంద్రియముల ద్వారా పొందిన జ్ఞానపు ఆధారము మీదే నిలచిఉంటుంది.] 
ఒకవేళ మీకు అదృష్టముంటే  మీ తర్కము మిమ్మల్ని " అవికారి అయిన ఏదో ఒక వస్తువు ఉండవచ్చు " అనే స్థాయి వరకూ తీసుకు వెళ్ళవచ్చే గానీ " అటువంటి వస్తువు ఒకటుంది " అని చెప్పజాలదు. 

మిస్టర్ " ఎ ":-" శృతి అపౌరుషేయము " వేదమే ప్రపంచపు అన్ని ధర్మాలకూ మూలము [ వేదోఽఖిలో ధర్మ మూలం ] అనే మాట కేవలము ఉత్ప్రేక్ష అనీ , అతిశయమనీ నేను ఇన్ని రోజులూ భావిస్తూ వచ్చినాను. దాని గురించి ఇటువంటి వివరణను నేను ఇంతవరకు వినే ఉండలేదు. ఈ వివరణ ఇచ్చినందుకు మీకు నేను ఋణపడిఉన్నాను. 

కానీ నా మొదటి సమస్యే మళ్ళీ ఉద్భవిస్తుంది కదా ? వాస్తవానికి ఈ ప్రపంచములో అనేక ధర్మాలున్నాయి. అవన్నీ కూడా  ’ మనిషిని వెలుగుకు తెచ్చేది తమ ధర్మము ఒకటే " అంటూ తమకు తామే ఘోషించుకుంటాయి. అలాగ పరస్పర విరోధములైన ఆ అనేక ధర్మాల ఔచిత్యాన్ని గురించిన నా మొదటి ప్రశ్న పరిహారము దొరకకనే అలాగే ఉండిపోయింది కదా ? "

గురువులు :- " ఈ వైవిధ్యము ’ అధికార తత్త్వము ’ పైన నిలచి ఉందిఅని నేను మీకు మొదటే చెప్పినాను. వాస్తవానికి అధికారమే మానవుని చర్యలను నియంత్రించేది. ఈ అధికారములో వివిధ మెట్లున్నాయి. వాటికి అనుసారముగనే వివిధ ధర్మాలున్నాయి "

మిస్టర్ " ఎ ":-" అర్థమయినది. అయితే ఏ ధర్మము కూడా తనను ఒక నిర్దిష్టమైన స్థాయిలోని ప్రజలకు పరిమితము చేసుకొనుటకు సిద్ధముగా లేదు. ప్రతియొక్క ధర్మమూ తనను ప్రపంచములోని అత్యంత శ్రేష్ఠమైన ధర్మముగా పరిగణించుకొంటుంది"

గురువులు :- " బాలకుడు ఒకడికి, ఒకే సమయములో నలుగురు మనుషులు నాలుగు రకాలైన ఆదేశాలను ఇచ్చినారనుకుందాము... ఒకరు " దీపం వెలిగించు " అంటే , మరొకరు , " వత్తిని సరిచేయి " అంటారు. మూడోవాడు ," నూనె నింపు " అంటే , నాలుగవ వాడు, " దీపము ఆర్పు " అంటాడు. ఇటువంటి పరిస్థితిలో బాలకునికి ఏమి చేయాలో తోచదు. వాడికి ఈ నాలుగు పనులనూ ఏకకాలములో చేయుటకు సాధ్యము కాదు. కానీ ఆ నలుగురూ తన ఆజ్ఞనే పాలించమని బెదిరించో , వత్తిడి చేసో చెబుతారు. అప్పుడు ఆ అర్భకుడు ఏమి చేయవలెను ? అదే సమయములో , ఐదో వాడొకడొచ్చి " ఒక కత్తిని తీసుకొని రా " అని చెబితే , అప్పటికే ఉన్న నాలుగు ఆజ్ఞలకు తోడు మరోదాన్ని కలిపినట్టవుతుంది. పరస్పర విరోధములైన ఆజ్ఞల వలన బాలకుని మనసు అప్పటికే అయోమయమును పొంది ఉంటుంది. వాడిప్పుడు , నాలుగింటికి బదులు , ఐదింటిలో ఒకదాన్ని ఎంచుకోవలసి వస్తుంది. ఈ ఐదోవాడి ఆగమనము వలన ఆ బాలకుని అయోమయము తగ్గక పోగా , మరింత ఎక్కువవుతుంది. అయితే , ఆ ఐదోవాడు ఆ పిల్లవాడిమీద కనికరము కలిగి , పిల్లవాణ్ణి ఇరకాటమునుండీ తప్పించవలెను అనిపిస్తే , మరియూ ఆ పిల్లవాడు కూడా ఆ ఐదోవాడిపై , మిగిలిన నలుగురిపై చూపిన శ్రద్ధ కన్నా ఎక్కువ శ్రద్ధ చూపినపుడు , " కత్తి మాత్రము తీసుకొని రా , మిగిలిన వారి ఆజ్ఞలను పాలించ వలసిన అవసరము లేదు " అని గట్టిగా చెప్పవలసి ఉంటుంది. అనగా , అప్పటికే అయోమయములో ఇరుక్కున్న బాలకునికి మార్గదర్శనము చూపించుటకు ఆ ఐదోవాడు తన ఆజ్ఞ  తప్ప ఇతరుల యే ఆజ్ఞ కూడా పాలించుటకు యోగ్యము కాదు అని చెప్పవలసి ఉంటుంది. శ్రద్ధతో తనను ఆశ్రయించిన సాధకునికి మార్గదర్శనము నివ్వవలె ననుకునే ఏ గురువైనా , [ శిష్యుని పై కనికరముతో అతడి అయోమయమును నివారించుటకు , సమయము వ్యర్థము కాకుండా తప్పించుటకు ]  " ఇతరుల ఆదేశాలను పట్టించుకోక నేను చెప్పినట్లు మాత్రమే చేస్తే చాలు " అనవలసి ఉంటుంది. 

మిస్టర్ " ఎ ":- " కానీ ఆ ధర్మ ప్రవర్తకులు , మత ప్రవర్తకులూ తమ దగ్గరికి వచ్చు వారి యోగ్యత , సందర్భము లకు అనుసారముగా తమ బోధనలను చేసినారు. ఇంకోరీతిలో చెప్పాలంటే , స్వతః నిరపేక్ష సత్యమును తెలిసినవారై ఉండి కూడా వారు జనులకు సాపేక్షమైన సత్యమును మాత్రమును చెప్పేవారు. జనులకు ఏమి బోధించవలెను అనుదాన్ని నిర్ధారించుటలో వారు సత్య నిష్ఠ కన్నా ఎక్కువగా అనుకూల / అవకాశ వాదాన్ని అనుసరించినారు... కాదా ? "

గురువులు :- " వారు జనుల అవసరాలనూ , అర్హతలనూ గమనములో ఉంచుకొని ఆ విధముగా చేసినారు. [ సత్యమును దాచిపెట్టే ఉద్దేశముతో కాదు ] . నేను మొదటే చెప్పినట్టు చన్నీరు ఆరోగ్యవంతుడి దాహాన్ని తీరిస్తే , జ్వరపీడితుడైన వాడి రోగాన్ని అది ఎక్కువ చేస్తుంది. వైద్యుడొకడు , ఒకడికి చన్నీటిని తాగమని చెప్పి , మరొకడికి దాన్ని నిషేధిస్తే ఆ వైద్యుడిని పక్షపాతి లేదా మోసగాడు అనవచ్చునా ? ఒక వ్యక్తి ఆయాసాన్నీ దప్పికనూ పరిహరించి , మరొకడి రోగాన్ని ఎక్కువ చేసిందంటూ నీటిని కూడా దూషించలేము. "

మిస్టర్ " ఎ ":- " అయితే , ఒక ’ గురువు ’ బోధించే సత్యము [ ధర్మము ] సాపేక్షమో నిరపేక్షమో తెలుసుకొనుట ఎలాగ ? 

గురువులు :- " దానిని మీరు ఎందుకు తెలుసుకోవలెను ? మీ ఉద్దేశము , జగత్తులోనున్న గురువులలో నున్న ఉచ్చ-నీచాల అంతరాలను కొలవడమా ? లేక మీ బ్రతుకు నియంత్రణ ద్వారా ’ సుఖ శాంతులను పొందు మార్గాన్ని ’ తెలుసుకొనుటా ? "
మిస్టర్ " ఎ ":- " నా ఉద్దేశము రెండూ అయి ఉంది. ఏ గురువు లేక ధర్మము ’ సత్యానికి ’ సమీపముగా ఉంది ? అనేది మొదట నేను తెలుసుకోవలెను. అది తెలుసుకున్న తరువాతే ఆ ధర్మపు , మరియూ ఆ గురువుయొక్క బోధనకు అనుగుణముగా నేను నా బ్రతుకును మార్చుకొనుటకు సాధ్యము " 

గురువులు :- " ఇద్దరు వ్యక్తుల సామర్థ్యమును పరీక్షించి పోల్చాలనుకొనే వ్యక్తి , ఆ ఇద్దరు వ్యక్తులకన్నా ఎక్కువ సామర్థ్యమును పొంది ఉండవలెను. అలాగ లేకుంటే ,  వారిలోనున్న అనేక దోషములు ఆ పరీక్షించేవాడి గమనానికే రావు. క్రీస్తు , మహమ్మద్ , బుద్ధుడు మొదలగు మత ప్రవర్తకుల బుద్ధి సామర్థ్యములను నిర్ణయించ గలిగేటంతటి  బుద్ధి సామర్థ్యములను మీకు దేవుడు కరుణించినాడు అని మీరు భావిస్తున్నారా ? రెండు ధర్మాలలో ఏది శ్రేష్ఠము అని తెలుసుకోవలెనంటే ఆ రెంటినీ కూలంకషముగా అధ్యయనము చేయవలసి ఉంటుంది. రెండు ధర్మాల సంగతి అటుంచుదాము , ఒకే ఒక ధర్మాన్నయినా మీరు సంపూర్ణముగా తెలుసుకున్నారా ? మన జీవితము , ధర్మపు ఒకే ఒక్క మెట్టును కూడా అర్థము చేసుకొనునంతటి దీర్ఘమైనది కాదు. [ ఆయుష్షు చాలదు ] అలాగున్నపుడు , మీ ’ అన్ని ధర్మాల  అధ్యయనము ’ ముగిసిన తరువాత , మీరు ఒప్పుకొన్న ఏదో ఒకధర్మాన్ని కార్య రూపానికి తెచ్చుటకు మీ వద్ద సమయము ఉంటుందా ? "

మిస్టర్ " ఎ ":-" మరి అలాగయితే , మీరు ఇప్పుడు నాకు ఇవ్వబోయే అనుష్ఠాన యోగ్యమైన ఉపదేశము ఏమిటి ? నేనేమి చేయవలెను ? "

గురువులు :- " మీరు దేవుడిని నమ్ముతారు కదా ? "

మిస్టర్ " ఎ ":-" అవును , నమ్ముతాను "

గురువులు :- " ఆ దేవుడు సర్వజ్ఞుడు [ సర్వమూ తెలిసిన వాడు ] అని నమ్ముతారా ?"

మిస్టర్ " ఎ ":- " ఖచ్చితముగా నమ్ముతాను "

గురువులు :- " జగత్తులో జరిగే అన్ని సంఘటనల లోనూ ఆతడి సర్వజ్ఞత్వము ప్రకటమవుతుంది అనేదాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నారా ? " 

మిస్టర్ " ఎ ":- " అవును నేను గమనించినాను "

గురువులు :- " అలాగయితే ఆ సర్వజ్ఞత్వము మీ జీవితములో కూడా వ్యక్తమయినది... ఔనంటారా కాదా ? "

మిస్టర్ " ఎ ":-" ఔను " 

గురువులు :- " మిమ్మల్ని పుట్టించుటలో భగవంతుడికి ఒక ఉద్దేశము , అది కూడా సదుద్దేశమే అయి ఉండవలెను కదా ? "

మిస్టర్ " ఎ ":- " ఔను. ఈ జగత్తులో జరిగే యే ఘటన కూడా అనుకోకుండా యాదృచ్చికముగా జరిగినది కాదు అనేది నా దృష్టికి వచ్చింది "

గురువులు :- " అలాగయితే , భగవంతుని దృష్టిలో క్రైస్తవ ధర్మము మాత్రమే మీ అర్హతకు సరిగ్గా అలవడుతుంది. క్రైస్తవులైన దంపతుల కడుపున మీరు పుట్టిన దాని వెనుక ఉండే ఉద్దేశపు వివరణను  ఎంచే పని లేదు. మనము పాలించవలసిన ధర్మమును గురించి మనము భగవంతుని నిర్ణయములో విశ్వాసము నుంచుటయే మంచిది. మన మార్గాన్ని నిర్ణయించుటకు మన అల్ప బుద్ధికి సాధ్యము కాదన్నది ఆతడికి తెలుసు. కాబట్టి ఆతడే మన మార్గాన్ని నిర్ధారించే బరువు ఎత్తుకున్నాడు. మన మనోభావాలకు సరిగ్గా సరిపోయే దేశము , కాలము , పరిసరములు మరియూ ధర్మములో మనకు జన్మనిచ్చినాడు. ఆతడు ఈ విధముగా మనమీద కరుణతో , మన అనుకూలము కోసమై చేసిన యోజనను మనము ఎందుకు తిరస్కరించవలెను ? " వివిధ ధర్మాల తులనాత్మక అధ్యయనము " అనే అసాధ్యపు సాహసానికి ఒడిగట్టి సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవలెను ? "

మిస్టర్ " ఎ ":- " క్రైస్తవ ధర్మాన్ని అర్థము చేసుకొనుటకూ , మరియూ దాన్ని అనుసరించుటకూ నేను సాధ్యమయినంత శ్రమించినాను. కానీ మరలా మరలా సందేహాలు కలుగుతుంటాయి. వాటిని పరిష్కరించగల వ్యక్తులను సంధించుటలో విఫలుడనైనాను. ఆ కారణము చేతనే నేను నా దృష్టిని ఇతర ధర్మాల వైపు సారించినాను. "

గురువులు :- " కేవలము ధర్మాన్ని అధ్యయనము చేసిన పండితులను  సంధిస్తే ప్రయోజనము లేదు. తమ దైనందిన జీవితములో ధర్మాన్ని కార్య రూపానికి తెచ్చుకున్న వారిని , ధర్మాన్ని జీవితములో అలవరచుకొన్న వారిని కలిసేవరకూ మీకు ధర్మపు సందేహాలను పరిష్కరించుకొనుటకు సాధ్యమే కాదు. లౌకిక ప్రయోజనాల కోసము మీరు సముద్రాలనూ , ఆకాశాన్నీ దాటుటకు సిద్ధముగా ఉంటారు. కానీ సత్యాన్ని గురించిన సందేహాలను పరిహరించే గురువులు మీ ఇంటివాకిలికే రావాలని కోరుకుంటారు.  " ధర్మము అనేది బ్రతుకులో ఒక ఆసక్తికరమైన అంశము " అనే  మీ భావన మొదట మార్చుకోవలెను. ఎప్పుడైతే మీరు , " ధర్మమనేది బ్రతుకు యొక్క ఒక అంగము మాత్రము కాదు ,  అది పూర్తీ బతుకే అయిఉంది " అని తెలుసుకుంటారో , అప్పుడు మాత్రము మీరు సరియైన గురువులను వెదుకుతారు. అంతవరకూ అటువంటి అనివార్యత కనబడదు.  ఆ అవగాహన వచ్చిన తరువాత వెదుకులాట తీవ్రమవుతుంది . గురువు కూడా దొరకనే దొరుకుతాడు. ఎందుకంటే గురువు ఎప్పుడూ సిద్ధముగనే ఉంటాడు. మన పరిసరాల్లోనే ఉంటాడు. అయితే మనలో జ్ఞానపు ఆకలి తీవ్రమై , మనము ప్రామాణికముగా వెతుకు వరకూ అతడు దొరకడు. కంటికి కనబడినా తెలుసుకోలేము. క్రైస్తవ ధర్మములో అటువంటి గురువులు లేరు అనే మాటను మేము ఒప్పుకోము. అటువంటివారు జనసందడితోనున్న ఈ ప్రపంచములో మీ పరిసరాల్లోనే ఉండవచ్చును. గమనానికి రాలేదు. ఎందుకంటే అటువంటివారు ఈ జగత్తుకు అవసరము లేదు. వారికీ ఈ జగత్తుయొక్క గుర్తింపు అవసరము లేదు. ఆ గుర్తింపు వల్ల వారికి యే ప్రయోజనమూ లేదు. కాబట్టి మీరు అటువంటి గురువును మీ పరిసరాల్లోనే వెదకండి. " దయతో నా సందేహాలను తీర్చండి " అని వినమ్రులై వేడుకోండి. ఆ క్షణములోనే వారు మీ సందేహాలన్నిటినీ దూరము చేస్తారు. క్రమేణా , ’ క్రైస్తవ తల్లిదండ్రులకే మీరు ఎందుకు పుట్టినారు , దానిలో భగవంతుని ఉద్దేశమేమి అనేది మీకే అర్థమవుతుంది.. "

మిస్టర్ " ఎ ":-" మీ కృపాపూరితమైన ఉపదేశానికి నేను తమకు ఎంత నమస్కరించిననూ తక్కువే. దయచేసి ఈ ఒక్క మాటను చెప్పుటకు నాకు అనుమతినివ్వండి ,.. నేను ఇక్కడికి వచ్చునపుడు , నేను మొదటికన్నా ఉత్తమ క్రైస్తవుడిని కావలెను అన్న ఉద్దేశాన్ని పొంది ఉండలేదు. నా అభిలాష , హిందువుగా మారవలెనని ఉండినది. అయితే తమరి ఉపదేశము నన్ను ఇంకా ఉత్తమమైన క్రైస్తవుడిగా అగుటకు ఉపయోగపడుతుంది. క్రైస్తవుడిని ఉత్తమ  క్రైస్తవుడిగాను , ముసల్మానును ఇంకా ఉత్తమ ముసల్మాను గానూ , హిందువును ఇంకా ఉత్తమ హిందువుగానూ చేసే , ఇలాగ , ఆయా ధర్మపు వారిని ఆయా ధర్మాల పరిధులలోనే , ఇంకా ఉత్తములను చేయుటయే సనాతన ధర్మమయినపుడు , మీ ఈ సనాతన ధర్మము నిశ్చయముగా , నేను వెనుక భావించిన దానికన్నా విశాలమూ , గొప్పదీ అయి ఉన్నది.. మీనుండీ వీడుకొలుపుకు ముందు మరొకసారి తమ ఆశీర్వాదాన్ని వేడుకుంటున్నాను. " 

గురువులు :- " ఆశీర్వాదమునిచ్చు యోగ్యత ఉన్నది భగవంతునికి మాత్రమే. ఆతని కృపాశీర్వచనముల కోసము మనమందరమూ అతడిని ప్రార్థించవలెను. " అతడు మీకు దృఢమైన  శరీరమును మరియూ సూక్ష్మమైన బుద్ధి శక్తినీ  కరుణించినాడు " అని నేను మీకు మరొకసారి గుర్తు తెచ్చుటకు   ఇష్ట పడుతాను "

" ఒకడు అత్యుత్తమ చిత్రకారుడై ఉండి , అతడికి అత్యుత్తమ గుణముగల రంగులూ మరియూ కుంచెలు ఉండి ఉండవచ్చు.. అతడు తన కళాకృతిని రచించుటకు ఉత్తమమైన వస్తువు- విషయాన్నే ఎంచుకొని ఉండవచ్చు.. కానీ అతడు ఏ ఆధారమూ లేక కేవలము గాలిలో చిత్రాన్ని చిత్రించలేడు. చిత్రించుటకు అతడికి ఒక స్థిరమైన నేపథ్యపు అవసరము ఉంటుంది. ఆ నేపథ్యము , ఒక బట్ట , గోడ , లేక ఉపయోగము లేని ఒక మొరటు వస్తువై ఉండవచ్చు. కాబట్టి మీరు దైవదత్తమైన మీ బుద్ధిశక్తులను వివిధ ధర్మాల తులనాత్మక అధ్యయనానికి , మౌల్యముల గురించి పసలేని వ్యర్థ చర్చలకు ఉపయోగించవద్దు. ఆ బుద్ధిని మీ జన్మతః లభించిన క్రైస్తవ ధర్మపు నేపథ్యాన్ని మరింత స్థిరముగా చేసే వైపుగా తిప్పుకోండి. ఆ క్రైస్తవ నేపథ్యము పైన , సాధన అనే చిత్రము పూర్తి అయిన పిమ్మట , మీరు దాని సౌందర్యాన్ని ధ్యానించుటకు సమర్థులైనపుడు మీ దృష్టినుండీ ఆ నేపథ్యము తనంతట తానే చెరిగిపోతుంది. అయితే దానికన్నా ముందు అది సాధ్యము కాదు "  ఈ చివరి మాటను గుర్తుపెట్టుకోండి "
|| సమాప్తమ్ ||