SHARE

Tuesday, January 26, 2016

శివలింగాలు- సాలగ్రామాలు

శివలింగాలు- సాలగ్రామాలు 



" శివమ్ " అంటే ’ శుభం ’ అని అర్థము. " శివ లింగము " అంటే " శుభచిహ్నము " అని అర్థము.
" లింగ పురాణము " ప్రకారము , ఒకసారి విష్ణువు , బ్రహ్మ ఇద్దరూ మాయలో పడి " నేను గొప్ప " అంటే " నేను గొప్ప " అని అహంకరించుతుండగా , శివుడు వారి ముందు ఒక అనంతమైన పొడవు గల అగ్నిస్థంభమై ప్రత్యక్షమై , ’ ఈ స్థంభపు కొనలేవో తెలుసుకున్నవారే గొప్ప ’ అంటాడు. బ్రహ్మ విష్ణువులు అది కనుగొనుటలో విఫలులై , శివుడే తమ ఇద్దరికన్నా గొప్ప అని అంగీకరిస్తారు. ఆ అగ్ని స్థంభమే " లింగము " గా పిలవబడింది. ఎందుకంటే , సర్వ ప్రాణులూ ప్రళయకాలములో ఆ స్థంభములోనే లయించి పోతాయి [ లీయతే అస్మిన్ , లేక లయం గఛ్చంతి ] 


లింగాలు ముఖ్యముగా రెండు రకాలు. అకృత్రిమ లింగాలు-- ఇవే స్వయంభూ లింగాలు , బాణ లింగాలు. అవి ప్రకృతిలో సహజ సిద్ధముగా ఏర్పడతాయి.
 రెండో రకము , " కృత్రిమమైనవి " అనగా మానవ నిర్మితమైనవి. 
ఇంకోవిధమైన విభాగము , " చల " మరియు " అచల " లింగాలు. కదిలేవి , కదలనివి. అనగా ఇళ్ళలోనూ ఉత్సవాల్లోనూ పూజించేవీ , గుళ్ళలో ప్రతిష్ఠింపబడినవీ...

ఈ లింగాలు రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటి పీఠము లేక యోని... దీన్నే సోమసూత్రము అంటారు. రెండు , దానిపైన ఉన్న లింగము. శివలింగములోని అధో భాగాన్ని " బ్రహ్మ భాగము " అనీ , మధ్య భాగాన్ని " విష్ణు భాగము " అనీ , ఊర్ధ్వ భాగాన్ని " రుద్ర భాగము " అనీ అంటారు. సాధారణముగా బ్రహ్మభాగము భూమిలో పాతిపెట్టబడి ఉంటుంది.
నిర్ణయ సింధువు ప్రకారము , 
శివలింగాన్ని మనకు కావలసిన ఫలితాలను బట్టి ఎంచుకోవాలి . చర శివలింగము , అంటే ఒకేచోట స్థాపితము కానిది--మరియూ మానవ నిర్మితమైనది:-- పన్నెండు అంగుళాలకన్నా పెద్దదిగా ఉండరాదు.  రత్నము , బంగారము , వెండి , రాగి, ఇత్తడి , ఇనుము, రాతిది , కర్రది మరియూ మట్టిది-- ఇవన్నీ అదే క్రమములోనే ఒకదానికన్నా ఒకటి అధమమైనది.. అనగా రత్నముతో చేసినది అత్యుత్తమమైనది.. తర్వాత బంగారము... అలాగ. 

వీటిని తొమ్మిది నుండీ ఏడు అంగుళాల పొడవుగా చేయించుకొనుట ఉత్తమము. ఆరు , ఐదు, నాలుగు అంగుళములవి మధ్యరకాలు.  అంతకన్నా చిన్నవి అధమము. బొటనవేలికన్నా చిన్నది ఎప్పుడూ చేయించరాదు. 
వీటి ఎత్తూ , లావూ సమానముగా ఉండి , పీఠము తప్పనిసరిగా ఉండవలెను. పీఠపు ఎత్తు , లింగపు ఎత్తుకు రెట్టింపు ఉండాలి. లింగపు పైభాగపు విస్తీర్ణము ,[ లేదా వ్యాసము , లేదా కర్ణము]  లింగపు ఎత్తుతో సమానముగా ఉండాలి.ఇవి స్థూలముగా , మానవ నిర్మితమైన లింగాల కొలతలు. 

మట్టి , భస్మము , ఆవుపేడ , పిండి , రాగి, కంచు-- వీటిలో దేనితోనైనా లింగము చేయించి ఒకసారి పూజిస్తే , దేవలోకములో పదివేల కల్పములు నివసించుటకు అర్హత , యోగ్యతా సిద్ధిస్తాయి. 

కర్రతో చేసినదాన్ని ధనప్రాప్తికి పూజిస్తారు. వీటిని ఎర్ర చందనము , తుమ్మ ,బిల్వ చెక్కలతో చేస్తారు.  స్ఫటిక లింగాన్ని అన్నిరకాల కోరికలు తీరుటకు మరియూ చిత్తనైర్మల్యానికీ పూజిస్తారు. ముత్యపు లింగము పాపాలను హరిస్తుంది. 

బ్రాహ్మణులు నాలుగు లింగాలనూ , క్షత్రియులు మూడు లింగాలను , వైశ్యులు రెంటినీ , శూద్రులు ఒక లింగాన్నీ పూజించాలి. ఇంటిలో రెండు లింగాలను బ్రాహ్మణులు ఎన్నటికీ పూజించరాదు. శివ , సూర్య అర్చన లలో శంఖమును వాడకూడదు.

పగిలిన , దగ్ధమైన లింగాలను పూజింపరాదు. 

ఇక పార్థివ లింగాలు--అనగా మట్టితో కానీ బంకమట్టితో కానీ చేసిన లింగాలు. 

పార్థివ లింగపూజతో సర్వ కార్యములనూ సాధించవచ్చును. పార్థివలింగాన్ని పూజించేవాడు ఆయుష్మంతుడూ ,బలవంతుడు , శ్రీమంతుడు , పుత్రవంతుడు , ధనవంతుడు , సుఖి ఔతాడు. 

అలాగే , పేడతోను , బంగారముతోను , పట్టు వస్త్రముతోనూ చేసిన లింగాలు కూడా సర్వ కార్యాలనూ సాధించి ఇస్తాయి. 

పార్థివ లింగానికై మట్టిని తెచ్చేటప్పుడు " ఓం హరాయ నమః " అనే మంత్రాన్ని పఠించాలి.
మట్టిని కలుపుతూ లింగాన్ని చేసేటప్పుడు " మహేశ్వరాయ నమః " అని ధ్యానిస్తుండాలి. 
" శూలపాణయే నమః " అంటూ ప్రతిష్ఠ చేయాలి. 
" పినాక ధృతయే నమః " అంటూ ఆవాహన చేయాలి.
" శివాయ నమః " అంటూ స్నానము చేయించాలి.
" పశుపతయే నమః " అంటూ పూలతోను , బిల్వ పత్రాలతోను పూజించాలి.
" మహా దేవాయ నమః " అంటూ విసర్జన చేయవలెను. 
బిల్వపత్రాలు ఎండినవైననూ శుభమే. వాడినవైననూ " నమశ్శివాయ " అంటూ నీటితో కడిగి మళ్ళీ వాడవచ్చు. 
పార్థివ లింగాన్ని ఉమ్మెత్త పూలతో పూజించుట అతి శుభప్రదము. లక్ష గోవులను దానము చేసినంత ఫలాన్ని పొందుతాము. ఒకసారి తీసివేసిన రుద్రుని నిర్మాల్యాన్ని [ నిన్నటి పూజ తర్వాత వాడిన పూలను , పత్రాలను ] ముట్టుకోరాదు , తొక్కరాదు , తినరాదు. అట్లా చేస్తే వెంటనే వస్త్రాలతోపాటూ స్నానము చేయాలి. పూలను , మధ్యవేలు మరియు ఉంగరపు వేళ్ల మధ్యలో పట్టుకొని పూజించాలి. బొటన వేలు , చూపుడు వేళ్ళతో నిర్మాల్యము తీసేయాలి. నుదుట భస్మము , మెడలో రుద్రాక్షలూ లేకుండా శివపూజ చేయరాదు. పార్థివ లింగాన్ని ఎడమచేతిలో ఉంచుకొని , కుడిచేత్తో ప్రోక్షణ , పూజ చేసే వాడుక కర్నాటకలో ఉంది.  ఆంధ్రలో కూడా ఉండి ఉండవచ్చు. 

ఇక , మానవ నిర్మితము కాని--అనగా ప్రకృతిలో వాటంతట అవే సిద్ధముగా దొరికే కొన్ని లింగాల విషయము:-

సాలగ్రామములు, బాణ లింగాలు 



బాణలింగాలు పాలరాతినిపోలి ఉంటాయి. వాటిని పూజించుట వలన ఆత్మ జ్ఞానము , చిత్త నైర్మల్యము కలుగుతాయి. బాణ లింగాల విశేషత ఏమంటే వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేయకనే నేరుగా పూజించి అభిషేకము చేయవచ్చును. ఇవి ఎంత చిన్నగా ఉంటే ఫలము అంత అధికము. 

కానీ ముట్టుకోకుండా ఎవరైనా పూజ చేయవచ్చును. ఇది సాలగ్రామములకు మాత్రమే వర్తిస్తుంది. మానవ నిర్మితమైన శివలింగాలకు కాదు. మణులతో చేసిన లింగాలను కూడా సర్వులూ పూజించవచ్చు. పాదరసపు లింగాలను కూడా అందరూ పూజింప వచ్చు. 

" సాలగ్రామము " అనేది నిజానికి నేపాల్ లో గండకీ నది ఒడ్డున ఉన్న ఒక గ్రామము పేరు. అక్కడ ’ సాల ’ వృక్షాలు అధికము కాబట్టి ఆ పేరు. సాలగ్రామములనే రాతి చిహ్నాలు కూడా గండకీ నది ఒడ్డున దొరకుతాయి కాబట్టి వాటిని కూడా సాలగ్రామములు అనే అంటారు. 
వాటంతట అవే సహజ సిద్ధముగా ఏర్పడి దొరికే లింగాలలో బాణ లింగాలు , సాలగ్రామములు ముఖ్యమైనవి. బాణ లింగాలు నర్మదా , గండకీ నదిలోనూ ఒడ్డునా దొరుకుతాయి. 

సాలగ్రామములో నారాయణుడే ప్రతిష్ఠింపబడి ఉంటాడని ప్రతీతి. 

బదరీనాథ్ లోని నారాయణ విగ్రహము , ఉడుపిలోని కృష్ణ విగ్రహమూ సాలగ్రామ శిలతోనే మలచినట్టు గాథలున్నాయి. 

ఇతర విగ్రహాలలో పూజకు ముందు ఆయా దేవతలను మంత్రోక్తముగా ప్రతిష్ఠ , ఆవాహన చేయవలెను, కానీ సాలగ్రామములలో సహజముగానే  , ఎల్లపుడూ నారాయణుడి అస్తిత్వము కలిగి ఉంటాయి. 
సాలగ్రామాలను పూజించటానికి మంత్రాలూ , ఉపదేశాలూ అవసరము లేదు.
 స్వచ్చమైన మనసు , అహంకారము లేని చిత్తము , మంచి నడవడిక , ప్రాపంచిక విషయాలపై అనాసక్తి మాత్రము చాలును. సాలగ్రామాలను పూజించుతకు అతి సరళమార్గము ఏదంటే , సాలగ్రామాన్ని నీటితోగానీ పాలతో కానీ కడిగి [ స్నానము చేయించి ] దానిపై ఒక తులసీ దళమునుంచి , ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నివేదించుటే. 

సాలగ్రామాలు కూడా గండకీ మరియూ ఇతర నదులలోనూ దొరుకుతాయి. సాలగ్రామములంటే రాళ్ళు కాదు.  అవి జీవముతో కూడుకున్నవి. ఒకానొక పురుగు తనచుట్టూ ఏర్పరచుకొన్న కోశమే [శిలాజము ]  గట్టిగా , రాతిలాగా కనపడుతుంది. వీటిని అభిషేకిస్తున్నపుడు ఒక్కోసారి అవి ప్రాణము వచ్చిన వాటిలా నీటిలో ఈదుతూ కదలుతాయి. ఇవి కూడా ఎంత చిన్నగా ఉంటే ఫలము అంత అధికము.

ఇంటిలో రెండు సాలగ్రామములను పూజింపరాదు. అయితే మిగిలిన సమ సంఖ్యలో [అనగా నాలుగు , ఆరు , ఎనిమిది .... అలాగ]  సాలగ్రామములను ఉంచుకొని పూజించవచ్చు. సాలగ్రామములు ఇంటిలో ఉంటే ప్రతిరోజూ తప్పక అభిషేకమూ నైవేద్యమూ చేసి పూజించాలి. అలాగే బేసిసంఖ్యలో [ మూడు , అయిదు, ఏడు... అలాగ]సాలగ్రామములను ఇంటిలో పూజించరాదు. కానీ ఒక్క సాలగ్రామమును పూజింప వచ్చు. 

సాలగ్రామ శిల , భగ్నమైనా కూడా [ పగిలినా కూడా ] , చక్రము కలదైతే పూజించవచ్చు. సాలగ్రామములపై చక్రాలు ఏర్పడి ఉంటాయి. అవి తెలిసినవారు గుర్తిస్తారు. వారాహ పురాణము  , " సాలగ్రామ శిలను , కొద్దిపాటి బంగారముతో అయినా సరే , దానము చేసిన నరుడు భూదానము చేసిన ఫలాన్ని పొందుతాడు , మరియూ భక్తితో నూరు సాలగ్రామములను పూజించిన వాడికి కలిగే గొప్ప ఫలితాన్ని నూరు సంవత్సరములు వర్ణించినా సరిపోదు." అంటుంది. 

ఈ సాలగ్రామాలు దానముగా ఇచ్చినవే ఉత్తమము , శుభదమూ అయినవి. డబ్బులిచ్చి కొన్నవి మధ్యమములు , యాచించి తెచ్చుకున్నవి అధమములు. 

సాలగ్రామాన్ని ఉపనీతుడు [ ఉపనయనము అయినవాడు ] మాత్రమే ముట్టుకొని పూజించుటకు అర్హుడు. ఉపనయనము కానివారు , స్త్రీలు ముట్టుకొనరాదు. అలాగ ముట్టుకుంటే నరకదోషము కలుగును అని ’విష్ణు ధర్మము’ గ్రంధములో ఉన్నది.

౧ సాలగ్రామాన్ని , శంఖాన్నీ , తులసీ దళాన్నీ ఒక పళ్ళెములో ఒకే చోట ఉంచినంతనే శుభాలు కలుగుతాయి.
౨. దానము , వ్రతము , పూజ లేక శ్రాద్ధములు సాలగ్రామపు సమక్షములో చేస్తే ఎక్కువ ఫలితాన్నిస్తాయి.
౩. సాలగ్రామాన్ని అభిషేకించిన తీర్థము తాగితే సర్వ పాపాలూ నశిస్తాయి.
౪. గ్రహణాదులలో చేసే జపతపాలు సాలగ్రామపు సమక్షములో చేస్తే అధిక ఫలాన్నిస్తాయి. 
౫. భక్తిలేకున్నా , సాలగ్రామాన్ని పూజిస్తేనే ఫలము దొరకుతుంది.
౬. సాలగ్రామము దానము చేయుట అత్యంత శుభమైన కర్మ. 


శివరాత్రికి అందరూ తమ తమ ఇష్టమైన శివలింగాలను , సాలగ్రామాలనూ పూజించి ధన్యులు అయ్యెదరని ఆకాంక్షిస్తూ.. 

శుభం భూయాత్ || 

Thursday, January 21, 2016

అయుత చండీ మహా యాగము

|| శ్రీః ||

|| అయుత చండీ మహా యాగము ||





|| నతత్ర దేశే దుర్భిక్షం న చ దుఃఖం ప్రవర్తతే |
న కాలే మ్రియతే కశ్చిత్ పూజ్యతే యత్ర చండికా ||

[ అమ్మలగన్న అమ్మ , విశ్వమాత అయిన చండిక ఎక్కడ పూజింపబడుతుందో , ఆ ప్రదేశములో దుర్భిక్షమన్నదిలేక సస్యశ్యామలముగనూ , ప్రజలంతా సుఖసంతోషాలతోనూ వర్ధిల్లుతారు. అక్కడ ఎటువంటి దుఃఖముగానీ , వినాశనముగానీ రోగములుగానీ  పేదరికము , రోగములు గానీ కలహములుగానీ ప్రవేశింపజాలవు. ]
మిత్రులకు అనేక ధన్యవాదములు...

గత నెల ఇరవై మూడు నుండీ... అంటే మార్గశీర్ష శుక్ల త్రయోదశి నుండీ అయిదు రోజులపాటు తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ చంద్రశేఖరరావుగారు తమరాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసము మాత్రమే గాక , యావద్భారత క్షేమాభివృద్ధి కోసము మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి గ్రామములోని తమ వ్యవసాయ క్షేత్రములో " అయుత మహా చండీ యాగాన్ని " దిగ్విజయముగా జరిపించినది మీరందరూ పత్రికా , ప్రసార మాధ్యమాలలో చూసే ఉంటారు. 

దాని ముందే వారు  శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానము దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠమ్ శృంగేరీ శారదాపీఠపు జగద్గురువులైన ,శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారి , తత్కర కమల సంజాతులు జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారి దివ్య మంగళ ఆశీస్సులతో ఈ మహాయజ్ఞానికి దీక్షవహించి శ్రీకారము చుట్టినారు. 

 జగదంబ అనుగ్రహము చేత అయుత చండీ మహాయాగములో ఋత్త్వికుడిగా పాల్గొనే భాగ్యము నాకు కలిగినది.. శ్రీ కె వి శర్మ గారి ప్రోత్సాహ సహకారాలతో  ఆ అవకాశము కలిగినది.. జన్మలో అది మరచి పోలేని అనుభవము.. అక్కడి అనుభవము , వివరాలూ అన్నీ ఒక నివేదికగా రాద్దామని మొదట అనుకున్నాను.. కానీ తిరిగి వచ్చిన తర్వాత టీవీలో అన్నీ చూపడమూ , వార్తాపత్రికలలో సమగ్రముగా ప్రచురించడము వంటివి తెలిశాయి... అందుకని , ఆ ప్రయత్నము తగ్గించి , ఋత్త్విజులకు మాత్రమే తెలిసే అవకాశమున్న కొన్ని వివరాలను మాత్రము మొదట రాయాలనుకున్నాను. చివరికి , అయిన ఆలస్యము ఎలాగూ అయింది కాబట్టి వీలైనంత సమగ్రముగానే రాయాలని నిర్ణయించి ఇది రాస్తున్నాను. 

ఆలస్యానికి క్షంతవ్యుడను. 

అయుతచండీ యాగము జరగబోవునని తెలిసినపుడు నా మనసు కొంచము అక్కడికి  వెళ్ళాలని ఆశపడింది. ఎందుకంటే గత ఆరేడేళ్ళనుండీ నేను ఉపాసించే దేవతనుద్దేశించి జరిగే యాగమది. ఇంతకు ముందు కొన్ని చోట్ల యాగానికి వెళ్ళాను గానీ ఈ యాగపు విశిష్టత తెలిసినకొద్దీ ఆ కోరిక బలపడింది. కానీ ఎలా వెళ్ళాలి , ఎవరిని సంప్రదించాలి అన్నవి తెలీదు. ’ సరేలే భాగ్యములో ఉండాలి కదా " అన్న ఆలోచనతో దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు.  దాదాపు మరచి పోయాను. తీరా యాగము ఇక మూడే రోజులుందనగా మళ్ళీ గుర్తొచ్చింది.. కానీ అప్పటికే ఆలస్యము అయింది కాబట్టి ఆశ వదలుకున్నాను. అయితే భక్తులపాలి కల్పవల్లి అయిన అమ్మవారి నిర్ణయము మరోలా ఉండింది. శ్రీ కేవీ శర్మ గారు ఇరవైన రాత్రి నన్ను అడిగారు , వెళతారా అని. వారెవరో మీలో చాలామందికి తెలిసి ఉంటుంది గానీ వారికి చెప్పకుండా మిగతా వివరాలు రాయలేను...

నా అదృష్టాన్ని నేనే నమ్మలేక , ఆనందముగా ఒప్పుకొని వెంటనే ఏర్పాట్లు చేసుకున్నాను.. ఒకేరోజు సమయము ఉండుట చేత ఎవరికీ చెప్పడముగానీ , ఫేస్ బుక్ లో రాయడముగానీ చేయలేకపోయాను.. ఇది కావాలని దాచినది కాదు. 

సరే నా వ్యక్తిగతమైన ఈ వివరాలు పక్కన పెట్టి  , యాగపు అంశాలను చూద్దాము.

కేసీఆర్ గారికి చండీ యాగాలు కొత్తేమీ కాదు . గత ఇరవై అయిదు సంవత్సరాలనుండీ చేస్తూనే ఉన్నారు.. యాగము కాదు కదా , సప్తశతీ పారాయణము కాదు కదా ,  నవార్ణమంత్రము కాదుకదా , కేవలము అమ్మవారిని రోజూ తలచుకున్నంత మాత్రానే ఎంతటి సంతోషము కలుగుతాయో, సమస్యలు ఎలా వీడిపోతాయో , ప్రశాంతత ఎలా కలుగుతుందో ... అమ్మవారిని భక్తితో మ్రొక్కే వారికే తెలుసు. ఇక ఇన్నేళ్ళనుండీ క్రమం తప్పక ఏకంగా హోమాలూ యాగాలే చేస్తున్న కేసీఆర్ గారికి కలిగిన అభివృద్ధీ , తీరిన కోరికలూ , వచ్చిన కీర్తీ.. ఇవన్నీ వారిని యాగాలను పదేపదే చేయించేలా తహతహలాడేలా చేసి ప్రేరేపించి ప్రోత్సహించేలా చేయడములో ఆశ్చర్యము ఏమీ లేదు.  యాగపు ఆ అయిదు రోజులూ వారు చూపిన శ్రద్ధా భక్తులు , సంయమనము , ప్రశాంతత , ఏకాగ్రత , అన్నీ చూస్తుంటే కొందరికి ఆశ్చర్యమగునేమో గానీ తెలిసినవారికి అది మామూలు విషయమే. అసలు ఆ అయిదురోజులే కాదు , అంతకుముందు కొన్ని రోజులు , వారాలు , నెలలుగా వారు యాగపు ఏర్పాట్లలో మమేకమై దీక్షగా అన్నీ చూసుకున్నారు.. కేసీఆర్ గారిని పొగడుట ఈ వ్యాసపు ఉద్దేశము కాదు గానీ , వారిని ప్రశంసించకుండా  ఈ వ్యాసమును ముగిస్తే అది అసంపూర్ణమూ , అన్యాయమూ కూడా అవుతుంది. వ్యాస విస్తరణ భీతి చేత " వారిని ఎంత పొగడినా తక్కువే , వారి శ్రద్ధాభక్తులు అనితర సాధ్యము , వారికి దేనినైనా సాధించుటకు సాధ్యమే "  అన్న ఈ వాక్యముతో వారి ప్రశంస ముగిస్తున్నా. 

యాగాలు శ్రౌత యాగాలు , స్మార్త యాగాలు అని ముఖ్యముగా రెండు రకాలు.. వీటిలో మళ్ళీ అనేక ఉప విభాగాలున్నాయి. స్మార్త యాగాలలో ఉన్న అనేక పద్దతులలో " శాక్తేయము " అనేది ఒకటి. అందులో ఆయా దేవతలకు [ అమ్మవారలకు ] విడివిడిగా చేసే హోమాలు ఉంటాయి.[ శ్రీ సూక్త హోమము , సరస్వతీ హోమము , దుర్గా హోమము , లలితా హోమము ఇలా... ]  అయితే చండికా అమ్మవారికి మాత్రము విడివిడిగా కాక ,  మహాకాళి , మహా లక్ష్మి , మహా సరస్వతులకు కలిపి సమిష్టిగా చేసేదే చండికా హోమము. 

ఈ చండికా హోమాలలో మళ్ళీ ఎన్నో రకాలు--- నవచండీ యాగము , శత చండీ యాగము , సహస్ర చండీ యాగము , అయుత చండీ యాగము , ప్రయుత చండీ యాగము వంటివి ఉన్నాయి. 

ఏ చండికా హోమమైనా , ఒక నిర్దిష్ట సంఖ్యలో సప్తశతీ పారాయణము , దానిలో దశాంశము [ పదో వంతు ] హోమము , దానిలో పదోవంతు తర్పణము , దానిలో పదో వంతు బ్రాహ్మణ భోజనము--- మాత్రమే గాక ,  అన్న సంతర్పణ ,దంపతీ పూజ , సువాసినీ పూజ , కన్యకా పూజలు కూడా ఉంటాయి. 

నవచండీ యాగము :- దీన్ని ఒకే ఒక్కరోజులో ముగిస్తారు. తొమ్మిదిసార్లు సప్తశతీ పారాయణము , హోమము , మిగిలిన పూజలూ నిర్వహిస్తారు.

శత చండీ హోమము :-- ఇది అయిదు రోజులు చేస్తారు. ఋత్త్విక్కులు పది మంది ఉంటారు. 
మొదటి రోజు పది సప్తశతీ పారాయణాలు , మరియూ నలభై వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. 
రెండవ రోజు ఇరవై సప్తశతీ పారాయణాలు , మరియూ ముప్పై వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
మూడవ రోజు ముప్పై సప్తశతీ పారాయణాలు , మరియూ ఇరవై వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
నాలుగవ రోజు నలభై సప్తశతీ పారాయణాలు , మరియూ పది వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
అనగా మొత్తము వంద సప్తశతీ పారాయణాలు , లక్ష నవార్ణమంత్ర జపాలు చేస్తారు. 
నాలుగు రోజుల్లోనూ ప్రతిరోజూ నవావరణ పూజ , చతుష్షష్టి యోగినీ దేవతల పూజ , దీప సహిత బలి , కల్పోక్త పూజతోబాటు కుంకుమార్చన , అవధారలు [ అంటే చతుర్వేద పారాయణాలు , శాస్త్ర , సంగీత , ఇతిహాస , పురాణ సేవలు ] చేస్తారు. 
ఐదవరోజు , అగ్ని ప్రతిష్టాపన చేసి , ఏడు వేల ఆహుతులతో అమ్మవారికి గుడాన్నము [ పరమాన్నము ]తో , పదివేల నవార్ణ మంత్రాలతో ఆజ్య హోమము , అంగ , ఆవరణ , పీఠ దేవతలకు ఆజ్య హోమము , తర్పణము చేసి ఇంద్రుడు , శక్తి మొదలగు దేవతలకు బలి దానము , పూర్ణాహుతి , దంపతీ, సువాసినీ , కన్యకా పూజలు చేసి అవభృతం [ యజమానికీ , వారి కుటుంబానికీ మంత్ర జలముతో ప్రోక్షణ ]చేస్తారు.యాగము సంపన్న మయ్యాక అన్న సంతర్పణ ఉంటుంది. 

సహస్ర చండీ యాగము :- ఇది కూడా అయిదు రోజులు చేసే యాగము. వందమంది ఋత్త్విక్కులుంటారు. 

మొదటి రోజు వంద సప్తశతీ పారాయణాలు , మరియూ నాలుగు లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
రెండవ రోజు రెండు వందల సప్తశతీ పారాయణాలు , మరియూ మూడు లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
మూడవ రోజు మూడు వందల సప్తశతీ పారాయణాలు , మరియూ రెండు లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
నాలుగవ రోజు నాలుగు వందల సప్తశతీ పారాయణాలు , మరియూ ఒక లక్ష నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
అనగా మొత్తము , వెయ్యి పారాయణాలు , పది లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.

తర్వాత , నాలుగు రోజుల్లోనూ ప్రతిరోజూ నవావరణ పూజ , చతుష్షష్టి యోగినీ దేవతల పూజ , దీప సహిత బలి , కల్పోక్త పూజతోబాటు కుంకుమార్చన , అవధారలు [ అంటే చతుర్వేద పారాయణాలు , శాస్త్ర , సంగీత , ఇతిహాస , పురాణ సేవలు ] చేస్తారు. 
ఐదవరోజు , అగ్ని ప్రతిష్టాపన చేసి , ఏడు లక్షల ఆహుతులతో అమ్మవారికి గుడాన్నము [ పరమాన్నము ]తో , లక్ష నవార్ణ మంత్రాలతో ఆజ్య హోమము , అంగ , ఆవరణ , పీఠ దేవతలకు ఆజ్య హోమము , తర్పణము చేసి ఇంద్రుడు , శక్తి మొదలగు దేవతలకు బలి దానము , పూర్ణాహుతి , దంపతీ, సువాసినీ , కన్యకా పూజలు చేసి అవభృతం [ యజమానికీ , వారి కుటుంబానికీ మంత్ర జలముతో ప్రోక్షణ ]చేస్తారు.యాగము సంపన్న మయ్యాక అన్న సంతర్పణ ఉంటుంది. 

                    అయుత చండీ మహా యాగము

గతనెలలో చేసినది ఈ అయుత చండీ మహా యాగమే. 
యాగము ప్రారంభమున కన్నా ముందే ,  అనగా ఇరవై రెండవ తారీఖున ఉదయమే, యాగ స్థలములో , గురు ప్రార్థన , గణపతి పూజ , పుణ్యాహవాచనము శాస్త్రోక్తముగా వేదోక్తముగా జరిగినాయి. ఉదకశాంతి ప్రయోగముతో క్షేత్ర , భూభాండ , ఆత్మ శుద్ధులు జరిగినాయి. మరునాడు ఉదయము . ఈ మహా యాగము నిర్విఘ్నముగా జరుగుటకు మహా గణపతికి అధర్వ వేదోక్తిగా [ అధర్వ శీర్షముతోనూ , మూల మంత్రముతోను గణపతి గాయత్రితోనూ ] సహస్ర మోదక హోమము నిర్వహించబడినది. మరలా గణపతి పూజ , పుణ్యాహవాచనము , [ దేవ] నాంది, అంకురారోపణము , ఋత్విగ్వరణము , జరిగినవి.  తరువాత కలశ స్థాపన , దీప స్థాపన , చండీ యంత్ర స్థాపన , దేవతావాహన , ప్రాణ ప్రతిష్ఠ [ కలశము మరియూ యంత్రములలో ] జరిగినవి. 
శృంగేరీ జగద్గురువులు కారణాంతరముల వల్ల రాలేకపోయిననూ వారి ప్రతినిధిగా శృంగేరీ ముఖ్య నిర్వహణాధికారియైన శ్రీ గౌరీ శంకర్ గారు వచ్చి , జగద్గురువుల ఆశీర్వచనాన్నీ , యాగపు విశిష్టతనూ , కేసీఆర్ గారి భక్తిశ్రద్ధలనూ వర్ణిస్తూ భాషించినారు.

ఇదికూడా అయిదు రోజులు జరిగే యాగము. వెయ్యిమంది ఋత్త్విజులుండవలెను. [ ఇక్కడ పదమూడు వందల దాకా ఉన్నాము ]

అయుత చండీ మహా యాగము మొత్తము డామర తంత్రోక్త విధిగా , శృంగేరీ పద్దతిలో జరిగినది. సప్తశతీ పారాయణము కూడా శృంగేరీ పద్దతిలో జరిగింది. 
ఈ అయుత చండీ మహా యాగములోని మరొక వైశిష్ట్యమేమనగా , అమ్మవారికి శాక్తేయ విధానములోయాగమే గాక , అయ్యవారికి కూడా [ శివయ్యకు ] శైవ పద్దతిలో అయిదురోజులూ మహాన్యాస పూర్వక" ఏకాదశవార రుద్ర అభిషేకము  , రుద్ర పారాయణము , రుద్ర క్రమార్చన , ఇతర అనుబంధ పూజలు"  జరిగినవి . అయిదోరోజు రుద్ర ఏకాదశవార హోమము జరిగినది.

మొత్తము పదహారు వందలదాకా ఋత్త్విజులు రాగా ,దాదాపు పదమూడు వందలమంది చండీ యాగానికి , మిగతావారు రుద్రయాగానికి వరణము అయినారు. 

మొదటిరోజు వెయ్యి చండీ పారాయణాలు , నలభై లక్షల నవార్ణ మంత్ర జపాలు చేయవలసి ఉండగా , అంతకన్నా ఎక్కువే , దాదాపు పదమూడు వంద పారాయణాలు , యాభైరెండు లక్షల నవార్ణ మంత్ర జపాలు జరిగినవి.

ఒక్కొక్క ఋత్త్విజుడూ మొదటిరోజు ఒక పారాయణము , నాలుగు వేల మంత్ర జపమూ చేయడము జరిగింది.

సప్తశతీ పారాయణములో మొదట పూర్వాంగములో ఏకాదశ న్యాసాలు , చండీ కవచ , అర్గలా , కీలక స్తోత్రాలూ ఉంటాయి. రాత్రి సూక్తము తరువాత ఒక్కొక్క అధ్యాయముగా పదమూడు అధ్యాయాలూ శ్రావ్యముగా , స్పష్టముగా , ఏకకంఠముతో అన్నివేల ఋత్త్విజులమూ పఠిస్తాము. ఒక్కొక్క అధ్యాయము తర్వాతా చిన్న మంగళారతీ , నివేదనా ఉంటుంది. అన్ని అధ్యాయాలూ అయ్యాక మంగళారతీ , అటుతర్వాత  ఉత్తర న్యాసాలు , దేవీ సూక్తము , తర్పణము , మంత్ర నివేదనము,  ఆ తర్వాత రహస్య త్రయము పఠనము ఉంటుంది. నవార్ణ మంత్రము కూడా పారాయణకు ముందూ వెనుకా నూటెనిమిది సార్లు జపిస్తాము. [ ఇది పారాయణములో భాగము. వేలలో జపించేది ప్రత్యేకము. 

రెండవ రోజు రెండు వేల సప్తశతీ పారాయణాలు , మరియూ ముప్పై లక్షల నవార్ణ మంత్ర జపాలు చేయవలసి ఉండగా , అంతకన్నా ఎక్కువే , అనగా దాదాపు రెండు వేల అయిదువందల పారాయణాలు , నలభై లక్షల మంత్ర జపాలు  జరిగినవి.

అంటే ఒక్కొక్క ఋత్త్విజుడూ రెండు పారాయణాలు , మూడు వేల నవార్ణ మంత్ర జపమూ చేయడము జరిగింది.

మూడవ రోజు మూడు వేల సప్తశతీ పారాయణాలు , మరియూ ఇరవై లక్షల నవార్ణ మంత్ర జపాలు చేయవలసి ఉండగా , అంతకన్నా ఎక్కువగా , దాదాపు నాలుగు వేల పారాయణాలు , ఇరవై ఆరు లక్షల నవార్ణ మంత్ర జపాలు జరిగినవి.

ఒక్కొక్క ఋత్త్విజుడూ మూడు పారాయణాలు , రెండు వేల మంత్ర జపాలు చేయడము జరిగింది.

నాలుగవ రోజు , నాలుగు  వేల సప్తశతీ పారాయణాలు , మరియూ పది లక్షల నవార్ణ మంత్ర జపాలు చేయవలసి ఉండగా , అంతకన్నా ఎక్కువగా , యాభైరెండు వేల పారాయణాలు , పదమూడు లక్షల నవార్ణ మంత్ర జపాలు జరిగినవి.

అయుతము అంటే పదివేలు. మొత్తము పదివేల సప్తశతీ పారాయణాలు కనీస సంఖ్యగా చేయవలెను.

అనగా మొత్తము పదివేల సప్తశతీ పారాయణాలు , ఒక కోటి నవార్ణ మంత్ర జపాలు జరగవలసి ఉండగా , పదమూడు వేల సప్తసతీ పారాయణాలు , కోటీ ముప్పై లక్షల నవార్ణ మంత్ర జపాలూ జరిగినవి. 
అనగా ఒక్కొక్క ఋత్త్విజుడూ నాలుగు పారాయణాలు , వెయ్యి మంత్ర జపాలు చేయడము జరిగింది. 

నాలుగు రోజుల్లోనూ ప్రతిరోజూ నవావరణ పూజ , చతుష్షష్టి యోగినీ దేవతల పూజ , దీప సహిత బలి , కల్పోక్త పూజతోబాటు కుంకుమార్చన , అవధారలు [ అంటే చతుర్వేద పారాయణాలు , శాస్త్ర , సంగీత , ఇతిహాస , పురాణ సేవలు ] చేసాము. 

ఐదవరోజు , అగ్ని ప్రతిష్టాపన చేసి , డెబ్బై లక్షల ఆహుతులతో ,  అమ్మవారికి గుడాన్నము [ పరమాన్నము ]తో , పదిలక్షల నవార్ణ మంత్రాలతో ఆజ్య హోమము ,[ అయుతం అంటే పదివేలు కదా , అలాగే పదివేల సార్లు ఏడు వందల శ్లోకాలతో  -- అనగా డెబ్బై లక్షల ఆహుతులు..]  అంగ , ఆవరణ , పీఠ దేవతలకు ఆజ్య హోమము , తర్పణము చేసి ఇంద్రుడు , శక్తి మొదలగు దేవతలకు బలి దానము , పూర్ణాహుతి , దంపతీ, సువాసినీ , కన్యకా పూజలు చేసి అవభృతం [ యజమానికీ , వారి కుటుంబానికీ మంత్ర జలముతో ప్రోక్షణ ]జరిగినవి. యాగము సంపన్న మయ్యాక హోమములో పదో వంతు కనీస సంఖ్యగా బ్రాహ్మణ భోజనాలు జరిగాయి. అలాగే లక్షలాది ప్రజలకు అన్న సంతర్పణ జరిగింది. ప్రతిరోజూ కూడా లక్షలలో అన్న సంతర్పణ జరిగింది.
ఆ ఐదురోజుల్లోనూ ప్రతిరోజూ చతుర్వేద స్వాహాకారాలు , దుర్గా హోమము , శ్రీసూక్తహోమము , గౌరీ హోమము, సరస్వతీ హోమము , మహా సౌరమూ కూడా జరిగాయి. ముత్తైదువలు కుంకుమార్చన చేసారు. 

ప్రధాన చండీ హోమాలు నూట ఎనిమిది కుండాలలో , నూటెనిమిది సృక్కులు , పదమూడు వందల సృవాలతో , అయిదు వేల కిలోల బియ్యము , ఆరు వేల కిలోల బెల్లము , నాలుగు వేల కిలోల నెయ్యి తదితర పదార్థాలు , శాస్త్ర ప్రమాణముగా నిర్ణయించిన హోమద్రవ్యాలు ఉపయోగించడము జరిగింది. అయిదో రోజు పూర్ణాహుతి శాస్త్రోక్తముగానూ , పౌరాణికముగాను రెండు సార్లు జరుగుట అమ్మవారి అనుగ్రహాన్ని సూచిస్తుంది.


యజమాని : యాగము చేయించే కర్త ను యజమాని అంటారు.  యజమాని మొదటిరోజే దీక్ష తీసుకొని , ఒంటిపూటే భోజనము చేస్తూ , నేలపై మాత్రమే నిద్రిస్తూ , బ్రహ్మచర్యము పాటిస్తూ రెండు పూటలా స్నానము చేస్తూ సమాహిత మనస్కుడై , మనసులో సదా అమ్మవారిని ధ్యానిస్తూ ఉండవలెను. శ్రీ కేసీఆర్ గారిని ఆ అయిదురోజులూ చూసినవారు  యాగపు అన్ని రోజులలోనూ దీక్షావస్త్రాలతో వారు పాల్గొన్న విధము చూసినవారు , అత్యంత ఆదర్శ ’ యజమాని’ ఎలాగుండవలెనో అలాగే ఉన్నారు అని ముక్తకంఠముతో కీర్తించినారు. వారు గతములో కూడా యాగాలు చేయించినది ఎరుగని ఇతర రాష్ట్రీయులు వారి శ్రద్ధా భక్తులను చూసి విపరీత సంభ్రమాశ్చర్యాలకు లోనయినారు. నేను కూర్చున్న కుండము దగ్గర తెలుగు , కన్నడ , మరాఠీ , ఉత్తర ప్రదేశ్ , మధ్య ప్రదేశ్ లనుండీ వచ్చిన వారున్నారు. అలాగే అన్ని కుండాల దగ్గరా వివిధ రాష్ట్రాల వారున్నారు. శ్రీ కేసీఆర్ గారు ప్రతి రోజూ ఉదయము ఒకసారి , మధ్యాహ్నము ఒకసారి సతీ సమేతముగా యాగ శాలలోని ఋత్త్విలందరికీ మొదట అభివాదము చేయుట అందరినీ ముగ్ధులను చేసింది. వారు కనపరచిన హుందాతనము , భక్తి ప్రపత్తులు , వినయ శీలత ఈ కాలము యే రాజకీయ నేత ల వద్ద కాదు గదా , సామాన్య యజమానుల వద్ద కూడా దుర్లభము. 

ఋత్త్విజులు :-


చండీ యాగానికే కాదు , యే యాగానికైననూ ఋత్త్విజులుగా వచ్చి యాగములో భాగము వహించేవారు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. అలాగే అనేక నియమాలను పాటించాలి.  
ఋత్త్విజులందరికీ తప్పనిసరిగా నవార్ణ మంత్రోపదేశము అయి ఉండాలి. అనేక పర్యాయములు సప్తశతీ పారాయణము చేసి ఉండాలి. ప్రతి శ్లోకాన్నీ స్పష్టముగా తప్పులు లేకుండా పఠించగలిగి ఉండాలి. యాగపు రోజులలో దీక్ష వహించి , ఒంటి పూటే భోంచేస్తూ , నేలపైనే నిద్రిస్తూ , ముప్పూటలా సంధ్యావందము చేస్తూ అతి నిష్టతో నియమాలను పాటించవలెను. 

ఒంటిపూటే భోజనము , నేలపైనే పడుకొనుట అలవాటు ఉండడమూ , గత ఆరేడేళ్ళుగా నవార్ణ మంత్ర జపమూ , దేవీ ఉపాసనలతో పాటూ కనీసము ఒక నూట యాభై సార్లయినా సప్తశతీ పారాయణము  చేసిన అనుభవము ఉండుట వలన నేను ధైర్యముగా ఆర్త్విజ్యానికి ఒప్పుకోగలిగాను. యే అర్హతలూ లేకుండా ఆర్త్విజ్యానికి వెళ్ళుట ప్రమాదకరము. ఒకవేళ అటువంటి అర్హతలు లేకున్నా , అమ్మవారిమీద అత్యంత భక్తి ఉండి శ్రద్ధతో వెళ్ళిన వారిని అమ్మవారు పరీక్షలు పెట్టి , వారు నియమాలను పాటించునట్లు చేయడము అనేకులకు అనుభవమే.  

శ్రీ శ్రీ జగద్గురువుల ఆశీర్వాదములు కోరినపుడు జగద్గురువులు , " యాగము తప్పక విజయవంతముగా సమాప్తి అవుతుంది.. ఏవైనా చిన్న చిన్న అవాంతరములు వస్తే చిన్నబుచ్చుకొనే పనిలేదు " అని దీవించినారట. 

కారణములతో నిమిత్తము లేకుండా, కేవలము అమ్మవారి " పరీక్ష " గానే భావించ తగిన చిన్న చిన్న సంఘటనలు జరగకపోలేదు. యాగము చివర యాగ మంటపము ఆగ్నేయదిశలో అగ్నికి ఆహుతియగుట వాటిలో ముఖ్యమైన సంఘటన. 

అప్పటికి ఆహుతులన్నీ ఇవ్వడము జరిగింది. పొగ ఎక్కువగా ఉండడము వలన ఋత్త్విజులందరమూ కుండాలనుండీ దూరముగా , యాగశాలలోనే ,   బయటికి వచ్చాము.  పొగను పైకి పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాంకేతికముగా  పూర్ణాహుతి పూర్తయినట్టు ముఖ్య అధ్వర్యులు చెప్పినారు. అయినా రావలసినవారు ఇంకా రాకపోవడము వలన వారు వచ్చాక అన్ని సంభారాలతో శాస్త్రోక్తముగా జరపవలసి ఉండినది. 

పూర్ణాహుతి సమయము వరకూ అగ్నిని ’ కాపాడుకోవలెను ’ అన్న ఆత్రముతో ఒకరు అతిగా ఆజ్యము పోయుట వలన జరిగిన సంఘటన అది.  అది జరిగిన వెంటనే కొన్ని నిమిషాలలోనే , అయిదు రోజులుగా అక్కడే సిద్ధముగా ఉన్న అగ్నిమాపక దళము రంగములోకి దిగడము , వెంటనే మంటలను ఆర్పడము , వారి సాహస కృత్యాన్ని తిలకిస్తున్న వందలాది ఋత్త్విజులము చప్పట్లతో , జయ జయ ధ్వానాలతో వారిని ప్రోత్సాహ పరచి అభినందించడమూ మరచి పోలేని క్షణాలు. దానికి ముందు , అన్ని కుండములలోనూ మొదట నూట ఎనిమిది ఆజ్యాహుతుల తరువాత  హోమద్రవ్యముగా అరిటాకులు పరచిన వెదురు గంపలలో తెచ్చిన గుడాన్నమును ఆహుతులు ఇస్తున్న సమయములో , విపరీత మైన నల్లటి పొగ చుట్టుముట్టింది. కుండాలలో ఉంచిన కలప మోదుగ కలప అని కొందరు అన్నా కూడా  అవి కాలునపుడు , యే నీలగిరి కలపో కాలినట్లు , గొంతుల్లోనూ , ముక్కుల్లోనూ ఒకటే మంట మొదలై , ఊపిరాడక కొందరు లేచివెళ్ళాల్సిన పరిస్థితి రాగా , నిర్వాహక బృందము ’ ఋత్త్విజులందరూ బయటికి రావలెను " అని ప్రకటించవలసి వచ్చినది. ఆ సందర్భములో అదే సమయోచిత నిర్ణయము. యాగ శాలకు నాలుగు వైపులా తాత్కాలిక మంటపములుండి , గాలి పోవుటకు వీలులేకపోవడము వలన ఆ పరిస్థితి వచ్చి ఉండవచ్చు. 

ఆగ్నేయ దిశలో , శంకరుని ప్రతిష్టాపన అయిన మంటపము  పూర్తిగా దగ్ధమై రుద్రభూమిని తలపించగా , అమ్మవారి మంటపము ఏమాత్రమూ చెక్కుచెదరక ఉండుట అమ్మావారి లీలే కానీ మరొకటి కాదు. సంఘటనను ఎవరో జగద్గురువులకు విన్నవించగా , వారు ఏ మాత్రమూ చలించక ,’ సర్వమూ శుభముగా సమాప్తి చెందుతుంది... మీరు శాంతి మంత్రాలు పఠించండి " అన్నారని ఒక వార్త. 

ఒకరిద్దరు శాంతి మంత్రాలు మొదలు పెట్టగా , ఆశ్చర్య , ఆందోళనల మధ్య ఉన్న మరికొందరు అందుకోవడమూ , చూస్తుండగనే ఒక యాభై మందిమి పోగవడమూ , మమ్మలి చూసి వందలమంది రావడము , అలాగ వందలాది ఋత్త్విజులము శాంతి మంత్రాలు పఠిస్తూ ఒక పదినిమిషాలు అక్కడే నిలుచుండి నెమ్మదిగా నడుస్తూ , సామూహికముగా ఉఛ్చ  స్వరముతో మంత్రాలను పలుకుతూ యాగ శాలను పునః ప్రవేశించడము, చూసితీర వలసినదే గానీ వర్ణించుటకు వీలు కాదు. వందలమంది ఏకకంఠముతో మంత్రాలను పఠిస్తుంటే ఆ ప్రభావమే వేరు. ఋత్త్విజులచుట్టూ వందల, వేల సంఖ్యలో భక్తులూ ఇతరులూ చేరి ’ మంత్రముగ్ధులై ’ వింటున్నారు.   కేసీఆర్ గారు నిర్వికారముగా ప్రశాంత చిత్తులై ఉన్నారు కానీ కొందరి ముఖాలలో కొంత ఆతృత , ఆందోళనలు మొదట కనపడినా , ఆ తర్వాత శాంతి మంత్రాలు వింటూ వారు , పలుకుతూ మేము సర్వులమూ ఒక సుందరలోకములో ప్రశాంతముగా తూగుతున్నట్టు... అదొక అనుభూతి.

ఏర్పాట్లు:- ఏర్పాట్లను గురించి చెప్పకనే ఈ వ్యాసము పూర్తి చేయుట సంతృప్తినివ్వదు. దగ్గర దగ్గర రెండు వేల మందికి అయిదురోజులపాటు సకల సౌకర్యాలూ కల్పించుట [ లక్షలాది భక్తులూ , ముఖ్యులూ , గణ్యులూ దేశము నలుమూలలనుండీ ప్రతిరోజూ రాగా వారికి భోజనాదులు , వసతులు చూచుట మరొక ఎత్తు ] నిజంగా కత్తిమీద సాము వంటిది. ఎక్కడా చిన్న అసౌకర్యము కూడా కలుగకుండా ప్రతిచిన్న వివరాన్నీ గుర్తుంచుకొని చేసిన ఏర్పాట్లు నభూతో న భవిష్యతి.  యాగము జరిగిన ప్రదేశము ఊరికి దూరముగా విసిరేసినట్టు ఉండడము , మంచి రోడ్డు కూడా ఉండకపోవడము , ప్రతిచిన్న వస్తువునూ హైదరాబాదు నుండీ ఎనభై మైళ్ళ దూరానికి తీసుకు వెళ్ళవలసి రావడము వంటి అవరోధాలన్నీ అధిగమించి చేసిన యేర్పాట్లు అపూర్వము. యాగశాలవరకూ , ఎడ్లబండికూడా వెళ్ళలేని దారిలో , అంతకు కొన్ని రోజులముందే అద్భుతమైన తారు రోడ్డును వేయించారు.  వచ్చేవారు ఋత్త్విజులే కానీ యే ఆటగాళ్ళో కాదు కాబట్టి వారి అవసరాలను గుర్తించి తగినట్టు సంభారాలను సమకూర్చుట అనేది నిజంగా కష్టసాధ్యమే. ఉదాహరణకు , ఋత్త్విజులు పాదరక్షలు లేకుండా ప్రతిరోజూ ఒక కిలోమీటరైనా నడవాలి కాబట్టి వారు నడిచే దారిలో ఎటువంటి చిన్న రాళ్ళుగానీ ముళ్ళుగానీ లేకుండా ప్రతిరోజూ మెత్తటి మట్టిని పరిపించడము వంటివి ఎంత ఆలోచించి చేశారో అనిపిస్తుంది. ఒక ఎకరమో రెండెకరాలో వైశాల్యమున్న ప్రదేశములో ఇనప కడ్డీలతో పెద్ద ప్లాటుఫారము వంటి చట్రము , దానిపై చెక్కపలకలు పరవడము , దానిపై నడచుటకు మెత్తటి తివాచీలు , చుట్టూరా గాలి, నీరూ చొరకుండా మెత్తటి, కానీ బలమైన ప్లాస్టిక్ బట్టతో చేసిన డేరాలు , ప్రతిఒకరికీ పడుకోడానికి వసతులు , విద్యుద్దీపాలు , పంకాలు , --అటువంటి రెండు పెద్ద డేరాలు. దూరముగా స్నానాలకు వేడినీరు , చల్లనీరూ కూడా వచ్చే వందలాది కొళాయిలు. మరొకచోట ఆధునికమైన మరుగుదొడ్లు. వాటిని ప్రతినిమిషమూ శుభ్రము చేస్తూ ఇరవైనాలుగు గంటలూ పనివాళ్ళు.

ఇక మరొక చోట అతిపెద్ద డేరా లో భోజన శాల. వంటవారు అన్ని ప్రాంతాలనుండీ వచ్చినవారు సుమారు ఐదువందలమంది దాకా. మొదటి రోజు వారిలో ఒకింత సమన్వయములేక వంట సరిగ్గా చేయలేకపోయారు. అది తెలిసిన కేసీఆర్ గారు స్వయముగా వచ్చి తగు సూచనలిచ్చి , మరుసటిరోజు నుండీ ఎట్టి ఫిర్యాదులూ రాకుండా అద్భుతమైన వంటకాలు చేయించారు. చివరిరోజున వంటవారిలో ముఖ్యుడికి కేసీఆర్ గారు స్వర్ణ కంకణము తొడిగి శాలువా కప్పడములోనే ఆయన శ్రద్ధ , అంకితభావము తెలుస్తున్నాయి. 

ఇవికాక, ఆహూతులకు , గణ్యులకూ , జనసామాన్యానికీ వేరు వేరుగా భోజన వసతులు సర్వులకూ తృప్తికలిగేలా సాత్త్వికమయిన , రుచిగల వంటకాలు రెండుపూటలా సిద్ధము. ఇక ఫలహారాలు , పానీయాలకు , కొబ్బరిబోండాము లకూ లెక్కేలేదు. 

ఋత్త్విజులకు ప్రతిరోజూ సాయంత్రము , తర్వాతిరోజు కట్టుకోవలసిన దీక్షా వస్త్రాలు పంపిణీ చేయడము , వారికి కావలసిన సమస్త వస్తువులూ వారివద్దకే తెచ్చి ఇవ్వడము [ వస్త్రాలు , పారాయణకు పుస్తకాలు , వ్యాస పీఠాలు , కూర్చోడానికి నాణ్యమైన పీటలు , వాటిపై మెత్తటి పట్టువంటి ఆసనాలు , ఇత్తడి పంచపాత్ర , హరివాణము , చెంబు,  సామగ్రి ఉంచుకోడానికి సంచులు వంటివే గాక , సబ్బులు , సబ్బుపెట్టెలు , నూనెలు , దంతధావనానికి స్నానానికీ కావలసినవి, చివరకు మడి బట్టలు ఆరేసుకోవడానికి తంతులు...క్లిప్పులు....తాగడానికి లక్షలాది మంచినీటి సీసాలు , యాగశాలలో అనుష్ఠానాలు చేసుకోవడానికి మడినీళ్ళు...అద్భుతం.  ] అలాగ సర్వ సౌకర్యాలూ కల్పించడము అనితర సాధ్యము. 

వారికి ఈ మహత్కార్యములో సర్వవిధములా  సహాయ సహకారాలు అందించి యాగపు దిగ్విజయ పరిసమాప్తికి తోడ్పడిన శ్రీయుతులు వే|| బ్ర|| శ్రీ గోపీకృష్ణ శర్మ గారు , శశాంక ఫణిశర్మ గారు అభినందనీయులు. 

ఋత్త్విజులనూ , అతిథులను , నిర్వాహకులను ఘనముగా సత్కరించి కేసీఆర్ గారు తమ ఉదార బుద్ధినీ అంకితభావాన్నీ చాటుకున్నారు. 

తెలంగాణాకు , భారతదేశానికీ సర్వతో ముఖాభివృద్ధి కలిగి తమ ఆశలు నెరవేరగనే ఈసారి " ప్రయుత చండీ మహా యాగము " నిర్వహిస్తానని ప్రకటించిన శ్రీ కేసీఆర్ గారి కోరిక ఆ దేవి అనుగ్రహముతో త్వరలోనే ఈడేరుగాక !!!

|| సర్వేజనాః సుఖినో భవంతు ||