SHARE

Thursday, December 17, 2015

సనాతన ధర్మపు రహస్యము---రెండో భాగము.

సనాతన ధర్మపు రహస్యము---రెండో భాగము.

ధర్మ విచారము

మహాస్వాములు తమిళనాట ఒక పల్లెలో 1926  లో శిబిరము వేసినపుడు వారిని దర్శించుటకు ఒక యూరోపియన్  వ్యక్తి వచ్చినారు. ఈ సంభాషణను రాసిన శ్రీ కృష్ణ అయ్యర్ గారికి ఆ యూరోపియన్ పేరు తెలియకపోవడము వల్లనో యేమో ,  అతడికి మిస్టర్ " ఎ " అని పేరు పెట్టారు...సౌలభ్యం కోసము.

భారతీయ వేదాంత శాస్త్రము గురించి అప్పటికే ఆయన కొన్ని పుస్తకాలు చదివి , వాటి బోధనల వలన ప్రభావితులైనారు. స్వామితో వారి ప్రసంగము :_

మిస్టర్ " ఎ ":- " స్వాములవారూ , హిందూ ధర్మపు బోధనల వలన నేను ఎంతో ప్రభావితుడనై ఉన్నాను. నన్ను  మీ ధర్మములోనికి  మతాంతరము చేసి చేర్చుకొన వలసినదని నా అభ్యర్థన. నా వలెనే , హిందువులుగా మారి పరివర్తన చెందవలెనన్న ఆశ ఉన్న నామిత్రులు అనేకులున్నారు. వారిని కూడా పిలుచుకు వస్తాను. మా అందరికీ ఈ హిందూ ధర్మము వలన ఎంతో ప్రయోజనము చేకూరగలదని అవగతము అయినది.. "


గురువులు :- " హిందూ ధర్మము ఈ జగత్తులోని ఆలోచనా శీలురైన జిజ్ఞాసువుల నందరినీ  తన వైపుకు ఆకర్షించుకొనుటలో ఆశ్చర్యము కానీ అబద్ధముగానీ లేవు. కానీ మా ధర్మము కానీ మేము కానీ మతాంతరములను , మత మార్పిడులను ఒప్పుకొనుట కానీ ప్రోత్సహించుట కానీ చేయము.

మిస్టర్ " ఎ ":- " మీ హిందూ ధర్మము మానవ కులానికే హితకారి అనునది తెలుసుకొని అంగీకరించినపుడే , తమరు , మతాంతరము చెందుటకు ఆశపడేవాళ్ళను అందులోకి చేరుటకు అవకాశము నియ్యవలెను అనునది స్పష్టమగుచున్నది కదా ? మతాంతరము వద్దని ఎందుకు శెలవిస్తున్నారు , తెలుసుకోవచ్చునా ? "

గురువులు :- " మా ధర్మములోనికి వచ్చి హిందువుగా పరివర్తన చెందవలెనన్న ఆశ ఉన్న  ఏ వ్యక్తి అయినా , హిందువు కాకపోయినపుడు కదా , మతాంతరపు ప్రశ్న వచ్చేది ? "

మిస్టర్ " ఎ ":- " అదెలాగ ? హిందువుగా పరివర్తన కావాలన్న కోరిక ఉన్న నా వంటివారు , హిందువుగా మారకుండానే , కేవలము కోరుకున్నంత మాత్రానే హిందువులము అనిపించుకుంటామా ? ప్రస్తుతము మా మతము వేరు కదా ? అంటే హిందువుగా మారుటకు ఏ విధమయిన సాంప్రదాయక విధి ఆచరణ కూడా అవసరము లేదని స్వాముల అభిప్రాయమా ? " 

గురువులు :- " కాదు , హిందువులము అనిపించుకోవలెనని కోరే వారు , ఆ విధముగా కోరని వారూ , అందరూ కూడా హిందువులే అన్నది నా అభిప్రాయము. "

మిస్టర్ " ఎ ":-  ఆశ్చర్యపోతూ , " అదెలా సాధ్యము ? "

గురువులు :-" మన ధర్మానికి " హిందు " అన్న పేరు వచ్చినది  ఈ మధ్య మాత్రమే. దాని నిజమయిన పేరు , " సనాతన ధర్మము ".అది ఏదో ఒక నిర్దిష్ట కాలములో గానీ , ఎవరో ఒక నిర్దిష్ట మతస్థాపకుని వల్లకానీ స్థాపించబడినది కాదు. ప్రారంభమయినది కాదు. సార్వత్రికమైన ఆ ధర్మము ఏదో ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితమయినది కాదు. ఇంతవరకూ ఈ జగత్తులో జన్మించిన , ఇకముందు జన్మించబోయే సమస్త జీవులూ , ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా , కోరినా కోరకున్నా ఈ ధర్మానికి చెందినవారే . ఇది సృష్టి నియమము. ఈ నియమానికి ఏ అడ్డూ లేదు. అగ్ని కాల్చుతుంది అన్నది సత్యము. దానికి,  తన కాల్చేగుణాన్ని నిరూపించుటకు యే ప్రమాణమూ అవసరము లేదు. మనము ఒప్పుకున్నా , లేకున్నా , అగ్ని యొక్క గుణ-స్వభావములలో ఎటువంటి మార్పులూ పరిమితులూ ఉండవు. ఒకరు ఒప్పుకోనంత మాత్రాన దానికి యే లోటూ రాదు. మనము అది తెలుసుకొని ఒప్పుకుంటే మనకు శ్రేయస్సు. లేకపోతే చెడేది మనమే. సనాతన ధర్మము కూడా అదే విధమైనది. "

మిస్టర్ " ఎ ":- " ప్రపంచములోని అందరూ హిందువులే అని తమరు అంటే , మరి వివిధ జాతులున్నాయి కదా ? దానికేమి చెపుతారు ? ఎలా సమర్థిస్తారు ? "

గురువులు :- " అందరూ హిందువులే అంటే దాని అర్థము , అందరూ తమ తమ అభిప్రాయము లేదా మతము లలో మార్గదర్శనము పొందుటకు అర్హులు అని అర్థము. అయితే ఈ మార్గదర్శనము అందరికీ ఒకే రీతిలో ఉంటుందని అర్థము కాదు. మనిషికి పుట్టుకతో వచ్చిన ఆచారాలు , స్వభావాలు , పూర్వ జన్మ సంస్కారాలు , పరిసరాలు , పరిస్థితులు , మరియు అతడు పుట్టిన తరువాత పొందే శిక్షణలు --ఇవన్నీ అందరికీ ఒకే విధముగా ఉండుట అసాధ్యము. పరస్పర వైరుధ్యాలున్ననూ ఒకదానికొకటి విరోధము కాని ఈ సత్యాన్ని గణనకు తీసుకొని , సనాతన ధర్మము ’ సామాన్య ధర్మము ’ మరియు ’ విశేష ధర్మము ’ అను విభజన మూలముగా మీ సమస్యను పరిష్కరిస్తుంది. మొదటిది [ సామాన్య ధర్మము ] సర్వ మానవాళికే సహకారి , ప్రయోజనకారి.  ఈ మొదటిదీ , రెండవదీ [ విశేష ధర్మము ]  రెండూ చేరి మతాల చట్రము లోపల వచ్చువారికి ఉపయుక్తమైనవి. వివిధ కులాల వారికి కూడా అదే విధముగా ఉపయోగమైనవి. "

మిస్టర్ " ఎ ":- " ఈ విశేష ధర్మములకు కూడా ఆధ్యాత్మిక విలువలున్నాయి , ప్రయోజనము ఉంది అన్నట్టయితే , వాటి ప్రయోజనాన్ని వర్ణ వ్యవస్థ లో లేని వారు , ఇతర మతస్థులు ఎందుకు పొందరాదు ? "

గురువులు :- " నీరు అన్ని జీవులకూ ప్రయోజనకారి. అయితే , ఎండ తాపానికి గురయిన వ్యక్తికీ , మరియూ జ్వరముతో బాధపడే వ్యక్తికీ ఒకే విధముగా ప్రయోజనము నిస్తుందా ? సందర్భమునకు తగినట్టు దాని ప్రయోజనము మారదూ ? "

మిస్టర్ " ఎ ":- " మీ ఈ ఉదాహరణ నాకు అంతగా సమ్మతము అగుట లేదు. ఒక నిర్దిష్ట వర్గానికి అన్వయించే నియమము , ఆ వర్గానికి చెందని వారికిగానీ , లేక వేరే యే వర్గానికీ చెందని వారికి గానీ హాని కారకము అంటూ సమర్థించుటకు యే ఆధారమూ కనపడుట లేదు. "

గురువులు :- " అదే విధముగా , ఆ నియమాలు " సర్వులకూ ప్రయోజనకారులు "  అని సమర్థించుటకు కూడా సాధ్యము కాదు. ఎందుకంటే , అవి ఒక నిర్దిష్ట వర్గానికి చెందినందు వల్ల మాత్రమే ప్రయోజన కారులు అయినాయి. ఆ కారణము చేతనే అవి " విశేష ధర్మాలు " అనిపించుకున్నాయి . కాబట్టి అట్టి నియమాలకు సార్వత్రికముగా అన్వయము ఉండుటకు సాధ్యము కాదు. ఈ విధమయిన నియమాల [ ధర్మాల ]  గురించి మనకు శాస్త్రాలు మాత్రమే తెలియజేస్తాయి. అలాగ , ’ శాస్త్రము చెప్పే ధర్మాలు ప్రయోజనకారులు ’ అను విషయాన్ని ఒప్పుకున్నప్పుడు , ఆ నియమాలు ఎవరికి ఉపయోగము , ఎవరికి కాదు అన్నది కూడా తెలియజేసే అవే శాస్త్రాల ఆదేశాలను పరిపూర్ణముగా ఒప్పుకోవలసి ఉంటుంది.

శాస్త్రముల ద్వారా , ధర్మము వలన ప్రయోజనము ఉంది అని తెలుసుకున్న మీరు , అందరికీ ఏకరూపముగా ధర్మాలను చెప్పలేదు , వేరు వేరు ధర్మాలను చెప్పినాయి అనే కారణము వల్ల అవే శాస్త్రాలను నిరాకరిస్తారా ? అలా చేయుటకు సాధ్యమే లేదు కదా . శాస్త్రపు ఒక ఆదేశము సరియైనది , మరొకటి సరి కాదు అనుటకు సాధ్యము కాదు. మనుషుల ప్రవర్తనను నియంత్రించుటే శాస్త్రముల ఉద్దేశము. సనాతన ధర్మము కానివ్వండి , మరే ఇతర మతము కానివ్వండి , అధికార సిద్ధాంతాన్ని పాటిస్తాయి. [ అధికారము అంటే అర్హత ] . ధర్మమును పాలించుటకు అధికార స్వరూపాన్ని నిర్ణయించుట అవసరము. వర్ణాల చట్రములోకి వచ్చే వారు విశేష ధర్మాన్ని పాలించుటకు అర్హులు. రానివారు కేవలము సామాన్య ధర్మాన్ని పాటించుటకు అర్హులు. కాబట్టి , మానవ జాతి మొత్తము ఈ రెంటిలో ఏదో ఒక ధర్మాన్ని పాటించవలసినదే. "

మిస్టర్ " ఎ ":- " సనాత
శాస్త్రాలు సర్వ మానవాళికే హితకారులు అయినప్పుడు , మరియు , తమరు చెప్పినట్టు ఈ జగత్తులో పుట్టిన వారందరూ మీ ధర్మానికే చెందిన వారు అయితే , ప్రపంచములోని ఇతర ధర్మాల గురించి ఏమి చెపుతారు ? తమరి అభిప్రాయమేది ?"

గురువులు :-" ఆయా ధర్మాలకు , మతాలకు చెందిన వారు,  ’ తమ ధర్మాలు సనాతన ధర్మమునుండే పుట్టినవి , దాని అంగములే అన్నది తెలుసుకొనకుండుట వారి తప్పు. ఇతర అన్ని ధర్మాల లోని ఉత్తమమైన , ఉత్కృష్టమైన బోధనలూ కూడా సనాతన ధర్మములోనే మూలాలను కలిగియున్నాయి. అవన్నీ సనాతన ధర్మపు ’ సామాన్య ధర్మపు ’ నియమాలలో భాగాలే. "

మిస్టర్ " ఎ ":- "స్వామీ , ఇది అతిశయముగా లేదూ ? ఇతరులు దీనిని ఎందుకు ఒప్పుకోవలెను ? "

గురువులు :- " ప్రస్తుతము మన చర్చ , సనాతన ధర్మానికి ఇతరులు మాన్యత నిచ్చుట  అనునది కాదు. ఏదైనా ఒక వస్తువులో అంతస్థముగా ఉన్న ఒక మౌల్యము , దానిని ఇతరులు ఒప్పుకున్నా లేకున్నా , ఉండనే ఉంటుంది. ప్రాథమికముగా శాస్త్రము అతి ఔదార్య స్థాయిలో చెపుతుంది గనక , ఇతరులు ఒప్పుకోరన్న కారణముతో దానిని ఇంకా కింది స్థాయికి తెచ్చుట అసాధ్యము. "

మిస్టర్ " ఎ ":- " ఎలాగ , దయచేసి వివరించండి "

గురువులు :- " మీకు పూర్తిగా అర్థము కావలెనంటే నేను క్రైస్తవ మతపు ఉదాహరణ తీసుకొని వివరిస్తే తమరు నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను.

సశేషము ......

Tuesday, December 15, 2015

సనాతన ధర్మపు రహస్యము--- మొదటి భాగము

సనాతన ధర్మపు రహస్యము--- మొదటి భాగము



అనేక సార్లు , " సనాతన ధర్మము ఎటు పోతున్నది ? రోజురోజుకూ మన ధర్మాన్ని కించపరుస్తూ తూలనాడేవాళ్ళే ఎక్కువవుతున్నారు.. మిగిలిన మతాలన్నిటికీ మార్గదర్శనము నిచ్చిన సనాతన ధర్మమును ఎందుకు ఇతరులు ద్వేషిస్తున్నారు ? ఇతరుల మాట అలా ఉంచితే , మనవారే ఎందుకు మన గొప్పదనాన్ని అర్థము చేసుకొనుట లేదు ? ఎవరికి ఇష్టము వచ్చినట్లు వారెందుకు వ్యాఖ్యానిస్తున్నారు ? అపౌరుషేయమైన వేదములే పునాదిగా గల మన ధర్మానికి గ్లాని కలుగుతుంటే మూఢుల వాదనలను  , వక్రభాష్యాలనూ తిప్పికొట్టి కనువిప్పు కల్గించే వారే లేరా ? సనాతన ధర్మపు గొప్పతనము తెలిసిననూ , దానిని అందరికీ సరిగ్గా వివరించలేక ఇంకా అయోమయానికి గురి చేస్తున్న నేటి కొందరు గురువులకు మార్గదర్శనమే లేదా ?  పీఠాధిపతుల మొదటి కర్తవ్యము ఇట్టి సందేహ నివృత్తి చేసి అందరికీ ఒక విశ్వాసాన్నీ , ధైర్యాన్నీ , ప్రశాంతతనూ కలిగించుట కాదా ? వారెందుకు మాట్లాడరు ? ఇతర మతస్థుల ఉన్మాదపు వాదనలకు దీటైన సమాధానము నెందుకు ఇవ్వకున్నారు....
అన్న ఆలోచనలు మొన్నటిదాకా నన్ను తొలిచేవి...

అటువంటి ఆలోచన అహంకార పూరితమైనదనీ , నాకు కలిగిన ఈ సందేహాలు , వాటికి సమాధానాలూ  మన జగద్గురువులకు తెలియనివి కావనీ , అందరికన్నా ముందే వారు ఇట్టి విషయాలపై దృష్టి సారించడమే గాక , తగు వివరణా , ఉపదేశమూ , హితబోధా చేసినారనీ , అది తెలుసుకోకపోవడము నా మూర్ఖత్వమేననీ సమయము వస్తేనే గానీ ఏదీ మన కళ్ళకు కనపడదనీ ఈ మధ్యే బోధ అయినది...
అప్పటి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల వారు ఇటువంటి అనేక విషయములపై , స్పష్టముగా , తార్కికముగా , మానవాళి శ్రేయస్సు కోసము ఎంతో విలువైన సమాచారమును ఇచ్చి ఉన్నారు.
ఒకానొక కన్నడ బ్లాగులో నాకు సమాధానాలు దొరికినాయి..ముఖ్యముగా " మతమార్పిడులను " గురించిన వివరణ నన్ను అప్రతిభుడిని చేసింది.. అక్కడ నేను చదివినది మీ , మన అందరి సౌలభ్యము కోసము అనువదించి ఇస్తున్నాను.

1925-27  మధ్య రెండు సంవత్సరముల కాలము శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామివారు తమిళనాడులోని వివిధ ప్రదేశాలలో సంచారము చేసినపుడు అక్కడి అనేక జిజ్ఞాసువులు - భక్తులూ స్వామీజీ వారిని సందర్శించి , తమ తమ సందేహాలను నివృత్తి చేసుకొనే వారు. ఆ సమయములో స్వామివారితోపాటూ ఉన్న కృష్ణ స్వామి అయ్యర్ అనువారు , అక్కడ జరిగిన సంభాషణలను రాసుకొని ఆంగ్లములో ,." From the master's lips "  అను పేరుతో 1930  లో ప్రచురించినారు.. ఆ తరువాత   " Dialogues with the Guru "  అను పేరుతో ముంబైలో పునర్ముద్రితమైనదని , ఇప్పుడు ఆ పుస్తకాలు దొరకుట లేదనీ ఆ బ్లాగరు రాసినారు. ఆ పుస్తకములో పన్నెండు అధ్యాయాలున్నాయట. వాటిలో మొదటి అధ్యాయము / మొదటి సంభాషణ జిజ్ఞాసువులకు అనుకూలము కాగలదను సంకల్పముతో ఆ బ్లాగరు కన్నడ భాషకు అనువదించినారు. దానినే నేను తెలుగులోకి అనువదిస్తున్నాను.

శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములు కేవలము ఒక పీఠాధిపతి మాత్రమే కాదు , ఆ పీఠమును అధిరోహించినారు అన్న కారణము చేత మాత్రమే కాదు , శాస్త్రాధ్యయనము , తపస్సు మొదలగు అనేక కారణముల వలన విశిష్టముగా గుర్తింపబడినవారు. కాబట్టి వారి మాటలకు ఎంతో మహత్త్వము ఉన్నది. కన్నడలో " శారదా పీఠద మాణిక్య " అను పుస్తకములో వారి వ్యక్తిత్వపు వైశిష్ట్యత గురించి విపులముగా నున్నదట ..

రెండో భాగములో వారి ఉపదేశము , ప్రవచనమూ చదవగలరు... పైన పేర్కొన్న పుస్తకాలు ఎవరివద్దనైనా ఉంటే దయచేసి తెలియజేయ గలరు ..


నేను చూసిన ఆ కన్నడ బ్లాగు ఇదీ...
http://herige.blogspot.in/2014/07/blog-post_6.html