SHARE

Saturday, January 31, 2015

జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వాముల శిష్య స్వీకార మహోత్సవ సందర్భంగా అనుగ్రహ భాషణము

                               || శ్రీః ||





జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వాములు , తమ శిష్య స్వీకార మహోత్సవ సందర్భంగా చేసిన అనుగ్రహ భాషణము
[ కన్నడ భాషణమునకు తెలుగు అనువాదం- పూర్తి పాఠం ]

ఇది అత్యంత స్ఫూర్తి దాయకము , విజ్ఞానదాయకము , ఆసక్తి కరమూ అయినది. దీనిలో ఎంతో విలువైన సమాచారము ఉంది

*****************************************************

|| శరదిందు వికాస మందహాసాం

స్ఫురదిందీవర లోచనాభిరామాం|
అరవిందసమాన సుందరాస్యాం|
అరవిందాసన సుందరీముపాసే ||

ఆదిశంకరుల గురించి మనదేశములోనే ... దేశములోనే కాదు , ఈ విశ్వములోనే తెలియనివారుండరు. మన సనాతన ధర్మానికీ , ఉపనిషత్ సిద్ధాంతానికీ వారు చేసిన సేవ , ఎన్ని సహస్ర మానములు గడచినా ఈ జనత , గుర్తుపెట్టుకొనునటువంటిది. కేవలము ముప్పైరెండు సంవత్సరముల కాలము ఈ భూమిపై కనిపించినట్టి ఆ మహాపురుషుడు చేసినట్టి కార్యము మాత్రము యుగయుగములవరకూ  నిలుచునట్టిది. మనుష్యుని పురోగతికి ఏకమాత్రమైన సాధనము ’ధర్మము’ అని చెప్పతగినట్టిది. అట్లే , మనుష్యుని పతనానికి ఏకమాత్రమైన సాధనము ’ అధర్మము ’ అని చెప్పతగినది.ఈ ధర్మము , అధర్మమూ అను ఈ రెండూ , మనిషి గొప్పదనానికీ , నీచత్వానికీ సాధనమైనటువంటివి. ఇందులో ఏవిధమైన అనుమానమూ , మార్పూ లేదు. 


శృతి , స్మృతి , ఇతిహాసములు , పురాణములు , దర్శనములు --వీటన్నిటిలోనూ , వేరే ఇతర విషయములలో అభిప్రాయ భేదమున్ననూ , ఈ ఒక్క  విషయములో మాత్రము ఎటువంటి అభిప్రాయ భేదమూ లేదు. ధర్మము సుఖానికీ , పుణ్యానికీ హేతువనీ , అధర్మము కష్టానికీ , పాపానికీ హేతువని ప్రతియొక్క దార్శనికుడూ ఒప్పుకున్నట్టిదే. అందుకే , శాస్త్ర పరిభాషలో కొన్ని ’ సర్వతంత్ర సిద్ధాంతములు ’, మరికొన్ని ’ ప్రతి తంత్ర సిద్ధాంతములూ ’ అని చేయబడినవి. వాటిలో ’ సర్వతంత్ర సిద్ధాంతము ’  అంటే సర్వులూ , సర్వమూ ఒప్పుకునేదే అని అర్థము.. ఈ ధర్మాధర్మములే సుఖ దుఃఖాలకు హేతువులు అన్నది సర్వతంత్ర సిద్ధాంతము. 


అద్వైతులుకానీ , ద్వైతులు కానీ , విశిష్టాద్వైతులైనా కానీ , శక్తి విశిష్టాద్వైతులైనా కానీ , బౌద్ధులు కానీ , జైనులు కానీ,  వీరశైవులే కానీ , ఈ విషయములో మాత్రము ఎవరికీ యే భిన్నాభిప్రాయమూ లేదు. కాబట్టి మనము , నిత్య సత్యమైనట్టి ఈ యొక్క సిద్ధాంతమును అనుసరిస్తూ మన జీవితాలను సాగించినపుడే మన జీవితము పవిత్రమవుతుంది, ఉత్తరోత్తరా మనకు ఇంకా ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని గనక మరచి మనమేదైనా అధర్మపు దారి తొక్కితే , అధర్మ మార్గములో నడచుకుంటే మన జీవితాలను మనమే వ్యర్థము చేసుకున్నట్టవుతుంది.


ఇది నిత్య సత్యమైన విషయము. ఆది శంకరులు మనకు  కొత్తగా దేనినో ఉపదేశము చేసినారు అని మేమేనాడూ చెప్పము. దేనిని శాస్త్రములు స్పష్టముగా చెప్పినాయో, దానిని జనులు మరచిపోయినప్పుడు , జనులకు దానిని గుర్తుచేసినారు. ఈ సిద్ధాంతాన్ని మరచి ప్రజలు కేవలము పశువులు , మృగములవలెనే జీవితాలను గడుపుతున్నటువంటి సందర్భములో , శంకర భగవత్పాదులు , ’ ఈ రీతిలో మీరు జీవితాలను వ్యర్థము చేయుట సరియైనది కాదు , జీవితము అత్యమూల్యమైనది , ఇది పదే పదే దొరకునట్టిది కాదు , ఇటువంటి అమూల్యమైన జీవితాలను వ్యర్థము చేసుకొనకండి, సార్థకము చేసుకొనండి , సార్థకము చేసుకోవాలంటే ఏకమేవ మార్గము ధర్మాచరణమే. ధర్మమార్గమును ఎవ్వరూ తప్పకండి. ధర్మ మార్గమును తప్పితే మీకు ఇహములో దుఃఖము కలుగును అని అనిపించకున్ననూ ఈ శరీరమును వదలిపోయిన తరువాత మీరు అధిక దుఃఖాన్ని అనుభవిస్తారు. '


మనిషికి ఒక ఆశ యేమంటే , యే జన్మలోనైనా సరే నేను సుఖముగా ఉండవలెను. యే జన్మలోనూ నాకు దుఃఖము కలుగకూడదు , కష్టములు కలుగకూడదు-- ఇది ప్రతి మనిషికీ అంతరాళములో ఉండే ఆశ. శంకరులన్నారు , ’ నిజముగా మీకు ఈ ఆశ ఉంటే దానికి తగినట్టే ప్రవర్తించండి. విద్యార్థులకు , తాము పరీక్షలో మొదటి శ్రేణిలో పాసు కావలెనన్న ఆశ ఉంటుంది, కానీ పుస్తకము ముట్టేందుకు మనసు రాదు. శంకరులంటారు , ’ నువ్వు పుస్తకమే ముట్టకపోతే మొదటి శ్రేణిలో లో ఎలా పాసవుతావు ? నీకు నిజంగా మొదటి శ్రేణిలోపాస్ కావలెనన్న ఆశ ఉంటే తీవ్రముగా కృషి చేయ వలెను. అట్లే , జీవితమును సార్థకము చేసుకోవాలంటే ధర్మమార్గము లోనే నడవవలెను. అధర్మ మార్గములో నడవద్దు. ఒకోసారి అనిపిస్తుంది, ధర్మ మార్గములో నడచుట చాలా కష్టము అని. అయితే , మనకు ఉత్తమమైన ఫలము దొరకాలంటే మొదట కష్టము అనుభవించే తీరవలెను. విద్యార్థులకు కూడా చదవడం అంటే చాలా కష్టము అనిపిస్తుంది. మరి మొదటి శ్రేణిలో లో పాసవవలెనంటే కొంచమైనా కష్టము పడవద్దా ? అట్లే , ధర్మ మార్గమున నడచుట కష్టము అని ఎవరైనా దానిని వదలివేస్తే , తమకు అపేక్షితమైన ఫలము మాత్రము దొరకదు. 


దానినే శంకరులు చాలా స్వారస్యముగా చెప్పినారు, ’ ఈ జనులలో ఒక విచిత్రమైన ప్రవృత్తి కనిపిస్తున్నది, 


|| పుణ్యస్య ఫలమిఛ్చంతి పుణ్యం నేఽఛ్చంతి మానవాః | 

న పాప ఫల మిఛ్చంతి పాపం కుర్వంతి యత్నతః || " అని. 

పుణ్యఫలమైన సుఖము కావాలని అందరూ కోరుతారు , కానీ ఆ  సుఖము కోసము పుణ్యమును చేయుటకు మాత్రము ఎవరూ ముందుకు రారు. పాప ఫలమైన దుఃఖము ఎవరికీ వద్దంట , కానీ ఆ దుఃఖాన్ని ఇచ్చునటువంటి పాప కార్యాన్ని అందరూ ప్రయత్నపూర్వకంగా చేస్తారు. ఇది మనుషులలో ఒక విచిత్రమైన ప్రవృత్తి అని , నేను చెప్పుట లేదు , వందలాది సంవత్సరములుగా  వెనుకతరాల వారు మనుషుల ప్రవృత్తులను అధ్యయనము చేసినవారు చెప్పిన మాట. 


కానీ ఈమాట నిజమనిపించేటట్టు మనం ఉండకూడదు. పుణ్యఫలమైన సుఖాలను అనుభవించాలనుకుంటే , ఆ సుఖాలను ఇచ్చే పుణ్యకార్యాలను మనం చేయవలెను. అనగా , ధర్మమునే ఆచరించవలెను. పాప ఫలమైన దుఃఖమును మనము అపేక్షించుట లేదు అంటే , ఆ దుఃఖజనకములైన పాప కార్యములను మనము చేయరాదు. దీనినే శంకర భగవత్పాదులు మనకు విస్తారముగా వివరించి చెప్పినారు. వారు అనేక విధములైన భాష్యములు , ప్రకరణములు , స్తోత్రములూ రాసినారు, అతి సంక్షిప్తమైన గ్రంధములనూ రాసినారు. అన్నిటి సారాంశమూ ఒక్కటే , ’ ధర్మ మార్గములో ఉండు , అధర్మ మార్గమునకు పోవద్దు .’ అలాగే , ప్రజలకు దీనిని మనము పదే పదే చెప్పుచుండవలెను. అలాగే పిల్లలకు , ’ నువ్వు బాగా చదవవలెను , గురువుల వద్ద వినయముతో ఉండవలెను , సహ పాఠుల వద్ద స్నేహముతో ఉండవలెను , ఇతరుల పెన్సిలూ , పెన్నూ దొంగతనము చేయకూడదు , గురువుల ఎదుట ఏనాడూ అబద్ధము చెప్పవద్దు , ’ అని వారికి ఒకసారి చెప్పితే చాలదు , ప్రతి దినమూ పదే పదే చెప్పుతూనే ఉండవలెను. ఎందుకంటే ఒకసారి చెబితే మరచిపోవచ్చు. పిల్లలకు దినమూ అలాగ చెప్పునట్లే , ప్రజలకు కూడా అలాగే ధర్మమును గురించిన ప్రబోధము నిరంతరమూ చేయవలెను అను కారణము చేతనే , శంకరులు ఈ మఠముల వ్యవస్థ చేసినారు. దీనికి సన్యాసులను నియమించినారు. ఎందుకనగా , సన్యాసులకు ఉండే ఒక వైశిష్ట్యమేమనగా ,  అతనికి భార్యా బిడ్డలు ఉండరు కాబట్టి , అతడికి మొదటగా , స్వార్థము ఉండదు. భార్యా బిడ్డలుంటేనే కదా స్వార్థము వచ్చేది ?  భార్యకు నగలు చేయించాలి , పిల్లలను చదివించాలి ,పెళ్ళిళ్ళు చేయాలి... ఇటువంటి లంపటాలు సన్యాసికి ఉండవు , ఆవైపుకే అతని మనసు పోదు. 


ఇంకొకటేమంటే , ఆ సన్యాసి వేదాంతమును అధ్యయనము చేసి ఉండుట వలన అతడికి ఏ విధమైన ఆశలూ ఉండవు. -- నేను చెప్పేది నిజమైన సన్యాసుల గురించే.  దేనిమీదా అతడికి వ్యామోహము ఉండదు కాబట్టి ధర్మ ప్రచారము చేయుటకు సన్యాసికి ఎక్కువ అవకాశము  ఉంటుంది. స్వార్థము ఎప్పుడైతే ఉండదో , అప్పుడతడికి ఇంకే విధమైన పనులూ ఉండవు. అందువలన సన్యాసి పరంపరను శంకరులు తమ చతురామ్నాయ పీఠములలో ఏర్పరచినారు. సన్యాసులే ఈ పీఠములకు అధిపతులుగా ఉండవలెను , ఈ పీఠానికి వచ్చినవారు సర్వ కాలములలోనూ జనులకు ధర్మ ప్రచారమునే చేయుచుండవలెను, తాము స్వయముగా ధర్మాచరణము చేయవలెను. ఇతరులకు ఉపదేశము చేయుటలో మాత్రమే నిమగ్నమై ఉండరాదు. కన్నడ భాషలో ఒక సామెత ఉంది,మీకందరికీ తెలిసే ఉండును , " చెప్పేదేమో పురాణములు , తినేదేమో వంకాయలు " అని. అట్లుకారాదు. ఇతరులకేమి ఉపదేశము చేస్తారో దాన్ని మీరుకూడా అక్షరాలా పాటించండి.


దీనినే శంకరులు ,తమ మఠములకు అన్వయించునట్టుగా ఒక చట్టాన్ని రాసినారు. ఆ చట్టం పేరే ’ మఠామ్నాయము ’ . నాలుగు మఠముల లోనూ ఉన్న సన్యాసులు ఇలా ఇలాగుండవలెను , అలాగుండవలెను అని చెప్పునపుడు , ఆ సన్యాసుల యోగ్యతను చెప్పునపుడు

|| శుచిర్జితేంద్రియో వేద వేదాంగాది విశారదః   ||  అంటే , ఆ సన్యాసి శుచిగా , శుద్ధంగా ఉండవలెను , అనగా శుద్ధ చారిత్ర్యవంతుడై ఉండవలెను. చరిత్ర శుద్ధి ఉండవలెను , జితేంద్రియుడై , వేద వేదాంగముల అధ్యయనము చేసిఉండవలెను , శాస్త్రజ్ఞుడై ఉండవలెను , || సః మదాస్థానమర్హతి || అంతటివాడే ఈ పీఠములో కూర్చొనుటకు యోగ్యుడై ఉంటాడు. అటువంటి యోగ్యత లేనివాడిని ఈ పీఠమునకు తీసుకొని రాకూడదు. --అని శంకరులు ఆనాడే అనుజ్ఞనిచ్చినారు. ఆ అనుజ్ఞను శృంగేరీ శారదాపీఠము మాత్రమే ఆనాటినుండీ పాటిస్తూ వస్తున్నది . ఈ పీఠపు విశిష్టత అదే.  ఆ యోగ్యత లేని వ్యక్తిని ఈ పీఠమునకు ఎవ్వరూ తీసుకురాలేదు. శృంగేరీ పీఠపు ఇతిహాసాన్ని శంకరుల నుండీ ఈనాటి వరకూ చూస్తే  ఆ యోగ్యత లేని యే ఒక్క వ్యక్తి కూడా ఈ పీఠానికి అధికారిగా రాలేదన్నదే ఇక్కడి విశిష్టత. 

మరియూ ఇంకొక వైశిష్ట్యత ఏమనగా , ఈ పీఠములో బ్రహ్మచారిగానే సన్యాసాశ్రమమునకు వచ్చుట. గృహస్థాశ్రమము నుండీ సన్యాసాశ్రమము నకు వచ్చుట లేదు. మా పరంపరలో ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాశ్రమము నుండే సన్యాసియై , సన్యాసి ధర్మమును తు. చ. తప్పక పాలించి , శాస్త్రానుగుణముగా తమ జీవితాన్ని గడిపి, ప్రజలకు ధర్మ ప్రబోధనము చేసి , ఈ పీఠమునకు తాము వచ్చి సార్థకతను చేకూర్చినారు అనునది , నాటి నుండీ నేటి వరకూ వచ్చిన పీఠాధిపతులను చూస్తే మనకు తెలియునటువంటి నిత్యసత్యమైన మాట. దీన్ని మేము వెనుకటి గురువుల చరిత్రను గ్రంధాల మూలముగా చూసియున్నాము , మా గురువులలో ప్రత్యక్షముగనే చూసినాము. మా గురువులైన జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ స్వామి వారు , తమ పదునాలుగో యేటనే సన్యాసమును స్వీకరించినారు. పదునాగేళ్ళ వయసులో బ్రహ్మచర్యాశ్రమము నుండీ సన్యాసి అయినారు. సకల శాస్త్రములనూ 
ధ్యయనము చేసినారు.  సకల శాస్త్ర పారంగతులూ అయినారు. మఠపు  సాంప్రదాయములను తమ గురువుల ముఖమున సంపూర్ణముగా తెలుసుకున్నారు. మఠపు ఉన్నతి కోసము , శిష్యుల ఉన్నతి కోసము తమ జీవితమును ధారపోసినారు. వారు ముప్పైఅయిదు సంవత్సరముల పాటు ఈ పీఠాధిపత్యమును నెరపినారు, దానిలో సుమారు పదునైదు సంవత్సరములు యాత్రలలోనే గడిపినారు. దేశసంచారము చేసినారు. సంచారములోనే తమ జీవితపు అర్ధ భాగాన్ని గడిపినారు. సంచారము ఎందుకు చేసినారు అనగా , ధర్మము గురించి ప్రచారము , ఉపదేశముల కోసమే. ప్రజలకు వేదాంత తత్త్వమును తెలుపుటకోసమే. జనులను సన్మార్గములో నడిపించుట కోసమే. యాత్రలు చేయుటే కాదు , శృంగేరీని విశేషముగా అభివృద్ధి చేసినారు. వారి దర్శనము చేసినవారు , వారి అనుగ్రహమును పొందినవారు వారి అద్భుతమైన మహిమను అనుభవించినట్టి వారు ఈనాడు కూడా మన మధ్యలో చాలామందే ఉన్నారు. 

వారు 1974 లో నాకు సన్యాస దీక్షనిచ్చి ,నన్ను తమ ఉత్తరాధికారిగా నియమించినారు. వారిది అత్యంత విశాలమైన దృష్టి, నేను ఎక్కడో ఆంధ్ర దేశములో పుట్టినవాడిని,నాకు ఈ దేశపు చరిత్ర కానీ , ఈ మఠపు చరిత్ర కానీ ఇక్కడి సంస్కృతిగానీ , ఇక్కడి ఆచార వ్యవహారములు గానీ ఏమీ తెలిసి ఉండలేదు. అటువంటి నన్ను ఈ మఠపు ఉత్తరాధికారిని చేసి , ఇప్పుడు నేను నాకు ఏమేమి లేకుండెను అని చెప్పినానో అవన్నీ సంపూర్ణముగా నాకుండునట్లు చేసి నన్ను ఈ పీఠపు రక్షణకు నియమించినారు. వారు యే భరోసాతో నన్ను ఉత్తరాధికారిగా చేసినారో ,ఆ భరోసాను కాపాడుకున్నానన్న తృప్తి నాకుంది. వారు , ఈ పీఠాన్ని నేను అభివృద్ధి చేస్తాను , ప్రజలకు ఎక్కువగా ఉపకరించు కార్యములను చేస్తాను ,ఇంకా ఎక్కువ ధర్మ ప్రచారము చేస్తాను , మన భారతీయ సంస్కృతికి దోహదమగునట్లుగా అనేక పనులను చేస్తాను అన్న నిరీక్షణ కలిగి ఉండేవారు. ఈ దినము ఇక్కడ జరిగినదంతా చూసినవారందరూ , వారి నిరీక్షణ అంతా సత్యమైనది అన్న తృప్తితో కూడిన భావనలో ఉన్నారు. ఇదంతా కేవలము వారి కృప వల్లనే అయింది. 


నేను పదే పదే చెప్పునదేమంటే , దీనిలో ఏదైనా నాగొప్పతనముందని నేను అనుకొని ఉంటే అది కేవలము మూర్ఖత్వము. నా గొప్పదనమేదీ లేదు , ఇది కేవలము వారి కృప , మరియూ ఆ జగన్మాత శారదాదేవి యొక్క కృప మాత్రమే. నాకు ఎన్నో సందర్భములలో అనేకమైన సమస్యలు వచ్చినపుడు , నా గురువులనూ , ఆ జగన్మాత శారదనూ స్మరించినపుడు , అన్ని సమస్యలూ పరిహారమై, యేది అసాధ్యమైన పని అని భయపడి ఉంటానో అది పువ్వును ఎత్తిపెట్టినంత తేలికగా అయిపోయిన సన్నివేశములు అనేకములున్నాయి. అవి నాకు గుర్తున్నాయి , ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నాతోపాటే ఉన్న మన గౌరీశంకర్ కు తెలుసు. 


ఇటువంటి ఉజ్జ్వలమైన పరంపరయే శృంగేరీ శారదా పీఠపు పరంపర  , ఈ పరంపరను ముందుకు కొనసాగించి తీసుకు వెళ్ళవలసిన భారము నామీద ఉన్నందువలననే , దీన్ని సరిగ్గా నిర్వహించుట నా కర్తవ్యమైనందువల్ల , ఈ దినము ఈ ఉత్తరాధికారియగు శిష్య పరిగ్రహణము చేసినాను , ఈ దినము,  ఆనంద నామ సంవత్సరపు,  ఆశ్వయుజ మాసపు కృష్ణ పక్షపు ద్వాదశి ,సోమవారము అంటే 1974 వ సంవత్సరము నవంబరు పదకొండో తారీఖును గుర్తు చేస్తున్నది. ఇదే రీతి యైనటువంటి సన్నివేశము  ఆనాడు కనిపించింది ,  అదే నేడు మరలా పునరావృత్తమయింది. జయనామ సంవత్సరపు , మాఘ మాసపు శుక్ల పక్షపు తృతీయ శుక్రవారము , 2015 , జనవరి 23 వ తారీఖున . నా గురువులు నాచే శాస్త్రాధ్యయనము చేయించి, నాకు మఠపు సాంప్రదాయములను తెలిపి, మఠపు శిష్యులనందరినీ పరిచయము చేసి, నాకు ఈ భారమును అప్పగించినారు. అదే విధముగా , మా శిష్యులను అదే రీతిలో సిద్ధం చేసి, వారికి సన్యాస దీక్షను ఇచ్చినాను. 


జాతకమును చూసి సన్యాసమును ఇచ్చే పద్దతి ఇక్కడ మా దగ్గరలేదు. పిల్లవాడి జాతకము అనేకులకు చూపించి, ఆ అనేకులలో యే ఒక్కరైనా , ’ ఈ పిల్లవాడి జాతకములో సన్యాస యోగము లేదు ’ అని చెప్పితే , ’ అయితే వద్దు , ఈ పిల్లవాడికి సన్యాస దీక్ష ఇచ్చుట తగదు ’ అని నిర్ధారించుట కొన్ని చోట్ల ఉందని విన్నాము , అయితే మా గురువులు అలాగ చేయలేదు , నేను కూడా అలాగ చేయలేదు. మా గురువులు , నాకు సన్యాసము ఇచ్చిన తరువాత అడిగినారు , " స్వామీ , మీరు పుట్టిన తిథి యేది ? " అని. ఎందుకడిగినారంటే , స్వాముల పుట్టిన దినమున మఠములో ’ వర్ధంతి ’ అని చేస్తారు , అందుకని అడిగినాను ' అన్నారు. నేను కూడా వీరిని అదే అడిగినాను. ’ మీరు పుట్టిన తిథి యేదయ్యా , ఎందుకంటే మఠములో స్వాముల పుట్టిన రోజు ’ వర్ధంతి’ జరుపవలెను అని. 


జాతకమును చూసి సన్యాసమును ఇచ్చుట కాదు , వ్యక్తి గుణమును , స్వభావమునూ చూసి ఇవ్వవలెను. ఆ వ్యక్తికి ఉండవలసిన మనస్సును చూసి. ఈ వ్యక్తి స్వభావము ఎట్లుంది, మనసెట్లుంది, వైరాగ్యము ఎట్లుంది, జనులపైన మమత , ప్రేమ ఎట్లున్నాయి.. వీటిని చూసి మేము సన్యాసము నిస్తాము, ఇది శృంగేరీ మఠపు పద్దతి. ఆ పద్దతికి అనుగుణముగా మా గురువులు యేరీతిలో జరిపించినారో , అదే పద్దతిలో జరిపించుట మాకర్తవ్యము అని భావించి , అట్లే చేసినాము. దిలీప మహారాజు యొక్క రాజ్యమును వర్ణించునపుడు కాళిదాస మహాకవి ఒక మాటంటాడు , 

|| రేఖామాత్రమపిక్షుణ్ణాదామనోర్వర్త్మనఃపరమ్
 నవ్యతీయుర్ప్రజాః తస్య నియంతుర్నేమివృత్తయః ||

దిలీప మహారాజుయొక్క రాజ్యములో ఉండే ప్రజలు , వెనుకటి రఘువంశ రాజులు ఏ మార్గమును యేర్పరచినారో , ఆ మార్గము నుండీ ఒక్క అంగుళము కూడా ఇటుపక్కకు , అటుపక్కకు వెళ్ళేవారు కారు. అదేరీతిలో నడచుకునేవారు. అదే మార్గమును అనుసరించేవారు.  శృంగేరీ పీఠములో కూడా అదే ఉత్క్రమము.వెనుకటి గురువులు యేమార్గమును మనకు వేసి ఇచ్చినారో , ఆ మార్గమునుండీ అటూ ఇటూ వెళ్ళే ప్రశ్నే లేదు. ఈ రోజు ఇక్కడ  శిష్య స్వీకార మహోత్సవమును  ఉదయము మనము జరిపిన క్రమమునే  ,1974 నవంబరులో చూసినవారు ఒక ఐదారు మంది ఉన్నారిక్కడ.  ఆ దినము యేమేమి ఎలాగ జరిగిందో , అదే పద్దతిలో ఈ దినము జరిగింది అన్న సంతోషము వారి ముఖములో నేను చూసినాను. ఇది ఈ శృంగేరీ మఠపు వైశిష్ట్యత. ఆ జగదంబ శారదాంబయే  ఇక్కడి ఉత్తరాధికారిని నిర్ణయించినది. మేము కాదు. ఆ మాత ఎవరిని నిర్ణయిస్తుందో వారికే మేము ఉత్తరాధికారమునిస్తాము. కాబట్టి మేము ఆ బాధ్యతను మాపైన వేసుకున్నదే లేదు. అందువలన , మా గురువులు ఆ సంవత్సరము నవరాత్రులలో చివరిరోజు , పల్లకీ ఉత్సవము అయిన  తరువాత వచ్చి అమ్మ దగ్గరకు వెళ్ళి , అక్కడ ఒక అయిదు నిమిషాలుండి, అమ్మ అనుజ్ఞ పొంది బయటకు వచ్చి ప్రకటన చేసినారు. అంతవరకూ వారు ప్రకటించలేదు. అనేక శిష్యులు వారిని అడిగేవారు ," తమకు వయసు యాభై ఆరు వచ్చిందే , ఉత్తరాధికారి గురించి యేమైనా ఆలోచించినారా ? ’ అని. ’ నాకెందుకయ్యా , ఆ భారము ఆ మహామాతదే.  ఆ మహామాత ఎప్పుడు తీర్మానము చేయునో అప్పుడే అగును , నేనెందుకు దానిగురించి బుర్ర పాడుచేసుకోవలెను ’ అన్నారు. 

ఆ నవరాత్రులలో చెప్పినారు , " ఆ జగన్మాత నాకు అనుజ్ఞనిచ్చింది, ఈ వ్యక్తిని నువ్వు ఉత్తరాధికారిగా నియమించు అంటూ జగన్మాత అనుమతినిచ్చింది,ఇకఎటువంటి ప్రశ్నలకూ తావులేదు , ముందరి ద్వాదశినాడు వీరికి సన్యాసము అగును "  అన్నారు. 


అదే , ఈసారీ పునరావృత్తి అయింది. ఈ పద్దెనిమిది దినముల వెనుక , ఇప్పుడే మన శాస్త్రులు చెప్పినట్టే ,  మనవూరివారందరూ చేరి ,’ తమకు పట్టాభిషేకమై ఇరవై అయిదు సంవత్సరాలైనది, దానిగుర్తుగా ఒక రజతోత్సవము చేయవలెను ’ అని విజృంభణగా చేసినారు. ఆ దినము గురువుల పల్లకీ ఉత్సవము జరగవలెను అని అందరూ భీష్మించినారు. సరేలెమ్మని పల్లకీ ఉత్సవము అయినాక లోపలికి వెళ్ళి అమ్మదగ్గర ప్రార్థన చేసినపుడు , అమ్మ నాకు ప్రేరణ ఇచ్చినారు. ’ ఈ పిల్లవాడికి సన్యాసము నిచ్చివేయవయ్యా ’ అని. ఆ దినము మా గురువులకు యే విధముగా అమ్మ అనుజ్ఞ దొరికినదో , అదే విధముగా నాకు కూడా అమ్మవారి అనుజ్ఞ దొరికినది. ఆ అనుజ్ఞనే నేను ఆ సభాముఖముగా చెప్పినాను. మా అధికారులన్నారు , ’ అదెవ్వరికీ తెలియనే లేదు , గురువులతో పాటే ఎల్లపుడూ ఉండేవారికి కూడా ఆ సంగతే తెలియలేదు , ఉన్నపాటున ఒక్కసారిగా గురువులు చెప్పినారే ’ అని. అమ్మ అనుజ్ఞ లేనిదే నేను మాత్రం ఎలాగ చెప్పగలను ? అమ్మవారి అనుజ్ఞ దొరకగానే వెంటనే చెప్పినాను. కాబట్టి ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమము , శృంగేరీ మఠములో అనూచానముగా వస్తున్నట్టి ఒక కార్యక్రమమే.


 నాకు సంతోషము కలిగించేదేమిటంటే , మన రాష్ట్రపు అనేకులు , మరియూ మన అధికారులు చెప్పినట్లుగా మన రాష్ట్రపు చుక్కానిని పట్టినట్టి అనేక అధికారులు , విశేషమైన అభిమానముతోవచ్చి ఈ కార్యక్రమములో పాలు పంచుకున్నారు.  ప్రతి ఒక్కరికీ , మన రాష్ట్రపు వారే కాదు , బయటి రాష్ట్రాలవారే కాదు , మన దేశపు వారందరికీ ’ శృంగేరీ మఠము యే రాజకీయాలకూ సంబంధించిన మఠము కాదు , శృంగేరీ జగద్గురువులు రాజకీయాలకు అతీతముగా ఉండేవారు , తమ కర్తవ్యములో మాత్రమే నిరతులై ఉండేవారు. తమకు సంబంధము లేని విషయములలో యేమాత్రమూ తలదూర్చనివారు , ’ అన్నట్టి పరిపూర్ణమైన భావము మన దేశములో ప్రతి ఒక్కరికీ ఉంది. కాబట్టి, సర్వులకూ , ఇక్కడికి వచ్చుట , ఆశీర్వాదము పొందుట అనేది ఒక గర్వించతగ్గ విషయము , అదొక సంతోషించ వలసిన విషయము. 


అందువలననే , ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వాదము తీసుకొనుట అనేది ఎప్పటినుండో జరుగుతున్నది. వెనుక , మైసూరు మహారాజుల పాలన మన రాష్ట్రములో ఉన్నపుడు , శృంగేరీపీఠములో ఉత్తరాధికారి నియమితులై శిష్య స్వీకారము చేయువేళ , మహారాజులకు శ్రీముఖమును పంపుట , మహారాజులు స్వయముగా తామే వచ్చుట , లేదా , ఒకవేళ అత్యవసరమైన పరిస్థితిలో వారికి వచ్చుటకు వీలుకాకపోతే , తమకు అత్యంత ఆప్తులైన ప్రతినిధులను , అనగా , దివాను వంటి ప్రతినిధులను పంపుట అనేది, శృంగేరీ మఠములో శత శతమానములనుండీ వస్తున్న ఆచారము. మరియూ , అమ్మవారి అనుజ్ఞ చేత  గురువులు ఎవరిని ఉత్తరాధికారులుగా ఎంచి ప్రకటిస్తారో వారిని కూడా అత్యంత సంతోషముతో స్వీకరించి,  జగద్గురువుల వలెనే గౌరవించే ఒక సంప్రదాయము ఆనాటినుండే వస్తున్నది. ఆ సంప్రదాయము ప్రకారమే  , ఈనాడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వపు ప్రతినిధులుగా జయచంద్రులు , అభయ చంద్రులు వచ్చినారు , అంతే కాక , ఎడ్యూరప్ప , శంకరమూర్తి ,  అనంత కుమార్ , రామచంద్ర గౌడులు , జీవ రాజు  వంటి అనేక ప్రముఖులు అత్యంత ప్రేమ , అభిమానము , మమతలతో ఇక్కడికి వచ్చి  ఈ కార్యక్రమములో  భాగము వహించినారు.  వారందరికీ నా పరిపూర్ణమైన ఆశీర్వాదములు. 


మన మఠపు శాఖా మఠములు మన రాష్ట్రములోనూ , బయటి రాష్ట్రములలోనూ ఉన్నాయి, వాటిలో శివగంగ మఠము , మరియూ ఎడత్తిరి యోగానందేశ్వర మఠముల వారు  మాపై అత్యంత  శ్రద్ధాభక్తులు కలవారు. ఆ మఠాధిపతులు , పురుషోత్తమ భారతీ స్వాములు , మరియూ  శంకర భారతీ స్వాములు అత్యంత సంతోషము , శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చినారు, వారిని నేను పరిపూర్ణముగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే , ఆంధ్ర దేశములోని ’ ధర్మపురి ’ అను ఊరిలో ఉన్నట్టి ’ సచ్చిదానంద సరస్వతీ స్వాములు’  కూడా  ఎంతో శ్రద్ధాభక్తులతో వచ్చినారు , వారికి కూడా నా ఆశీర్వాదములు. 


మా అధికారులు చెప్పినారు, పత్రికా ప్రతినిధులు మరియూ టీవీ మాధ్యమము వారు ఈ కార్యక్రమములో మాకు అధికముగా సహకరించినారు , వారందరికీనూ నా ఆశీర్వాదములు. 


అందరికన్నా ముఖ్యముగా మా మఠపు శిష్యులు , ఈ దినము ఇంత సంఖ్యలో వస్తారని నేను ఊహించనేలేదు. ఎక్కడెక్కడినుండో వచ్చినారు, కేవలము ఈ కార్యక్రమమును చూడవలెనన్న అభిలాషతోనే. ’ నేను ఈ రోజు ఎవరినీ చూచుటకుగానీ మాట్లాడుటకుగానీ వీలుకాదని చెప్పినాను , అయితే , ’ తమరు మమ్మల్ని చూచుట , మాట్లాడుట కాకపోయినా , తమరిని చూచుటకు మేము వస్తాము , మమ్ములను తమరు చూడవలెనని నిర్భంధము చేయము ’ అంటూ అంతటి ప్రేమాభిమానాలతో మా శిష్యులు వేల వేల సంఖ్యలో వచ్చినారు. వారందరికీ కూడా నా పరిపూర్ణ ఆశీర్వాదములు. 


ఇక ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పవలసినది యేమీ లేదు , మా ఉత్తరాధికారి స్వాములకు మేము . ’ విధుశేఖర భారతీ ’ అనే యోగపట్టమును ఇచ్చినాము. అనేకులు అడిగినారట , ’ దీని అర్థమేమి ? ’ అని. మా పరమ గురువులు , ’ చంద్రశేఖర భారతీ ’ అను అవిధానముచేత జగత్ప్రసిద్ధి పొందినవారు , వారి నామమును వినని వారెవరూ ఉండరు , వారి నామధేయమునే వీరికి పెట్టవలెను అని నాకు అభిప్రాయముండినది. కానీ , అదే పేరునే పెడితే , మాకు అత్యంత గౌరవ పాత్రులైన వారి పేరుతో మా శిష్యులను పిలుచుట అన్నది మా మనసుకు సమంజసము అనిపించలేదు. చంద్రశేఖర భారతులు మాకు పరమ గురువులైనప్పుడు , చంద్రశేఖర భారతులు మా శిష్యులు అని అంటే అది సమంజసము కాదు, అయితే , ఆ పేరంటే నాకు అత్యంత అభిమానము , కాబట్టి , సంస్కృతములో చంద్రుడికి ’ విధు ’ అన్నది పర్యాయ పదము కాబట్టి, 


|| హిమాంసుశ్చంద్రమాః చంద్రః ఇందుః కుముదవాన్ భవః విధుఃసుధాంసుః శుభ్రాంశుః || అని కోవై. 


చంద్రునికి ’ విధు ’ అనేది పర్యాయ పదము , ఎలాగంటే , రామః అన్నా , సీతాపతి అన్నా , దాశరథి అన్నా రాముని పేరే అన్నట్లు , అలాగే , చంద్రః అనేది, విధుః ’ అనేది రెండూ ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల , ’ చంద్రశేఖర భారతీ ’ అనుటకు బదులుగా , ’ విధుశేఖర భారతీ ’ అని అంటున్నాను. అంతే తప్ప దీనికి ఇంకే విధమైన అర్థమునూ కల్పించవలసిన అవసరము లేదు. ఆ చంద్ర శేఖర భారతులను జ్ఞాపకము చేసుకొని , వారిని మేము మరలా చూస్తున్నాము అనే అభిప్రాయముతో , ’ విధుశేఖర భారతీ ’ అనే పేరు వారికి పెట్టినామే తప్ప మరేమీ కాదు. 


ఈ మా శిష్య స్వాములు , అత్యంత యోగ్యులై, శాస్త్రములో విశేషమైన పాండిత్యమున్న వారై, మా మనసును అత్యంత సంతోష పరచినారు. అయిదారు సంవత్సరముల నుండీ వారు మాదగ్గర శాస్త్రాధ్యయనము చేస్తున్ననూ కూడా వేరే యే ఇతర విషయములకూ వెళ్ళక , వేరే యే వ్యవహారములకూ తలదూర్చక , ఎవరితోనూ సంబంధములు  పెట్టుకోక , తామేదో , తమ  పాఠమేదో అంతే తప్ప ఇంకే విధమయిన వాటితోనూ సంబంధము లేక ,  వేరే దేనియందూ ఆశ అన్నదే లేకుండా ఉన్న ఈ అన్ని విధముల యోగ్యతలను చూచియే అమ్మవారు అనుజ్ఞ నిచ్చినందు వలన వారికి దీక్షనిచ్చి మా ఉత్తరాధికారులుగా చేసినాము , వారిని సమస్త విధములుగా శక్తియుక్తులను చేసి ఈ మఠాన్ని ఇతోధికంగా ఉఛ్చ్రాయ స్థితి
కి తీసుకువెళ్ళగల సామర్థ్యమును  వారికి ఇవ్వవలెనని ఆ అమ్మవారిని ప్రార్థించి , దానికి మీ అందరి సహకారమూ కూడా అత్యగత్యము అని చెప్పి , మీ అందరికీ నా పరిపూర్ణమైన ఆశీర్వాదములను తెలుపుతూ ఈ ప్రవచనమును సమాప్తి చేస్తున్నాను. 


|| హర నమః పార్వతీ పతయే హరహర మహాదేవ || 




https://www.youtube.com/watch?v=CXNr8p41xyc