SHARE

Thursday, December 17, 2015

సనాతన ధర్మపు రహస్యము---రెండో భాగము.

సనాతన ధర్మపు రహస్యము---రెండో భాగము.

ధర్మ విచారము

మహాస్వాములు తమిళనాట ఒక పల్లెలో 1926  లో శిబిరము వేసినపుడు వారిని దర్శించుటకు ఒక యూరోపియన్  వ్యక్తి వచ్చినారు. ఈ సంభాషణను రాసిన శ్రీ కృష్ణ అయ్యర్ గారికి ఆ యూరోపియన్ పేరు తెలియకపోవడము వల్లనో యేమో ,  అతడికి మిస్టర్ " ఎ " అని పేరు పెట్టారు...సౌలభ్యం కోసము.

భారతీయ వేదాంత శాస్త్రము గురించి అప్పటికే ఆయన కొన్ని పుస్తకాలు చదివి , వాటి బోధనల వలన ప్రభావితులైనారు. స్వామితో వారి ప్రసంగము :_

మిస్టర్ " ఎ ":- " స్వాములవారూ , హిందూ ధర్మపు బోధనల వలన నేను ఎంతో ప్రభావితుడనై ఉన్నాను. నన్ను  మీ ధర్మములోనికి  మతాంతరము చేసి చేర్చుకొన వలసినదని నా అభ్యర్థన. నా వలెనే , హిందువులుగా మారి పరివర్తన చెందవలెనన్న ఆశ ఉన్న నామిత్రులు అనేకులున్నారు. వారిని కూడా పిలుచుకు వస్తాను. మా అందరికీ ఈ హిందూ ధర్మము వలన ఎంతో ప్రయోజనము చేకూరగలదని అవగతము అయినది.. "


గురువులు :- " హిందూ ధర్మము ఈ జగత్తులోని ఆలోచనా శీలురైన జిజ్ఞాసువుల నందరినీ  తన వైపుకు ఆకర్షించుకొనుటలో ఆశ్చర్యము కానీ అబద్ధముగానీ లేవు. కానీ మా ధర్మము కానీ మేము కానీ మతాంతరములను , మత మార్పిడులను ఒప్పుకొనుట కానీ ప్రోత్సహించుట కానీ చేయము.

మిస్టర్ " ఎ ":- " మీ హిందూ ధర్మము మానవ కులానికే హితకారి అనునది తెలుసుకొని అంగీకరించినపుడే , తమరు , మతాంతరము చెందుటకు ఆశపడేవాళ్ళను అందులోకి చేరుటకు అవకాశము నియ్యవలెను అనునది స్పష్టమగుచున్నది కదా ? మతాంతరము వద్దని ఎందుకు శెలవిస్తున్నారు , తెలుసుకోవచ్చునా ? "

గురువులు :- " మా ధర్మములోనికి వచ్చి హిందువుగా పరివర్తన చెందవలెనన్న ఆశ ఉన్న  ఏ వ్యక్తి అయినా , హిందువు కాకపోయినపుడు కదా , మతాంతరపు ప్రశ్న వచ్చేది ? "

మిస్టర్ " ఎ ":- " అదెలాగ ? హిందువుగా పరివర్తన కావాలన్న కోరిక ఉన్న నా వంటివారు , హిందువుగా మారకుండానే , కేవలము కోరుకున్నంత మాత్రానే హిందువులము అనిపించుకుంటామా ? ప్రస్తుతము మా మతము వేరు కదా ? అంటే హిందువుగా మారుటకు ఏ విధమయిన సాంప్రదాయక విధి ఆచరణ కూడా అవసరము లేదని స్వాముల అభిప్రాయమా ? " 

గురువులు :- " కాదు , హిందువులము అనిపించుకోవలెనని కోరే వారు , ఆ విధముగా కోరని వారూ , అందరూ కూడా హిందువులే అన్నది నా అభిప్రాయము. "

మిస్టర్ " ఎ ":-  ఆశ్చర్యపోతూ , " అదెలా సాధ్యము ? "

గురువులు :-" మన ధర్మానికి " హిందు " అన్న పేరు వచ్చినది  ఈ మధ్య మాత్రమే. దాని నిజమయిన పేరు , " సనాతన ధర్మము ".అది ఏదో ఒక నిర్దిష్ట కాలములో గానీ , ఎవరో ఒక నిర్దిష్ట మతస్థాపకుని వల్లకానీ స్థాపించబడినది కాదు. ప్రారంభమయినది కాదు. సార్వత్రికమైన ఆ ధర్మము ఏదో ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితమయినది కాదు. ఇంతవరకూ ఈ జగత్తులో జన్మించిన , ఇకముందు జన్మించబోయే సమస్త జీవులూ , ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా , కోరినా కోరకున్నా ఈ ధర్మానికి చెందినవారే . ఇది సృష్టి నియమము. ఈ నియమానికి ఏ అడ్డూ లేదు. అగ్ని కాల్చుతుంది అన్నది సత్యము. దానికి,  తన కాల్చేగుణాన్ని నిరూపించుటకు యే ప్రమాణమూ అవసరము లేదు. మనము ఒప్పుకున్నా , లేకున్నా , అగ్ని యొక్క గుణ-స్వభావములలో ఎటువంటి మార్పులూ పరిమితులూ ఉండవు. ఒకరు ఒప్పుకోనంత మాత్రాన దానికి యే లోటూ రాదు. మనము అది తెలుసుకొని ఒప్పుకుంటే మనకు శ్రేయస్సు. లేకపోతే చెడేది మనమే. సనాతన ధర్మము కూడా అదే విధమైనది. "

మిస్టర్ " ఎ ":- " ప్రపంచములోని అందరూ హిందువులే అని తమరు అంటే , మరి వివిధ జాతులున్నాయి కదా ? దానికేమి చెపుతారు ? ఎలా సమర్థిస్తారు ? "

గురువులు :- " అందరూ హిందువులే అంటే దాని అర్థము , అందరూ తమ తమ అభిప్రాయము లేదా మతము లలో మార్గదర్శనము పొందుటకు అర్హులు అని అర్థము. అయితే ఈ మార్గదర్శనము అందరికీ ఒకే రీతిలో ఉంటుందని అర్థము కాదు. మనిషికి పుట్టుకతో వచ్చిన ఆచారాలు , స్వభావాలు , పూర్వ జన్మ సంస్కారాలు , పరిసరాలు , పరిస్థితులు , మరియు అతడు పుట్టిన తరువాత పొందే శిక్షణలు --ఇవన్నీ అందరికీ ఒకే విధముగా ఉండుట అసాధ్యము. పరస్పర వైరుధ్యాలున్ననూ ఒకదానికొకటి విరోధము కాని ఈ సత్యాన్ని గణనకు తీసుకొని , సనాతన ధర్మము ’ సామాన్య ధర్మము ’ మరియు ’ విశేష ధర్మము ’ అను విభజన మూలముగా మీ సమస్యను పరిష్కరిస్తుంది. మొదటిది [ సామాన్య ధర్మము ] సర్వ మానవాళికే సహకారి , ప్రయోజనకారి.  ఈ మొదటిదీ , రెండవదీ [ విశేష ధర్మము ]  రెండూ చేరి మతాల చట్రము లోపల వచ్చువారికి ఉపయుక్తమైనవి. వివిధ కులాల వారికి కూడా అదే విధముగా ఉపయోగమైనవి. "

మిస్టర్ " ఎ ":- " ఈ విశేష ధర్మములకు కూడా ఆధ్యాత్మిక విలువలున్నాయి , ప్రయోజనము ఉంది అన్నట్టయితే , వాటి ప్రయోజనాన్ని వర్ణ వ్యవస్థ లో లేని వారు , ఇతర మతస్థులు ఎందుకు పొందరాదు ? "

గురువులు :- " నీరు అన్ని జీవులకూ ప్రయోజనకారి. అయితే , ఎండ తాపానికి గురయిన వ్యక్తికీ , మరియూ జ్వరముతో బాధపడే వ్యక్తికీ ఒకే విధముగా ప్రయోజనము నిస్తుందా ? సందర్భమునకు తగినట్టు దాని ప్రయోజనము మారదూ ? "

మిస్టర్ " ఎ ":- " మీ ఈ ఉదాహరణ నాకు అంతగా సమ్మతము అగుట లేదు. ఒక నిర్దిష్ట వర్గానికి అన్వయించే నియమము , ఆ వర్గానికి చెందని వారికిగానీ , లేక వేరే యే వర్గానికీ చెందని వారికి గానీ హాని కారకము అంటూ సమర్థించుటకు యే ఆధారమూ కనపడుట లేదు. "

గురువులు :- " అదే విధముగా , ఆ నియమాలు " సర్వులకూ ప్రయోజనకారులు "  అని సమర్థించుటకు కూడా సాధ్యము కాదు. ఎందుకంటే , అవి ఒక నిర్దిష్ట వర్గానికి చెందినందు వల్ల మాత్రమే ప్రయోజన కారులు అయినాయి. ఆ కారణము చేతనే అవి " విశేష ధర్మాలు " అనిపించుకున్నాయి . కాబట్టి అట్టి నియమాలకు సార్వత్రికముగా అన్వయము ఉండుటకు సాధ్యము కాదు. ఈ విధమయిన నియమాల [ ధర్మాల ]  గురించి మనకు శాస్త్రాలు మాత్రమే తెలియజేస్తాయి. అలాగ , ’ శాస్త్రము చెప్పే ధర్మాలు ప్రయోజనకారులు ’ అను విషయాన్ని ఒప్పుకున్నప్పుడు , ఆ నియమాలు ఎవరికి ఉపయోగము , ఎవరికి కాదు అన్నది కూడా తెలియజేసే అవే శాస్త్రాల ఆదేశాలను పరిపూర్ణముగా ఒప్పుకోవలసి ఉంటుంది.

శాస్త్రముల ద్వారా , ధర్మము వలన ప్రయోజనము ఉంది అని తెలుసుకున్న మీరు , అందరికీ ఏకరూపముగా ధర్మాలను చెప్పలేదు , వేరు వేరు ధర్మాలను చెప్పినాయి అనే కారణము వల్ల అవే శాస్త్రాలను నిరాకరిస్తారా ? అలా చేయుటకు సాధ్యమే లేదు కదా . శాస్త్రపు ఒక ఆదేశము సరియైనది , మరొకటి సరి కాదు అనుటకు సాధ్యము కాదు. మనుషుల ప్రవర్తనను నియంత్రించుటే శాస్త్రముల ఉద్దేశము. సనాతన ధర్మము కానివ్వండి , మరే ఇతర మతము కానివ్వండి , అధికార సిద్ధాంతాన్ని పాటిస్తాయి. [ అధికారము అంటే అర్హత ] . ధర్మమును పాలించుటకు అధికార స్వరూపాన్ని నిర్ణయించుట అవసరము. వర్ణాల చట్రములోకి వచ్చే వారు విశేష ధర్మాన్ని పాలించుటకు అర్హులు. రానివారు కేవలము సామాన్య ధర్మాన్ని పాటించుటకు అర్హులు. కాబట్టి , మానవ జాతి మొత్తము ఈ రెంటిలో ఏదో ఒక ధర్మాన్ని పాటించవలసినదే. "

మిస్టర్ " ఎ ":- " సనాత
శాస్త్రాలు సర్వ మానవాళికే హితకారులు అయినప్పుడు , మరియు , తమరు చెప్పినట్టు ఈ జగత్తులో పుట్టిన వారందరూ మీ ధర్మానికే చెందిన వారు అయితే , ప్రపంచములోని ఇతర ధర్మాల గురించి ఏమి చెపుతారు ? తమరి అభిప్రాయమేది ?"

గురువులు :-" ఆయా ధర్మాలకు , మతాలకు చెందిన వారు,  ’ తమ ధర్మాలు సనాతన ధర్మమునుండే పుట్టినవి , దాని అంగములే అన్నది తెలుసుకొనకుండుట వారి తప్పు. ఇతర అన్ని ధర్మాల లోని ఉత్తమమైన , ఉత్కృష్టమైన బోధనలూ కూడా సనాతన ధర్మములోనే మూలాలను కలిగియున్నాయి. అవన్నీ సనాతన ధర్మపు ’ సామాన్య ధర్మపు ’ నియమాలలో భాగాలే. "

మిస్టర్ " ఎ ":- "స్వామీ , ఇది అతిశయముగా లేదూ ? ఇతరులు దీనిని ఎందుకు ఒప్పుకోవలెను ? "

గురువులు :- " ప్రస్తుతము మన చర్చ , సనాతన ధర్మానికి ఇతరులు మాన్యత నిచ్చుట  అనునది కాదు. ఏదైనా ఒక వస్తువులో అంతస్థముగా ఉన్న ఒక మౌల్యము , దానిని ఇతరులు ఒప్పుకున్నా లేకున్నా , ఉండనే ఉంటుంది. ప్రాథమికముగా శాస్త్రము అతి ఔదార్య స్థాయిలో చెపుతుంది గనక , ఇతరులు ఒప్పుకోరన్న కారణముతో దానిని ఇంకా కింది స్థాయికి తెచ్చుట అసాధ్యము. "

మిస్టర్ " ఎ ":- " ఎలాగ , దయచేసి వివరించండి "

గురువులు :- " మీకు పూర్తిగా అర్థము కావలెనంటే నేను క్రైస్తవ మతపు ఉదాహరణ తీసుకొని వివరిస్తే తమరు నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను.

సశేషము ......

Tuesday, December 15, 2015

సనాతన ధర్మపు రహస్యము--- మొదటి భాగము

సనాతన ధర్మపు రహస్యము--- మొదటి భాగము



అనేక సార్లు , " సనాతన ధర్మము ఎటు పోతున్నది ? రోజురోజుకూ మన ధర్మాన్ని కించపరుస్తూ తూలనాడేవాళ్ళే ఎక్కువవుతున్నారు.. మిగిలిన మతాలన్నిటికీ మార్గదర్శనము నిచ్చిన సనాతన ధర్మమును ఎందుకు ఇతరులు ద్వేషిస్తున్నారు ? ఇతరుల మాట అలా ఉంచితే , మనవారే ఎందుకు మన గొప్పదనాన్ని అర్థము చేసుకొనుట లేదు ? ఎవరికి ఇష్టము వచ్చినట్లు వారెందుకు వ్యాఖ్యానిస్తున్నారు ? అపౌరుషేయమైన వేదములే పునాదిగా గల మన ధర్మానికి గ్లాని కలుగుతుంటే మూఢుల వాదనలను  , వక్రభాష్యాలనూ తిప్పికొట్టి కనువిప్పు కల్గించే వారే లేరా ? సనాతన ధర్మపు గొప్పతనము తెలిసిననూ , దానిని అందరికీ సరిగ్గా వివరించలేక ఇంకా అయోమయానికి గురి చేస్తున్న నేటి కొందరు గురువులకు మార్గదర్శనమే లేదా ?  పీఠాధిపతుల మొదటి కర్తవ్యము ఇట్టి సందేహ నివృత్తి చేసి అందరికీ ఒక విశ్వాసాన్నీ , ధైర్యాన్నీ , ప్రశాంతతనూ కలిగించుట కాదా ? వారెందుకు మాట్లాడరు ? ఇతర మతస్థుల ఉన్మాదపు వాదనలకు దీటైన సమాధానము నెందుకు ఇవ్వకున్నారు....
అన్న ఆలోచనలు మొన్నటిదాకా నన్ను తొలిచేవి...

అటువంటి ఆలోచన అహంకార పూరితమైనదనీ , నాకు కలిగిన ఈ సందేహాలు , వాటికి సమాధానాలూ  మన జగద్గురువులకు తెలియనివి కావనీ , అందరికన్నా ముందే వారు ఇట్టి విషయాలపై దృష్టి సారించడమే గాక , తగు వివరణా , ఉపదేశమూ , హితబోధా చేసినారనీ , అది తెలుసుకోకపోవడము నా మూర్ఖత్వమేననీ సమయము వస్తేనే గానీ ఏదీ మన కళ్ళకు కనపడదనీ ఈ మధ్యే బోధ అయినది...
అప్పటి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల వారు ఇటువంటి అనేక విషయములపై , స్పష్టముగా , తార్కికముగా , మానవాళి శ్రేయస్సు కోసము ఎంతో విలువైన సమాచారమును ఇచ్చి ఉన్నారు.
ఒకానొక కన్నడ బ్లాగులో నాకు సమాధానాలు దొరికినాయి..ముఖ్యముగా " మతమార్పిడులను " గురించిన వివరణ నన్ను అప్రతిభుడిని చేసింది.. అక్కడ నేను చదివినది మీ , మన అందరి సౌలభ్యము కోసము అనువదించి ఇస్తున్నాను.

1925-27  మధ్య రెండు సంవత్సరముల కాలము శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామివారు తమిళనాడులోని వివిధ ప్రదేశాలలో సంచారము చేసినపుడు అక్కడి అనేక జిజ్ఞాసువులు - భక్తులూ స్వామీజీ వారిని సందర్శించి , తమ తమ సందేహాలను నివృత్తి చేసుకొనే వారు. ఆ సమయములో స్వామివారితోపాటూ ఉన్న కృష్ణ స్వామి అయ్యర్ అనువారు , అక్కడ జరిగిన సంభాషణలను రాసుకొని ఆంగ్లములో ,." From the master's lips "  అను పేరుతో 1930  లో ప్రచురించినారు.. ఆ తరువాత   " Dialogues with the Guru "  అను పేరుతో ముంబైలో పునర్ముద్రితమైనదని , ఇప్పుడు ఆ పుస్తకాలు దొరకుట లేదనీ ఆ బ్లాగరు రాసినారు. ఆ పుస్తకములో పన్నెండు అధ్యాయాలున్నాయట. వాటిలో మొదటి అధ్యాయము / మొదటి సంభాషణ జిజ్ఞాసువులకు అనుకూలము కాగలదను సంకల్పముతో ఆ బ్లాగరు కన్నడ భాషకు అనువదించినారు. దానినే నేను తెలుగులోకి అనువదిస్తున్నాను.

శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములు కేవలము ఒక పీఠాధిపతి మాత్రమే కాదు , ఆ పీఠమును అధిరోహించినారు అన్న కారణము చేత మాత్రమే కాదు , శాస్త్రాధ్యయనము , తపస్సు మొదలగు అనేక కారణముల వలన విశిష్టముగా గుర్తింపబడినవారు. కాబట్టి వారి మాటలకు ఎంతో మహత్త్వము ఉన్నది. కన్నడలో " శారదా పీఠద మాణిక్య " అను పుస్తకములో వారి వ్యక్తిత్వపు వైశిష్ట్యత గురించి విపులముగా నున్నదట ..

రెండో భాగములో వారి ఉపదేశము , ప్రవచనమూ చదవగలరు... పైన పేర్కొన్న పుస్తకాలు ఎవరివద్దనైనా ఉంటే దయచేసి తెలియజేయ గలరు ..


నేను చూసిన ఆ కన్నడ బ్లాగు ఇదీ...
http://herige.blogspot.in/2014/07/blog-post_6.html


Saturday, November 14, 2015

నైవేద్యము-విశేషాలు

శ్రీ గురుభ్యో నమః ||

నైవేద్యము-విశేషాలు
నైవేద్యము అన్న మాట వినగానే గుళ్ళూ , పూజలూ గుర్తొస్తాయి. సమంజసమే. గుళ్ళూ , పూజలూ మాత్రమే గుర్తుకు రావలెను.  ఈ నైవేద్యము అన్న మాటను దేవుడికి ఆహారమును నివేదించు సందర్భములో మాత్రమే వాడవలెను. 
వెంటనే ఒక ప్రశ్న:-- దేవుడు మనం ఇచ్చే ఆహారము తింటాడా ? మరి నైవేద్యము అయ్యాక , పదార్థాలన్నీ అలాగే ఉంటాయే ? వాటిని మనమే తింటున్నాము కదా ?
అవును.  వాటిని మనమే తింటున్నాము ...
అవును.  వాటిని దేవుడు తింటాడు.
పైవి రెండూ సరియైనవే. 

నివేదించిన పదార్థములు అలాగే ఉండుటకు కారణము , భగవంతుడు వాటిని ఆస్వాదించిన తరువాత , మనకు " ప్రసాదము " గా ఇస్తాడు కాబట్టి. 
అదెలాగ ? కొంచము అర్థమయ్యేటట్టు చెప్పరూ అంటారా ?  అలాగే. 

మానవులకూ , ఇతర ప్రాణులకూ ఉన్నట్టే , మానవేతర జీవులకూ , భగవంతుడికీ కూడా ఒక శరీరము ఉంటుంది. మనకు ప్రాణము ఉన్నట్టే అందరికీ ప్రాణము ఉంటుంది...దానినే చైతన్యము అనవచ్చు. ఆ చైతన్యమే అంతటా ఉండేది.  మనకున్న ప్రాణము ఒకటి కాదు. అయిదు. వాటినే పంచప్రాణాలు అంటారు. అవే , ప్రాణము , అపానము , వ్యానము , ఉదానము మరియు సమానము. 
భగవంతుడికి శరీరమేమిటి ?
శరీరమంటే మనకున్న , మనము అనుకునే పాంచభౌతికమైన శరీరం కాదు. దేవతల శరీరాలలో పృథ్వీ భూతము , జలభూతములుండవు. ఆకాశము , తేజస్సు , వాయువు రూపములలోనే దేవతలు సంచరిస్తారు. మనకు అయినట్టు వారికి ఆకలి కాదు. వారిక్ కలుగు ఆకలిని మనము మన పరిజ్ఞానముతో నిర్వచించలేము. అసలు వారున్న స్థాయి , మెట్టు వేరు. మనకు అన్వయించు అనేక విషయములు వారికి అన్వయించవు. అన్వయించేవి అదే తీరుగా ఉండవు. కాబట్టి అటువంటి పోలికలను వెదకుట పూర్తిగా అసంబద్ధమైనది.   కానీ మనము నివేదించిన పదార్థాలను చూచినంతనే సంతృప్తి చెందుతారు. వారి ఆకలి దానితో తీరినట్టే.

ముఖ్యముగా హోమములు చేసి ఇచ్చిన ఆహుతులవలన అగ్ని , ఇంద్ర , యమ , వాయు , సూర్య , చంద్ర , బృహస్పతి , మిత్ర  వరుణ , సోమ , సవితృ , రుద్ర, విష్ణువు మొదలుగా అనేక దేవతలు  తృప్తి చెందుతారు. యజ్ఞ భావనతో సమర్పించిన యే నైవేద్యమునయినా ఆయా దేవతలు సంతోషముగా స్వీకరిస్తారు.
 దీనిని వివరిస్తూ , యజుర్వేదములోని మూడో కాండములోని నాలుగో ప్రశ్నలో , " అగ్నిర్భూతానమధిపతిః..  ." మొదలుకొని పదునెనిమిది మంత్రాలను ఆయా దేవతలను తృప్తి పరచుటకొరకు వినియోగించవలెను ...అని చెబుతుంది. ఆ పద్దెనిమిది  మంత్రాలను " " అభ్యాతాన " మంత్రములు అంటారు. ఒకప్పుడు దేవతలూ , రాక్షసులూ కూడా ఒకే విధమయిన హోమములు , యజ్ఞములూ చేసేవారు. కానీ దేవతలకు మాత్రమే యజ్ఞ ఫలము దొరికేది. దానికి కారణము , దేవతలు ఈ పద్దెనిమిది అభ్యాతాన మంత్రములను కనుగొని వాటిని ఉపయోగించుకొని , తమ తమ కర్మలను సమృద్ధి పరచుకొన్నారు. రాక్షసులకు ఆ మంత్రములు తెలీక కర్మ భష్టులైనారు. యే కారణము చేత దేవతలు ఈ అభ్యాతాన మంత్రములను సంపాదించినారో , ఆ కారణము వలన ఆ మంత్రాలు " వైశ్వదేవములు " అని పిలవబడుతున్నాయి. భూతముల ఆకలితీర్చు యే ప్రక్రియ అయిననూ " వైశ్వదేవము " అనిపించుకుంటుంది. ఆ మంత్రములు దేవతలనుండీ ఋషులకూ , వారినుండీ  విప్రులకూ  వచ్చినవి. ఈనాటికీ యే చిన్న హోమమైననూ ఈ అభ్యాతాన మంత్రములు లేకుండా పూర్తి కాదు. [ ఇవే కాక జయాదులు , రాష్ట్రభృత్ మంత్రాలు అని ఉన్నాయి.. అవి ఈ చర్చలో అప్రస్తుతము ] వైశ్వదేవము అంటే  భూతముల ఆకలి తృప్తి పరచుటయే కాబట్టి , హోమమైననూ , పూజ అయిననూ యజ్ఞభావముతో చేసినపుడు , ఆయా దేవతల ఆకలి తీరి సంతుష్టులవుతారు. ఆయా మంత్రములు లేకున్ననూ , భావన ముఖ్యము. 

ఆ క్రమ విధానమే ఈనాటికీ పూజలలో పాటించబడుతున్నది. 

కాబట్టి , దేవతలకు నైవేద్యము సమర్పించుట వలన మన కర్మలు సఫలమై శుభములను పొందుతాము. 
దేవతలు మనకు వర్షాలు కురిపించగలరు. కానీ దుక్కి దున్ని పొలాలను పండించవలసినది మనమే. దేవతల శరీరాలు ఆ పని చేయలేవు.
అలాగే , దేవతలు పంటలు సమృద్ధిగా పండునట్లు చేయగలరు. కానీ ఆపండిన పంటలను శుచిగా వండుట వారికి రాదు. మానవులము మాత్రమే అది చేయగలము. 

మానవులకు వర్షాలు కురిపించు శక్తి లేదు. పొలాలను సాగుచేయ గలమే కానీ మొక్కలు , పంటలు పెరగకపోతే మనము చేయగలిగినదేమీ లేదు.  దేవతలు , మానవులు ఎప్పటికీ మిత్రులేగానీ శత్రువులు కారు. కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటాము.  
దేవతల అనుగ్రహము వల్ల పండిన పంటలను మనము వండుకు తింటూ , అనుభవిస్తూ , వారికి నివేదించకపోవడము మహా పాపము. ఎవడైతే అలా నివేదించకుండా తాను మాత్రమే తింటున్నాడో వాడు పాపమును తింటున్నట్లే. అంతేకాక , వండిదానిని కొంచమైననూ అతిథులకు సమర్పించక తాను మాత్రమే తినరాదు. అది వీలుకానప్పుడు కనీసము మొదటి ముద్దనయిననూ , పశుపక్ష్యాదులను తలచుకొని , బయట పెట్టి మిగిలినదానిని దేవుడికి సమరించినట్టు భావించి , ఆ సమర్పణా భావముతో కళ్లకద్దుకొని తాను తినవలెను. అసలు భోజనము చేయుటయే ఒక యజ్ఞము. దానిని ఆత్మ యజ్ఞము అంటారు. దేహములోని అయిదు ప్రాణములకు ఆహుతులను ఇచ్చి తాను తినవలెను. [భోజనము చేయు విధానము మరొక వ్యాసములో..]

సరే ఈ నైవేద్యమును ఎలాగ సమర్పించవలెను ? 

శుచిగా వండిన సాత్త్వికమైన ఆహారమును నేతితో అభిఘారము చేయవలెను [ నేతిని కొద్దిగా పదార్థముపై కలుపుట ]
ఒక కంచు , ఇత్తడి పత్ర లేదా , అరిటాకు , లేదా విస్తరి [  ఈ మధ్య స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వాడుట వాడుక అయింది] లోకి వండిన పదార్థమును తీసుకోవలెను. దానిని ఆవాహన చేసి పూజించిన దేవుడి పటముగానీ విగ్రహముగానీ కలశమునకు గానీ ఎదురుగా , నేలపైన పెట్టవలెను. అయితే అలాగే పెట్టరాదు, మొదట నేలపై నీటితో ఒక చతురస్ర మండలమును గీయవలెను. దానిపై నాలుగు అక్షతలు చల్లి దానిపై పాత్రను మూత తీసి ఉంచవలెను. మండలము ఎలా గీయవలెనో బొమ్మలో చూడవచ్చు. 

నైరృతి నుండీ  మొదలు పెట్టి వాయవ్యమునకు , అక్కడనుండీ  ఈశాన్యానికి, అక్కడనుండీ ఆగ్నేయానికీ , తర్వాత  నైరృతికీ సరళరేఖలు గీసి , నైరృతి నుండీ ఈశాన్యానికి అడ్డముగా ఒక సరళరేఖ గీయవలెను. ఇదే మండలము. 

తరువాత ఆ మండలముపై నైవేద్యపు పాత్రను పెట్టి , చేతిలో తులసీ దళమును శుద్ధోదకముతో పాటూ తీసుకొని ఈ మంత్రము పలుక వలెను
ఓం విశ్వామిత్ర ఋషిః | సవితా దేవతా | గాయత్రీ ఛందః | 
తర్వాత గాయత్రీ మంత్రము పలుకుతూ నీటితో ప్రోక్షణ చేసి సవ్యముగా పాత్రచుట్టూ కూడా పరిషేచన చేయవలెను[ నీటిని వదలవలెను]. పరిషేచన చేయునపుడు, 
పగలైతే | సత్యం త్వర్తేన పరిషించామ్ | అనీ , 
 రాత్రైతే |ఋతం త్వా సత్యేన పరిషించామి| 
అనీ పలకవలెను. తర్వాత | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా | అంటూ రెండు ఉద్ధరిణెల నీరు హరివాణములో వదలాలి.

తర్వాత  పంచప్రాణములకు ఆహుతులను ఇచ్చు సంకల్పముతో,
ప్రాణాయ స్వాహా , 
అపానాయ స్వాహా , 
వ్యానాయ స్వాహా , 
ఉదానాయ స్వాహా , 
సమానాయ స్వాహా  
అని పలుకుతూ పంచ ముద్రలు చూపవలెను. ఇంకా ధేను ముద్ర కూడా చూపుట ఉత్తమము. అన్ని పదార్థాలనూ చూపి, తులసిని అన్నము మీద ఉంచవలెను. 
ఈ ముద్రలు రాని వారు , అయిదు సార్లు కుడి అరచేతితో దేవుడికి నైవేద్యాన్ని చూపవచ్చును. భావము ముఖ్యము. 
ఒక ఉద్దరిణెడు నీరు వదలి , మనము సమర్పించిన నైవేద్యము స్థిమని సూచించుటకు , 
| అమృతోపిధానమసి స్వాహా| అని పలుక వలెను. ఇది నైవేద్యముపూర్తయినదని ఉద్వాసన చెప్పుట కూడా . 
తర్వాత కింది మంత్రాలు పలుకుతూ ఆరు సార్లు ఉద్ధరిణతో నీరు వదలాలి
ఉత్తరాపోశనం సమర్పయామి , 
హస్త ప్రక్షాళనం సమర్పయామి ,
ముఖ ప్రక్షాళనం సమర్పయామి
గండూషం కల్పయామి
పునరాచమనీయం సమర్పయామి

ఇక్కడికి నైవేద్య ప్రకరము ముగిసినట్టు. ఆ పదార్థాలను తీసివేయవచ్చు. 

నైవేద్యము అంటే పైన చెప్పినవన్నీ చేస్తేనే అయినట్టు కాదు. ఇటువంటి తంతులన్నీ కేవలము మన మనో స్వచ్ఛత , ఏకాగ్రతలు పెరుగుట కొరకు మాత్రమే. ఏకాగ్రతలు బలమయినపుడు ఇటువంటి కర్మాచరణ దానంతట అదే తొలగిపోతుంది. ఒక ఆసక్తి కరమయిన సంఘటన శృంగేరీ శారదా పీఠములో , అప్పటి జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ తీర్థుల వారి సమయములో జరిగింది.




ఒకసారి వారి దర్శనానికై వచ్చిన  శిష్యులొకరు , పెద్దదైన ఒక మరకత లింగమును తెచ్చి వారి ముందుంచినారు. " ఏమిటి సంగతి ? " అని గురువులు అడిగినారు.

" మహాస్వామీ , ఈ మహా లింగము మాయింటిలో అనేక తరాలనుండీ ఉంది. ఇప్పటి మా పరిస్థితులలో , మాకున్న సమయములో సరియైన క్రమములో దీనిని పూజించుటకు మేము అసమర్థులమై ఉన్నాము. అందుకని దీనిని శ్రీ గురువులకు అప్పజెప్పిపోదామని వచ్చినాము. గురువులు దీనిని  స్వీకరించవలసినదిగా మా ప్రార్థన " అన్నారు. 

" సరియైన క్రమములో పూజ చేయుట అంటే ఏమిటి ? క్లిష్ట పరిస్థితి అంటున్నారు.. మీ యింటిలో అందరూ భోజనాలు చేయుట కూడా మానేసినారా యేమి ?"

" లేదు స్వామీ , అటువంటి పరిస్థితి లేదు "

" అయితే , దీనిని పూజించుటకు మీకు ఇబ్బంది యేమిటి ? భగవంతుడు యేమీ తినడు. మనవలె అతడికి ఎన్నడూ ఆకలి కాదు. మీరు నిత్యమూ భోజనము చేయుటకు వంట చేస్తూనే ఉన్నారు కదా ? భగవంతుని కృపాశీర్వచనమును కృతజ్ఞతతో స్మరించుటకు , భోజనానికి ముందు ఆ పదార్థాలను దేవుడికి నివేదించండి. ఆ నివేదనవల్ల పవిత్రమగు ఆ ఆహారాన్ని మీరు స్వీకరించండి. దేవుడు మీనుండీ ఏమీ కోరడు. విశిష్టమైన కొన్ని ప్రత్యేక విగ్రహాలకు తప్ప , మిగిలిన విగ్రహాలకు , మీరు భుజించే , శాస్త్ర విరుద్ధము కాని పదార్థాలను నివేదిస్తే చాలు. దానికోసమై ప్రత్యేకముగా శ్రమపడనవసరము లేదు. విశేష ఖర్చులూ ఉండవు. మరి అలాంటప్పుడు పూజ చేయుటకు అసమర్థులము అని ఎందుకు భావిస్తున్నారు ? మీరు ఎంత పేదవారైననూ , భోజనమే మాను పరిస్థితి లేదు కదా ? అటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు అసమర్థులము అని చెప్పుకోవచ్చును. ఒక ఫలమో , ఒక లోటా పాలో , చివరికి ఒక లోటా నీరైనా సరే , మీకు ఉన్నపుడు , అదే దేవుడికీ చాలు. దానినే భక్తితో అర్పించండి. కాబట్టి ఈ లింగాన్ని మీరే తీసుకొని వెళ్లవలెను. భగవదారాధనకు సమయాభావమని మానకండి. ఆకలైనపుడు సావకాశముగా భోజనము చేసే వ్యవధి లేకపోతే ఆత్రాత్రముగా నాలుగు ముద్దలైనా మింగుతాము కదా , ఉపవాసము ఉండము. మృష్టాన్నము లేకున్ననూ సామాన్య భోజనమైనా చేసి ఆకలి తీర్చుకుంటాము కదా , అట్లే దేవతార్చనను లఘువుగా నైననూ మీరు చేయవలెను. మానరాదు, " అని ఉపదేశించినారు.

 || సర్వే జనాస్సుఖినో భవంతు ||

Monday, September 14, 2015

క్రైస్తవ మత ప్రచారకునితో జగద్గురువుల సంభాషణ-1973


శ్రీ గురుభ్యో నమః ||

శ్రీ శ్రీ శృంగేరీ శారదాపీఠము యొక్క ముప్పైఐదవ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థుల వారి కాలములో [1973] ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది.





గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము , వారి మతము సర్వశ్రేష్ఠమయినది , కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందుకోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు , వారి మతపు గొప్పదనము యేమిటో తెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించి సంభాషించినారు. 


యోగక్షేమాలు , కుశల ప్రశ్నలతర్వాత జగద్గురువులు అడిగినారు , 


జగద్గురువులు :" మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి ? "


" క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ] : " స్వామీ , నేను మీ ఊరిలో , మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను. "


గురువులు : " ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము ?" 

క్రై. మ. ప్ర.: " నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. "

గురువులు : " మీరు ఉపదేశించునది యేమి ?"

క్రై. మ. ప్ర.:"  "మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ , జనులకు ఉపదేశము చేసి , వారందరినీ మా మతానికి మార్చుకోవాలనుకొంటున్నాను. "

గురువులు :" మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే , నేను కూడా తెలుసుకుంటాను గదా ? "

క్రై. మ. ప్ర.:" అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధానములను ఇవ్వగలవాడను  "

గురువులు : " మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది ?"

క్రై. మ. ప్ర.:" మా మతము పుట్టి 1973  సంవత్సరాలయినాయి "

గురువులు :" సంతోషము , మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన  కాలము , సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందు ప్రజలు ఉన్నారా లేరా ? మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా ?"

క్రై. మ. ప్ర.:" జనులే లేకపోతే మేము మతబోధ ఎవరికి చేస్తాము ? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందు కూడా ప్రజలు ఉండనే ఉన్నారు. "

గురువులు : మీ మతములోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజనమేమి?"

క్రై. మ. ప్ర.:" మా మతములో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది  "

గురువులు :" సరే , మీరు మీ మతమును అనుసరించే వారికి మాత్రము స్వర్గప్రాప్తి కలుగుతుందంటున్నారు. ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి , మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికి వెళుతుండేవారా ? "

క్రై. మ. ప్ర.:" వారంతా నరకానికే వెళుతుండేవారు. మా మత ధర్మాన్ని పాలించనందువల్ల. "

గురువులు :" ఇదెక్కడి న్యాయము ? ఈ కాలపు ప్రభుత్వాలూ , న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా , మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారు నరకభాజనులవుతారు అనేది న్యాయమేనా ? ముందెప్పుడో రచించబోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుట ఎక్కడైనా సాధ్యమా ? కాబట్టి , మీరు మీ మతమునకు సంబంధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా ?"


క్రై. మ. ప్ర.:" [ బిక్క చచ్చి ], ఔను స్వాములూ , వారు అందరూ నరకానికి కాదు , స్వర్గానికే వెళ్ళిఉండాలి  " 


గురువులు :" ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా? ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల , వాటిని అనుసరించే కొందరు మాత్రమే స్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా ?  అందువల్ల , మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండిఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా ?"

క్రై. మ. ప్ర.:" [ తన మాటలకు తానే చిక్కుకొని గాభరా పడి] స్వామీ , మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలను అడుగుతున్నారే ? దయచేసి నన్ను వదిలేయండి " అన్నాడు.

గురువులు :" సరే , అట్లాగే కానివ్వండి , ఆ సంగతి వద్దు. చూడండి , ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ , సుఖ సంతోషాలకూ లోనగుటను చూస్తున్నాము కదా , దానికేమిటి కారణము ?"

క్రై. మ. ప్ర.:" దీన్నంతటినీ భగవంతుడే  చేసినాడు "

గురువులు :" ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ , ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగా ఇస్తున్నాడంటే , భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖములోనూ , తనకు అప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా ?" 

క్రై. మ. ప్ర.:" అది భగవంతుని స్వంత ఇఛ్చ , స్వామీజీ , మనమేమీ చేయలేము. వాడు ఏమికావాలన్నా చేయగలడు. అది వాడిష్టము.  "

గురువులు :" భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చు అన్నట్టయితే , అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా ? ఆ సుఖాన్ని కొందరికి మాత్రమే ఎందుకు ఇచ్చినాడు ?దానికి కారణమేమయి ఉంటుంది ?"

క్రై. మ. ప్ర.:" [అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను ? "

గురువులు :" మీ వాదానికి ఒక యుక్తి గానీ , తర్కము గానీ ఉన్నట్టే కనిపించుట లేదు. సరే , అదీ ఉండనివ్వండి , మరొక విషయము ; చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత. ఇలాగున్నపుడు , చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా ? "

క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలు పాపము ఎలాచేయగలరు ? వారు ఒక తప్పును కూడా చేయలేరు. వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికవి అంటవు "

గురువులు : " అందుకే అడిగినాను , వారు వెళ్ళేది స్వర్గానికా , లేక నరకానికా ?"

క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు  "

గురువులు :" అట్లయితే మన తల్లిదండ్రులంతా మనగురించి చాలా పెద్ద తప్పే చేసినారు అనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికి వదిలేయకుండా  పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా ? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది ? కాదా ?"

క్రై. మ. ప్ర.:"[ మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను  "  

గురువులు :" సరే , వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా ?"

క్రై. మ. ప్ర.:" భగవంతునికి ఎప్పుడు నిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు , అప్పుడే పోతారు  "

గురువులు :" ఇదేమయ్యా ఆశ్చర్యము ? భగవంతుడు పిచ్చివాడా యేమి , తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు ?"

క్రై. మ. ప్ర.:" అలాగ కాదు , అక్కడ అదంతటికీ ఒక క్రమ విధానముంటుంది "

గురువులు :" సరే , మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించినారో కొంచము చెపుతారా ? [ ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులే కొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో , దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి"

క్రై. మ. ప్ర.:" కానివ్వండి స్వామీ , చెప్పండి "

గురువులు :" ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చనిపోయిన తరువాత , దేవుడు , ఏదో ఒకరోజు , న్యాయ నిర్ణయమును చేసి, కొందరికి స్వర్గాన్నీ , కొందరికి నరకాన్నీ ఇస్తాడు. కదా ? సరియేనా ? "

క్రై. మ. ప్ర.:"  ఔనౌను , తమరు చెప్పింది సరిగ్గా ఉంది"

గురువులు :" ఈ ప్రపంచములోనే జరుగుతున్న సంగతిని చూడండి , ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే , విచారణకు మొదట , ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచుతారు. దాని తర్వాత కూడా అతడిని పోలీసులు లాకప్ లో ఉంచాలంటే ,దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ , కారణమూ , అనుమతీ లేకుండా , విచారణ చేయకుండా  ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయ వలసి ఉంటుంది. ఇలాగున్నపుడు , ఒకడు మృతుడయిన తరువాత వాడికి , " ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చచ్చిపోయే వరకూ , అనగా , కోటి కోటి సంవత్సరాలయ్యే వరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి , అదంతా అయ్యే వరకూ , ’ నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే ,అది న్యాయమనిపించుకుంటుందా ? మీరే చెప్పండి?"


జగద్గురువుల ఈ మాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడు దిక్కుతోచనివాడైనాడు. అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ , 


" మీకు మీ మతమే గొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతో అనుసరించవలెను. అంతే కానీ , ఇతరులతో , ’ మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుసరించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించకపోతే మీకు , నరకమూ , దుఃఖమే గతి’ అని చెప్పుట సాధువైనది కాదు. మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరులకు వారి వారి తల్లులు పూజనీయులు. ’ మాతల్లి మాత్రమే పూజనీయురాలు , ఇతరుల తల్లులు కాదు’ అంటూ మీరు చెప్పితే అది మీ మూఢత్వమే అవుతుంది. నా తల్లి కూడా ఇతరుల తల్లులవలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది. " అని ఉపదేశించినారు. ఆతడిని వీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువులు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించినారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు. 


ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి ,


 || సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |

అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్ ||

" మొదట యజ్ఞములతోపాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి, ’ ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక ’ యని అంటాడు. బ్రహ్మ దేవుడు , జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు. ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము , భగవంతుడు అనాదియైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ , మన ధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము , సత్కర్ములకు మంచి ఫలము. కర్మలు అచేతనమైనవి-అంటే జడమైనవి. ఫలము నిచ్చేది భగవంతుడే. 


భగవంతుడు దయాళువు అనునది దిటమైన మాట.. తప్పుచేసినవాడు తన తప్పును ప్రామాణికముగా ఒప్పుకొని క్షమాభిక్ష వేడితే న్యాయాధీశులు శిక్షను తగ్గిస్తారు కదా ? కానీ ఇతడు పదే పదే తప్పులు చేస్తూ ప్రతిసారీ క్షమాభిక్షను కోరితే న్యాయాధీశుడు క్షమిస్తాడా ? భగవంతుడు కూడా అట్లే. ప్రామాణికులైనవారిని క్షమిస్తాడు. కానీ పదే పదే తప్పుచేసే వాడిని ఖచ్చితముగా క్షమించడు. మన శాస్త్రములు శ్రద్ధతో పాటూ వివేకము కూడా ఉండవలెనని బోధిస్తాయి. ఇతరమతాలు శ్రద్ధ ఒక్కటీ ఉంటే చాలని చెబుతాయి. మత ధర్మములలో భావుకత మాత్రమే కాక విచారము చేయు ప్రవృత్తి కూడా ఉండవలెను. 


శ్రీరామచంద్రుడు , శ్రీ కృష్ణుడు వంటి అవతారాలు మన ధర్మములో మాత్రమే కనిపిస్తాయి. మన ధర్మము వారివల్ల యేదో కొత్తగా స్థాపించబడినది కాదు. మన ధర్మము , అటువంటివారిని ఈ జగత్తుకు ప్రసాదించింది. ఇంతటి మహాత్మ్యమున్న సనాతన ధర్మములో మనందరమూ జన్మించినాము. ఈ సనాతన ధర్మపు బోధనలను పాలించి మనమందరమూ శ్రేయస్సుకు తగినవారము కావలెను. " అని ఉపదేశించినారు. 


[ శ్రీ శృంగేరీ శారదా పీఠము వారు కన్నడ భాషలో ప్రచురించిన " శృంగేరీ పుణ్యక్షేత్రము " పుస్తకమునుండీ అనువాదము }

Thursday, April 23, 2015

ఆది శంకరుల అద్వైత సిద్ధాంతము-- శ్రీ భారతీ తీర్థ మహా స్వాముల మాటలలో.


|| శ్రీ గురుభ్యో నమః ||

ఆది శంకరుల అద్వైత సిద్ధాంతము-- శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహా స్వాముల మాటలలో.




పరమ పూజ్యులగు శ్రీ శంకర భగవత్పాదాచార్యులు , ధరపైన అవతరించి అద్వైత సిద్ధాంతమును ఈ ప్రపంచమునకు దయపాలించినారు. అయితే , అద్వైత సిద్ధాంతపు పుట్టుకకు శ్రీ శంకరులే కారణము అనేది సరికాదు. ఉపనిషత్తులలో అద్వైత సిద్ధాంతపు ప్రతిపాదన స్పష్టముగా ఉంది. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత యొక్క అంతరార్థము కూడా అద్వైతమే. శ్రీ వేదవ్యాసులు కూడా బ్రహ్మ సూత్రములలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు. 

అయినా కూడా శ్రీ శంకరుల అవతారము అగు వరకూ అద్వైత సిద్ధాంతము జటిలముగనే ఉండిపోయినది. ఉపనిషత్తులలోని కొన్ని వాక్యములను ఆధారముగా చేసుకొని కొందరు , తమకు తోచినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. నాస్తికులు కూడా తమ మొండి సిద్ధాంతాలను సమర్థించుకోవాలంటూ కొన్ని వేద వాక్యాలను నిదర్శనముగా చూపుతున్నారు. ఇలాగ అద్వైత సిద్ధాంతము గురించి బలము లేని చర్చలు నడుస్తుండేవి. అటువంటి సందర్భములో జనులను సరియైన దారికి తెచ్చు క్రమములో భగవత్పాదులు శంకరాచార్యులు ధరపై అవతరించినారు.  ఉపనిషత్తులలోని గూఢార్థముగా ఉన్న సిద్ధాంతమును సరళముగా జనులముందు విప్పి పెట్టినారు. 
వేదవాక్యములను విశ్లేషించుటకు సూక్త ఆధారములను ముందర పెట్టుకోవలెను. మనము చేయు విశ్లేషణలు సరియైన దారిలోనుండవలెను. అద్వైతము  శృతి , యుక్తి  మరియూ అనుభవవేద్యమై యున్నది. 

|| వేదస్య హి నిరపేక్షమ్ ప్రామాణ్యం రవేరివ రూపశయే || 

ఈ [ అద్వైత ] సిద్ధాంతమును ప్రతిపాదించునపుడు మనము వేదమును పరమ ప్రమాణముగా అంగీకరించ వలెను అంటారు శంకరులు. కొందరు , " వేదములలో అయోమయము కలిగించు అంశములున్నాయి , కాబట్టి అవి ప్రమాణములు కాదు " అంటారు. కానీ అది సరి కాదు , పూర్వాపర విరోధము రాకుండా , సమగ్ర ప్రకరణమును చూసి , ఆ తరువాతనే వేదమునకు అర్థమును చెప్పవలెను. ఉదాహరణకు ,ఉపనిషత్తులోనున్న , " న తస్య ప్రతిమాఽస్తి " అనే వాక్యానికి కొందరు , " దేవుడికి ప్రతిమా మూర్తి అనేది లేదు , కాబట్టి విగ్రహారాధన చేయకూడదు " అని అర్థము చెపుతారు. అయితే , ఆ వాక్యానికి అర్థము అది కాదు , ’ ప్రతిమా ’ అంటే , ఉపమ ...లేదా పోలిక. దేవుడికి సమానమైనవాడు , వాడికి ఉదాహరణగా ఇవ్వతగ్గ ’ మరొక ’ వస్తువు కాదు" అని ఆ వాక్యానికి అర్థము. ఇదే అర్థాన్ని, " న తత్ సమశ్చ అభ్యధికశ్చ  దృశ్యతే " అనే ఉపనిషద్వాక్యము బోధిస్తుంది. అతడికి సమానమైన మరియూ అతడికన్నా అధికుడైన ఇంకొకడు లేడు అని దానర్థము. 

భగవంతుడు వర్ణనాతీతుడు , ఊహాతీతుడు , అనంతానంత సామర్థ్యమున్నవాడు. అచింత్యుడు , అపరిమితుడూ అయి ఉన్నాడు. అతడికి పోల్చదగిన మరొక వస్తువే లేదు. అదే , ఆ ఉపనిషత్ వాక్యపు అర్థము. అట్లున్నపుడు మనము వేదవాక్యములను తప్పుగా అర్థము చేసుకోకుండా , ప్రతీ దానినీ , యే విరోధమూ కలుగకుండా స్పష్టముగా అర్థము చేసుకోవలెను. ఆ కారణము చేతనే భగవత్పాదులు శంకరులు , వేద వాక్యాలను సరిగ్గా అర్థము చేసుకొనవలెను అని చెవిమాట చెప్పినారు. సర్వ ఉపనిషత్తుల పూర్తి సారమూ అద్వైతమే అన్నారు. పూర్తి వేదాంతపు మార్గమే అద్వైతమని అర్థము చేసుకుంటే , వేరే ప్రశ్నలే పుట్టవు. 

కొందరు , శంకరులను గురించి , " అద్వైత సిద్ధాంతము ప్రకారము , పరబ్రహ్మమే నిత్యము , సత్యము , మిగిలినదంతా మిథ్య " - ఇదే నిజమయినట్టైతే , ఈ ప్రపంచములో జరిగే ప్రతియొక్క క్రియ గురించి ఏమని చెపుతారు ? గురువులైన తమరు , శిష్యులైన మాకు జ్ఞానమును బోధిస్తున్నారు , ఇది సత్యమా లేక మిథ్యయా ?  మీరే చెప్పండి . బ్రహ్మ తప్ప మిగిలినవన్నీ మిథ్య అన్నట్టైతే , మీ బోధనలు , మా గ్రహింపు... మిథ్యయేనా ? ఈ ప్రపంచములో నడచు అన్ని కార్యములూ అబద్ధాలేనా ? జరిగే సర్వ క్రియలూ మిథ్య అనే అర్థమా ? " అని ప్రశ్నిస్తారు. 

అప్పుడు భగవత్పాదులైన శంకరులు ఇలాగ ఉత్తరమిస్తారు , 
|| సర్వ వ్యవహారాణామేవ ప్రాగ్ బ్రహ్మాత్మతా విజ్ఞానాత్ సత్యత్వోపపత్తేః |
స్వప్న వ్యవహారస్యేవ ప్రాక్ ప్రబోధాత్ ||

జగత్తులో మూడు విధముల సత్యములున్నాయి. 
మొదటిది , " పారమార్థిక సత్యము " అది ’ త్రికాలాబాధితమైన ’ సత్యము. ఆ పరబ్రహ్మమనేది , మొదటా ఉండింది , ఇప్పుడూ ఉంది. ఇక ముందూ ఉంటుంది. అది పరమ సత్యము. 
రెండవది ,బ్రహ్మ జ్ఞానము పొందక ముందు ఉన్న స్థితిలో ఉండేది , " వ్యావహారిక సత్యము ". 
మూడోది, " ప్రాతిభాసిక సత్యము ".  అంటే , వస్తువు కనిపించునంత కాలము మాత్రమే అది సత్యముగా కనపడేది. ఉదాహరణకు , మృగతృష్ణ [ ఎండమావి ] లో నీరున్నట్టే కనబడుతుంది. అక్కడ నిజముగా నీరు లేకున్ననూ భ్రాంతి వలన నీరున్నట్టే కానవస్తుంది. ఇది ప్రాతిభాసిక సత్యము. ఈ మూడింటికన్నా భిన్నముగా ఉన్న వస్తువేదైనా , తుఛ్చమైన అసత్యమే ! 
ఉదాహరణకు , గగన కుసుమము , శశశృంగము [ కుందేటి కొమ్ము ]. 
ఈ ప్రపంచమనునది గగన కుసుమము మొదలగువాటి వలె అసత్యమైనది కాదు. ఎందుకంటే ఇది మన అనుభవానికి గోచరమవుతున్నందు వలన ఇది అబద్ధమని చెప్పుటకు సాధ్యము కాదు, అలాగే ,ఇది పరబ్రహ్మ వస్తువు వలె పారమార్థికముగా సత్యమైన వస్తువూ కాదు. ఎందుకంటే ఇది నిరంతరమూ మారుతూనే ఉండుట వలన దీనిని ’ త్రికాలాబాధమైన ’ సత్యము అనుటకు సాధ్యము కాదు. అందువలన ఈ ప్రపంచము ’ మిథ్య ’ అని పిలవబడినది. ’ మిథ్య ’ అంటే ’ అబద్ధము ’ అని అర్థము కాదు. ’ ఇది ఇలాగ ’ అని నిర్ధారించుటకు సాధ్యము కానిది , అనిర్వచనీయమైనది అని అర్థము. 

ఈ ప్రపంచమనేది వ్యావహారిక సత్యము. బ్రహ్మ జ్ఞానము పొందు వరకూ ఇది సత్యమని అనిపిస్తుంది. బ్రహ్మ జ్ఞానమును పొందినప్పుడు , బ్రహ్మమే సత్యము. మిగిలినదంతా మిథ్య అని తెలుస్తుంది. ఎలాగైతే నిద్రించు వ్యక్తి కలలో అనెక ఘటనలను చూసి కూడా , మెలకువ అయినాక , అవన్నీ అబద్ధము అని తెలుసుకుంటాడో , అలాగే , బ్రహ్మము ఒకటే సత్యము.  ’ ఆ బ్రహ్మము నేనే అయి ఉన్నాను ’ అన్న జ్ఞానము వచ్చిన తక్షణమే స్వప్న సదృశమైన ద్వైత ప్రపంచమంతా నష్టమవుతుంది. 

దీనిని అద్వైత సిద్ధాంతమును సరిగ్గా అర్థము చేసుకోనివారు ఆక్షేపించవచ్చు , ’ అద్వైతము ’ అనగానే అన్నీ మిథ్య అని అర్థము కాదు. వాస్తవాన్ని ఎవ్వరూ తోసిపారేయుటకు సాధ్యము కాదు అనేదేమో నిజము. అద్వైత సిద్ధాంతము వలన కర్మ మార్గమునకు ప్రాముఖ్యత లేదని కాదు , ఎవరికైతే అద్వైత సాక్షాత్కారమయినదో , వారికి కర్మలు వదిలేయండి అని చెప్పే అవసరమే లేదు , అటువంటి వారిని కర్మ తానే వదలిపోతుంది. కానీ అద్వైత సాక్షాత్కారమగు వరకూ అతడు కర్మాసక్తుడై ఉండవలెను. కాబట్టి , అద్వైత సిద్ధాంతము కర్మలను , ఉపాసనలను తిరస్కరించదు అనవచ్చు. 
భగవత్పాదులైన శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని సదృఢముగనే ప్రతిపాదించిననూ , కొందరి[ సరిగ్గా అర్థము చేసుకొనలేని వారి ] దృష్టిలో , అద్వైతము టీక చేయవలసిన వస్తువు. అయితే , ద్వైతము-అద్వైతము-విశిష్టాద్వైతము - ఈ అన్నింటినీ కూలంకషముగా పరీక్షిస్తే , అద్వైత సిద్ధాంతములో మాత్రమే అన్ని ఆక్షేపణలకూ సరియైన సమాధానము దొరకుతుంది. అద్వైత సిద్ధాంతమే శ్రేష్ఠము అనేది ’ అయ్యణ్ణ దీక్షితుల’ స్పష్ట అభిప్రాయము. ఈ అంశాన్ని వారు " వ్యాస తాత్పర్య నిర్ణయ " అనే గ్రంథములో ప్రతిపాదించినారు. శంకరులు , ’ ఉపనిషత్ సారమే అద్వైతము ’ అన్నారు. వారు ప్రతిపాదించిన అద్వైతము , తరువాతి కాలములో కావలసినంత విస్తారమూ , ప్రసిద్ధీ అయినది. 

ఓం తత్ సత్

[ బోధివృక్ష --కన్నడ ప్రచురణ నుండీ అనువాదము ]

Sunday, February 1, 2015

జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి గారి అనుగ్రహ భాషణము

                                    || శ్రీః || 





ముప్పై యేడవ శ్రీ శారదా పీఠపు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి గారు సన్యాసాశ్రమము తీసుకున్న తరువాత తమ మొట్ట మొదటి అనుగ్రహ భాషణమునిచ్చినారు. 

[ కన్నడ భాషణమునకు తెలుగు అనువాదము- పూర్తి పాఠము ] 

|| శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే |
సర్వదా సర్వదాఽస్మాకం సన్నిధిం సన్నిధిం కుర్యాత్ ||

|| శ్రుతిః స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం |
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ||

|| అజ్ఞానాంజాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం |
సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే ||

ఈ జగత్తులోనున్న సర్వ ప్రాణులకన్నా మనుష్యుడు అత్యంత శ్రేష్ఠమైనవాడు అని శాస్త్రములు చెపుతాయి. అయితే  మనుషులమై పుట్టినంత మాత్రమునకే మనము కృతార్థులము కాలేము. దానిని, అంటే ఆ మనుష్య జన్మను మనము సార్థకము చేసుకోవలెను. మన జీవితానికి సార్థకత అనేది ఎప్పుడు కలుగునంటే , మోక్షమును పొందినపుడు మాత్రమే. మనుషుడై పుట్టినదానికి ఫలమేమిటి అంటే , మోక్షమును పొందుటే ఫలము .  కానీ ఆ మోక్షమనేది అంత సులభముగా దొరికేది కాదు. దానికి మహాపురుషుల అనుగ్రహము అనేదొకటుండ వలెను. భగవంతుని కృప అనేది కూడా ఉండవలెను.  ఎన్నో జన్మలలో చేసినట్టి పుణ్యము , పుణ్య విశేషమూ ఉండవలెను. అయితే ఈ మహాపురుషుల అనుగ్రహము అనేది అత్యంత దుర్లభమైనది.
దీనినే శంకరాచార్యులు అంటారు , 
|| దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం |
మనుష్యత్వం , ముముక్షుత్వం , మహాపురుష సంశ్రయః ||
అని.
మనుష్య జన్మ పొందుట , అలాగే , మోక్షమును పొందవలెనన్న తీవ్రమైన ఇఛ్చ ఉండుట , అట్లే , మహాపురుషుల సాన్నిధ్యము-ఇవన్నీ కావలెనంటే , భగవంతుని కృప అనేది మనకు ఉండే తీరవలెను. ఆ కృప ఉండుట వల్లనే మనకు ఈ మూడూ దొరకుతాయి. నాకు , ఆ మహాపురుషుల సంశ్రయము... అంటే సాన్నిధ్యము అనేది ఆ శారదామాత కృప వల్ల దొరికింది. అందులోనూ , మహాపురుషులు అనగా , సాక్షాత్తూ ఆది శంకరుల పరంపరలో వచ్చినట్టి , అలాగే ఆ ఆదిశంకరుల స్వరూపులైనట్టి జగద్గురువుల సాన్నిధ్యము అనేది నాకు లభించింది. వారి అనుగ్రహము నాకు దొరికింది.

మొదటినుండీ కూడా నాకు ఆధ్యాత్మిక మార్గములో జీవనము గడపవలెను, నా జీవితాన్ని సార్థకము చేసుకోవలెను అనే ఇఛ్చ ఉండింది. అలాగే , శృంగేరీ జగద్గురువుల వద్దనే శాస్త్రాధ్యయనము చేయవలెను అన్న కోరిక కూడా ఉండేది. దానికై జగద్గురువులను ప్రార్థించినపుడు , వారు నామీద పరమానుగ్రహమును చూపి, న్యాయాది సర్వ శాస్త్రములనూ నాకు నేర్పించినారు. నామీద అపారముగా వారి కృప ఉండింది. వారు ప్రతీ క్షణమూ నా ఉన్నతినే కోరుచుండెడి వారు. ఈ దినము నాకు కలిగిన ఈ గొప్ప భాగ్యములో మాకు సొంతముగా యేదీ రాలేదు , అంతా కూడా ఆ జగద్గురు మహాస్వాముల అనుగ్రహము వల్లనే మాకు దొరికింది. 

నేనైతే ఇక్కడికి.. ఈ శృంగేరికి వచ్చినది, శాస్త్రాధ్యయనము కోసము మాత్రమే. అట్లే , ఆధ్యాత్మికముగనూ , శాస్త్రోక్తముగానూ జీవితము గడపవలెను అన్న కోరితోనూ వచ్చినాను. అయితే  జగద్గురు మహాస్వాములవారు నన్ను పరిపూర్ణముగా అనుగ్రహించి వారి కరకమలములతోనే నాకు సన్యాసాశ్రమమును అనుగ్రహించినారు. తమ ఉత్తరాధికారిగా నన్ను స్వీకరిస్తాను అని వారు చెప్పినపుడు నాకు అవధులులేని ఆనందము కలిగింది. ఎందుకంటే సాక్షాత్తూ ఆ ఆది శంకరుల పరంపరలో వచ్చిన వారు , ఆ ఆదిశంకరుల స్వరూపులే యైనట్టి ఆ జగద్గురువుల అనుగ్రహము నాకు ఇంతగా దొరకడము , ఈ దినము నా జీవితము ధన్యమైనట్లే అని భావిస్తున్నాను. 

నన్ను తమ ఉత్తరాధికారిగా స్వీకరిస్తున్నామని వారు చెప్పినపుడు నేను అడిగినాను , " తమరు ఇంతటి బాధ్యతను నాపైనుంచినారే , దీనిని వహించుటకు నాకు సాధ్యమవుతుందా ? " అని. దానికి వారు మందహాసముతో అన్నారు , " దాని గురించి నువ్వేమీ ఆలోచించవద్దు , ఆ శారదామాత ప్రేరణతో నీ మీద నా అనుగ్రహము సంపూర్ణముగా ఉంది. అదొక్క దాని వల్లనే సర్వమూ సాధింపబడును " అని అన్నారు. అంటే , గురువుల అనుగ్రహము ఒక్కటీ ఉంటే చాలు , మనము దేనినైనా సాధించవచ్చును , అందులో యే సంశయమూ లేదు అన్నది నాకు బోధ పడింది. వారు నాపై ఇంతటి నమ్మకము , విశ్వాసమూ చూపుట కేవలము వారి అనుగ్రహ కటాక్షమే తప్ప నా గొప్పదనము ఏమీ లేదు. ఇదంతా కూడా ఆ జగద్గురు మహా స్వాములు నాకు అనుగ్రహించి ఇచ్చినదే. అట్లే , నా మీద ఉంచిన ఈ బాధ్యతను కూడా , వారి అనుగ్రహము చేతనే సమంజసముగా నిర్వర్తిస్తాను అని చెప్పతగినది. అలాగే, ఈ మఠపు ఉత్తరోత్తర అభివృద్ధికై కూడా , వారి అనుగ్రహ బలముతోనే నేను పరిశ్రమ చేయగలవాడను. ఇంతటి మహత్కార్యమునకు మీ అందరి సహకారము కూడా అవశ్యముగా కావలెను. మీరందరూ ఇంత సంఖ్యలో ఇక్కడికి వచ్చినారు , ఈ మఠము మీద , గురువుల మీద మీకందరికీ అపారమైన శ్రద్ధ ఉంది, ఈ శ్రద్ధా భక్తులను ఎల్లపుడూ ఇదేరీతిలో కొనసాగిచవలెనని ఈ శుభ సందర్భములో మీకందరికీ నా అభ్యర్థన. ఆ గురుభక్తే మనలను అత్యున్నతమైన స్థితికి తీసుకువెళ్ళగలదు అని చెప్పి , ఆ జగద్గురు చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములను అర్పిస్తూ , నా ఈ భాషణమును ముక్తాయిస్తున్నాను. 

[ కింది భాషణము వారు ముందటి దినము కొన్ని వార్తా పత్రికలకు ఇచ్చినది]

||  శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం 
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం || 

భగవత్పాద శంకరాచార్యులు , " జంతూనాం నర జన్మ దుర్లభం " అన్నారు. అటువంటి నరజన్మను పొందిన తరువాత , మోక్షమును పొందుటే ముఖ్యమైన ధ్యేయముగా ఉండవలెను. ఆధ్యాత్మ సాధన యొక్క ముఖ్య ఉద్దేశము కూడా అదే అయి ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మ సాధనే ప్రతి యొక్కరికీ మొదటినుండీ చివరి వరకూ లక్ష్యముగా ఉండవలెను. మోక్ష మార్గమునకు సన్యాసాశ్రమమే శ్రేష్ఠమైన మార్గము. ఎందుకంటే సన్యాసికి ఎటువంటి బంధనాలూ ఉండవు. ఎట్టి అంతరాయములూ లేక పరమాత్ముని గురించి నిరంతరమూ ధ్యానము చేయుటకు అవకాశముంటుంది. అందువలన , సన్యాసమే ఉత్తమ మార్గమని నా భావన.
గృహస్థాశ్రమములో ఆ అవకాశము లేదు. గృహస్థులకు కుటుంబ నిర్వహణా బాధ్యతలుంటాయి కాబట్టి సంపూర్ణముగా ఆధ్యాత్మ సాధనలో నిమగ్నమగుట సులభము కాదు.  

సన్యాసాశ్రమము తీసుకున్ననూ మోక్షమును పొందాలంటే గురువు యొక్క అనుగ్రహము అత్యంత అవసరమైనది. శంకరాచార్యులే వారి శిష్యులకు మహా వాక్యమును ఉపదేశము చేసినారు. ఇది పరంపరానుగతముగా వస్తున్నది. అటువంటి పరంపరలో వచ్చిన గురువులే నాకు సాక్షాత్తూ ఉపదేశము అనుగ్రహించుట , నా జీవితములో నేను పొందిన  అతిపెద్ద సౌభాగ్యము . శ్రీ జగద్గురువులు నన్ను అనుగ్రహించుటలో నా గొప్పతనమేదీ లేదు. అది కేవలము వారి దయ. అట్టి గురువుల వద్ద శిష్యరికము చేయుట నా భాగ్యము. ఇది నేనేనాడూ ఊహించనిది. 
ఆరు సంవత్సరాల క్రిందట , శృంగేరికి వచ్చినపుడు , శాస్త్రాధ్యయనము చేయుట మాత్రమే నా ఉద్దేశము. అపుడు ఇంతపెద్ద  బాధ్యత నాకు వస్తుందనీ , దానిని నేను తీసుకోవాలనీ అనుకోలేదు , కోరుకోలేదు. అయితే గురువుల సాన్నిధ్యము , వారి విశేషమైన అనుగ్రహము మరియూ వారు చూపిన మార్గ దర్శనము నన్ను మూక విస్మితుడిని చేసింది. వారు నాపై ఉంచిన నమ్మకము , బాధ్యతలను దైవానుగ్రహముగాను , దైవాదేశముగానూ  తీసుకుంటాను. వారి అనుజ్ఞను పాలించుతున్నాను అన్న ఆత్మతృప్తి , సంతోషమూ నాకున్నాయి.  

గురుపాదుకాభ్యో నమః 









Saturday, January 31, 2015

జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వాముల శిష్య స్వీకార మహోత్సవ సందర్భంగా అనుగ్రహ భాషణము

                               || శ్రీః ||





జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వాములు , తమ శిష్య స్వీకార మహోత్సవ సందర్భంగా చేసిన అనుగ్రహ భాషణము
[ కన్నడ భాషణమునకు తెలుగు అనువాదం- పూర్తి పాఠం ]

ఇది అత్యంత స్ఫూర్తి దాయకము , విజ్ఞానదాయకము , ఆసక్తి కరమూ అయినది. దీనిలో ఎంతో విలువైన సమాచారము ఉంది

*****************************************************

|| శరదిందు వికాస మందహాసాం

స్ఫురదిందీవర లోచనాభిరామాం|
అరవిందసమాన సుందరాస్యాం|
అరవిందాసన సుందరీముపాసే ||

ఆదిశంకరుల గురించి మనదేశములోనే ... దేశములోనే కాదు , ఈ విశ్వములోనే తెలియనివారుండరు. మన సనాతన ధర్మానికీ , ఉపనిషత్ సిద్ధాంతానికీ వారు చేసిన సేవ , ఎన్ని సహస్ర మానములు గడచినా ఈ జనత , గుర్తుపెట్టుకొనునటువంటిది. కేవలము ముప్పైరెండు సంవత్సరముల కాలము ఈ భూమిపై కనిపించినట్టి ఆ మహాపురుషుడు చేసినట్టి కార్యము మాత్రము యుగయుగములవరకూ  నిలుచునట్టిది. మనుష్యుని పురోగతికి ఏకమాత్రమైన సాధనము ’ధర్మము’ అని చెప్పతగినట్టిది. అట్లే , మనుష్యుని పతనానికి ఏకమాత్రమైన సాధనము ’ అధర్మము ’ అని చెప్పతగినది.ఈ ధర్మము , అధర్మమూ అను ఈ రెండూ , మనిషి గొప్పదనానికీ , నీచత్వానికీ సాధనమైనటువంటివి. ఇందులో ఏవిధమైన అనుమానమూ , మార్పూ లేదు. 


శృతి , స్మృతి , ఇతిహాసములు , పురాణములు , దర్శనములు --వీటన్నిటిలోనూ , వేరే ఇతర విషయములలో అభిప్రాయ భేదమున్ననూ , ఈ ఒక్క  విషయములో మాత్రము ఎటువంటి అభిప్రాయ భేదమూ లేదు. ధర్మము సుఖానికీ , పుణ్యానికీ హేతువనీ , అధర్మము కష్టానికీ , పాపానికీ హేతువని ప్రతియొక్క దార్శనికుడూ ఒప్పుకున్నట్టిదే. అందుకే , శాస్త్ర పరిభాషలో కొన్ని ’ సర్వతంత్ర సిద్ధాంతములు ’, మరికొన్ని ’ ప్రతి తంత్ర సిద్ధాంతములూ ’ అని చేయబడినవి. వాటిలో ’ సర్వతంత్ర సిద్ధాంతము ’  అంటే సర్వులూ , సర్వమూ ఒప్పుకునేదే అని అర్థము.. ఈ ధర్మాధర్మములే సుఖ దుఃఖాలకు హేతువులు అన్నది సర్వతంత్ర సిద్ధాంతము. 


అద్వైతులుకానీ , ద్వైతులు కానీ , విశిష్టాద్వైతులైనా కానీ , శక్తి విశిష్టాద్వైతులైనా కానీ , బౌద్ధులు కానీ , జైనులు కానీ,  వీరశైవులే కానీ , ఈ విషయములో మాత్రము ఎవరికీ యే భిన్నాభిప్రాయమూ లేదు. కాబట్టి మనము , నిత్య సత్యమైనట్టి ఈ యొక్క సిద్ధాంతమును అనుసరిస్తూ మన జీవితాలను సాగించినపుడే మన జీవితము పవిత్రమవుతుంది, ఉత్తరోత్తరా మనకు ఇంకా ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని గనక మరచి మనమేదైనా అధర్మపు దారి తొక్కితే , అధర్మ మార్గములో నడచుకుంటే మన జీవితాలను మనమే వ్యర్థము చేసుకున్నట్టవుతుంది.


ఇది నిత్య సత్యమైన విషయము. ఆది శంకరులు మనకు  కొత్తగా దేనినో ఉపదేశము చేసినారు అని మేమేనాడూ చెప్పము. దేనిని శాస్త్రములు స్పష్టముగా చెప్పినాయో, దానిని జనులు మరచిపోయినప్పుడు , జనులకు దానిని గుర్తుచేసినారు. ఈ సిద్ధాంతాన్ని మరచి ప్రజలు కేవలము పశువులు , మృగములవలెనే జీవితాలను గడుపుతున్నటువంటి సందర్భములో , శంకర భగవత్పాదులు , ’ ఈ రీతిలో మీరు జీవితాలను వ్యర్థము చేయుట సరియైనది కాదు , జీవితము అత్యమూల్యమైనది , ఇది పదే పదే దొరకునట్టిది కాదు , ఇటువంటి అమూల్యమైన జీవితాలను వ్యర్థము చేసుకొనకండి, సార్థకము చేసుకొనండి , సార్థకము చేసుకోవాలంటే ఏకమేవ మార్గము ధర్మాచరణమే. ధర్మమార్గమును ఎవ్వరూ తప్పకండి. ధర్మ మార్గమును తప్పితే మీకు ఇహములో దుఃఖము కలుగును అని అనిపించకున్ననూ ఈ శరీరమును వదలిపోయిన తరువాత మీరు అధిక దుఃఖాన్ని అనుభవిస్తారు. '


మనిషికి ఒక ఆశ యేమంటే , యే జన్మలోనైనా సరే నేను సుఖముగా ఉండవలెను. యే జన్మలోనూ నాకు దుఃఖము కలుగకూడదు , కష్టములు కలుగకూడదు-- ఇది ప్రతి మనిషికీ అంతరాళములో ఉండే ఆశ. శంకరులన్నారు , ’ నిజముగా మీకు ఈ ఆశ ఉంటే దానికి తగినట్టే ప్రవర్తించండి. విద్యార్థులకు , తాము పరీక్షలో మొదటి శ్రేణిలో పాసు కావలెనన్న ఆశ ఉంటుంది, కానీ పుస్తకము ముట్టేందుకు మనసు రాదు. శంకరులంటారు , ’ నువ్వు పుస్తకమే ముట్టకపోతే మొదటి శ్రేణిలో లో ఎలా పాసవుతావు ? నీకు నిజంగా మొదటి శ్రేణిలోపాస్ కావలెనన్న ఆశ ఉంటే తీవ్రముగా కృషి చేయ వలెను. అట్లే , జీవితమును సార్థకము చేసుకోవాలంటే ధర్మమార్గము లోనే నడవవలెను. అధర్మ మార్గములో నడవద్దు. ఒకోసారి అనిపిస్తుంది, ధర్మ మార్గములో నడచుట చాలా కష్టము అని. అయితే , మనకు ఉత్తమమైన ఫలము దొరకాలంటే మొదట కష్టము అనుభవించే తీరవలెను. విద్యార్థులకు కూడా చదవడం అంటే చాలా కష్టము అనిపిస్తుంది. మరి మొదటి శ్రేణిలో లో పాసవవలెనంటే కొంచమైనా కష్టము పడవద్దా ? అట్లే , ధర్మ మార్గమున నడచుట కష్టము అని ఎవరైనా దానిని వదలివేస్తే , తమకు అపేక్షితమైన ఫలము మాత్రము దొరకదు. 


దానినే శంకరులు చాలా స్వారస్యముగా చెప్పినారు, ’ ఈ జనులలో ఒక విచిత్రమైన ప్రవృత్తి కనిపిస్తున్నది, 


|| పుణ్యస్య ఫలమిఛ్చంతి పుణ్యం నేఽఛ్చంతి మానవాః | 

న పాప ఫల మిఛ్చంతి పాపం కుర్వంతి యత్నతః || " అని. 

పుణ్యఫలమైన సుఖము కావాలని అందరూ కోరుతారు , కానీ ఆ  సుఖము కోసము పుణ్యమును చేయుటకు మాత్రము ఎవరూ ముందుకు రారు. పాప ఫలమైన దుఃఖము ఎవరికీ వద్దంట , కానీ ఆ దుఃఖాన్ని ఇచ్చునటువంటి పాప కార్యాన్ని అందరూ ప్రయత్నపూర్వకంగా చేస్తారు. ఇది మనుషులలో ఒక విచిత్రమైన ప్రవృత్తి అని , నేను చెప్పుట లేదు , వందలాది సంవత్సరములుగా  వెనుకతరాల వారు మనుషుల ప్రవృత్తులను అధ్యయనము చేసినవారు చెప్పిన మాట. 


కానీ ఈమాట నిజమనిపించేటట్టు మనం ఉండకూడదు. పుణ్యఫలమైన సుఖాలను అనుభవించాలనుకుంటే , ఆ సుఖాలను ఇచ్చే పుణ్యకార్యాలను మనం చేయవలెను. అనగా , ధర్మమునే ఆచరించవలెను. పాప ఫలమైన దుఃఖమును మనము అపేక్షించుట లేదు అంటే , ఆ దుఃఖజనకములైన పాప కార్యములను మనము చేయరాదు. దీనినే శంకర భగవత్పాదులు మనకు విస్తారముగా వివరించి చెప్పినారు. వారు అనేక విధములైన భాష్యములు , ప్రకరణములు , స్తోత్రములూ రాసినారు, అతి సంక్షిప్తమైన గ్రంధములనూ రాసినారు. అన్నిటి సారాంశమూ ఒక్కటే , ’ ధర్మ మార్గములో ఉండు , అధర్మ మార్గమునకు పోవద్దు .’ అలాగే , ప్రజలకు దీనిని మనము పదే పదే చెప్పుచుండవలెను. అలాగే పిల్లలకు , ’ నువ్వు బాగా చదవవలెను , గురువుల వద్ద వినయముతో ఉండవలెను , సహ పాఠుల వద్ద స్నేహముతో ఉండవలెను , ఇతరుల పెన్సిలూ , పెన్నూ దొంగతనము చేయకూడదు , గురువుల ఎదుట ఏనాడూ అబద్ధము చెప్పవద్దు , ’ అని వారికి ఒకసారి చెప్పితే చాలదు , ప్రతి దినమూ పదే పదే చెప్పుతూనే ఉండవలెను. ఎందుకంటే ఒకసారి చెబితే మరచిపోవచ్చు. పిల్లలకు దినమూ అలాగ చెప్పునట్లే , ప్రజలకు కూడా అలాగే ధర్మమును గురించిన ప్రబోధము నిరంతరమూ చేయవలెను అను కారణము చేతనే , శంకరులు ఈ మఠముల వ్యవస్థ చేసినారు. దీనికి సన్యాసులను నియమించినారు. ఎందుకనగా , సన్యాసులకు ఉండే ఒక వైశిష్ట్యమేమనగా ,  అతనికి భార్యా బిడ్డలు ఉండరు కాబట్టి , అతడికి మొదటగా , స్వార్థము ఉండదు. భార్యా బిడ్డలుంటేనే కదా స్వార్థము వచ్చేది ?  భార్యకు నగలు చేయించాలి , పిల్లలను చదివించాలి ,పెళ్ళిళ్ళు చేయాలి... ఇటువంటి లంపటాలు సన్యాసికి ఉండవు , ఆవైపుకే అతని మనసు పోదు. 


ఇంకొకటేమంటే , ఆ సన్యాసి వేదాంతమును అధ్యయనము చేసి ఉండుట వలన అతడికి ఏ విధమైన ఆశలూ ఉండవు. -- నేను చెప్పేది నిజమైన సన్యాసుల గురించే.  దేనిమీదా అతడికి వ్యామోహము ఉండదు కాబట్టి ధర్మ ప్రచారము చేయుటకు సన్యాసికి ఎక్కువ అవకాశము  ఉంటుంది. స్వార్థము ఎప్పుడైతే ఉండదో , అప్పుడతడికి ఇంకే విధమైన పనులూ ఉండవు. అందువలన సన్యాసి పరంపరను శంకరులు తమ చతురామ్నాయ పీఠములలో ఏర్పరచినారు. సన్యాసులే ఈ పీఠములకు అధిపతులుగా ఉండవలెను , ఈ పీఠానికి వచ్చినవారు సర్వ కాలములలోనూ జనులకు ధర్మ ప్రచారమునే చేయుచుండవలెను, తాము స్వయముగా ధర్మాచరణము చేయవలెను. ఇతరులకు ఉపదేశము చేయుటలో మాత్రమే నిమగ్నమై ఉండరాదు. కన్నడ భాషలో ఒక సామెత ఉంది,మీకందరికీ తెలిసే ఉండును , " చెప్పేదేమో పురాణములు , తినేదేమో వంకాయలు " అని. అట్లుకారాదు. ఇతరులకేమి ఉపదేశము చేస్తారో దాన్ని మీరుకూడా అక్షరాలా పాటించండి.


దీనినే శంకరులు ,తమ మఠములకు అన్వయించునట్టుగా ఒక చట్టాన్ని రాసినారు. ఆ చట్టం పేరే ’ మఠామ్నాయము ’ . నాలుగు మఠముల లోనూ ఉన్న సన్యాసులు ఇలా ఇలాగుండవలెను , అలాగుండవలెను అని చెప్పునపుడు , ఆ సన్యాసుల యోగ్యతను చెప్పునపుడు

|| శుచిర్జితేంద్రియో వేద వేదాంగాది విశారదః   ||  అంటే , ఆ సన్యాసి శుచిగా , శుద్ధంగా ఉండవలెను , అనగా శుద్ధ చారిత్ర్యవంతుడై ఉండవలెను. చరిత్ర శుద్ధి ఉండవలెను , జితేంద్రియుడై , వేద వేదాంగముల అధ్యయనము చేసిఉండవలెను , శాస్త్రజ్ఞుడై ఉండవలెను , || సః మదాస్థానమర్హతి || అంతటివాడే ఈ పీఠములో కూర్చొనుటకు యోగ్యుడై ఉంటాడు. అటువంటి యోగ్యత లేనివాడిని ఈ పీఠమునకు తీసుకొని రాకూడదు. --అని శంకరులు ఆనాడే అనుజ్ఞనిచ్చినారు. ఆ అనుజ్ఞను శృంగేరీ శారదాపీఠము మాత్రమే ఆనాటినుండీ పాటిస్తూ వస్తున్నది . ఈ పీఠపు విశిష్టత అదే.  ఆ యోగ్యత లేని వ్యక్తిని ఈ పీఠమునకు ఎవ్వరూ తీసుకురాలేదు. శృంగేరీ పీఠపు ఇతిహాసాన్ని శంకరుల నుండీ ఈనాటి వరకూ చూస్తే  ఆ యోగ్యత లేని యే ఒక్క వ్యక్తి కూడా ఈ పీఠానికి అధికారిగా రాలేదన్నదే ఇక్కడి విశిష్టత. 

మరియూ ఇంకొక వైశిష్ట్యత ఏమనగా , ఈ పీఠములో బ్రహ్మచారిగానే సన్యాసాశ్రమమునకు వచ్చుట. గృహస్థాశ్రమము నుండీ సన్యాసాశ్రమము నకు వచ్చుట లేదు. మా పరంపరలో ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాశ్రమము నుండే సన్యాసియై , సన్యాసి ధర్మమును తు. చ. తప్పక పాలించి , శాస్త్రానుగుణముగా తమ జీవితాన్ని గడిపి, ప్రజలకు ధర్మ ప్రబోధనము చేసి , ఈ పీఠమునకు తాము వచ్చి సార్థకతను చేకూర్చినారు అనునది , నాటి నుండీ నేటి వరకూ వచ్చిన పీఠాధిపతులను చూస్తే మనకు తెలియునటువంటి నిత్యసత్యమైన మాట. దీన్ని మేము వెనుకటి గురువుల చరిత్రను గ్రంధాల మూలముగా చూసియున్నాము , మా గురువులలో ప్రత్యక్షముగనే చూసినాము. మా గురువులైన జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ స్వామి వారు , తమ పదునాలుగో యేటనే సన్యాసమును స్వీకరించినారు. పదునాగేళ్ళ వయసులో బ్రహ్మచర్యాశ్రమము నుండీ సన్యాసి అయినారు. సకల శాస్త్రములనూ 
ధ్యయనము చేసినారు.  సకల శాస్త్ర పారంగతులూ అయినారు. మఠపు  సాంప్రదాయములను తమ గురువుల ముఖమున సంపూర్ణముగా తెలుసుకున్నారు. మఠపు ఉన్నతి కోసము , శిష్యుల ఉన్నతి కోసము తమ జీవితమును ధారపోసినారు. వారు ముప్పైఅయిదు సంవత్సరముల పాటు ఈ పీఠాధిపత్యమును నెరపినారు, దానిలో సుమారు పదునైదు సంవత్సరములు యాత్రలలోనే గడిపినారు. దేశసంచారము చేసినారు. సంచారములోనే తమ జీవితపు అర్ధ భాగాన్ని గడిపినారు. సంచారము ఎందుకు చేసినారు అనగా , ధర్మము గురించి ప్రచారము , ఉపదేశముల కోసమే. ప్రజలకు వేదాంత తత్త్వమును తెలుపుటకోసమే. జనులను సన్మార్గములో నడిపించుట కోసమే. యాత్రలు చేయుటే కాదు , శృంగేరీని విశేషముగా అభివృద్ధి చేసినారు. వారి దర్శనము చేసినవారు , వారి అనుగ్రహమును పొందినవారు వారి అద్భుతమైన మహిమను అనుభవించినట్టి వారు ఈనాడు కూడా మన మధ్యలో చాలామందే ఉన్నారు. 

వారు 1974 లో నాకు సన్యాస దీక్షనిచ్చి ,నన్ను తమ ఉత్తరాధికారిగా నియమించినారు. వారిది అత్యంత విశాలమైన దృష్టి, నేను ఎక్కడో ఆంధ్ర దేశములో పుట్టినవాడిని,నాకు ఈ దేశపు చరిత్ర కానీ , ఈ మఠపు చరిత్ర కానీ ఇక్కడి సంస్కృతిగానీ , ఇక్కడి ఆచార వ్యవహారములు గానీ ఏమీ తెలిసి ఉండలేదు. అటువంటి నన్ను ఈ మఠపు ఉత్తరాధికారిని చేసి , ఇప్పుడు నేను నాకు ఏమేమి లేకుండెను అని చెప్పినానో అవన్నీ సంపూర్ణముగా నాకుండునట్లు చేసి నన్ను ఈ పీఠపు రక్షణకు నియమించినారు. వారు యే భరోసాతో నన్ను ఉత్తరాధికారిగా చేసినారో ,ఆ భరోసాను కాపాడుకున్నానన్న తృప్తి నాకుంది. వారు , ఈ పీఠాన్ని నేను అభివృద్ధి చేస్తాను , ప్రజలకు ఎక్కువగా ఉపకరించు కార్యములను చేస్తాను ,ఇంకా ఎక్కువ ధర్మ ప్రచారము చేస్తాను , మన భారతీయ సంస్కృతికి దోహదమగునట్లుగా అనేక పనులను చేస్తాను అన్న నిరీక్షణ కలిగి ఉండేవారు. ఈ దినము ఇక్కడ జరిగినదంతా చూసినవారందరూ , వారి నిరీక్షణ అంతా సత్యమైనది అన్న తృప్తితో కూడిన భావనలో ఉన్నారు. ఇదంతా కేవలము వారి కృప వల్లనే అయింది. 


నేను పదే పదే చెప్పునదేమంటే , దీనిలో ఏదైనా నాగొప్పతనముందని నేను అనుకొని ఉంటే అది కేవలము మూర్ఖత్వము. నా గొప్పదనమేదీ లేదు , ఇది కేవలము వారి కృప , మరియూ ఆ జగన్మాత శారదాదేవి యొక్క కృప మాత్రమే. నాకు ఎన్నో సందర్భములలో అనేకమైన సమస్యలు వచ్చినపుడు , నా గురువులనూ , ఆ జగన్మాత శారదనూ స్మరించినపుడు , అన్ని సమస్యలూ పరిహారమై, యేది అసాధ్యమైన పని అని భయపడి ఉంటానో అది పువ్వును ఎత్తిపెట్టినంత తేలికగా అయిపోయిన సన్నివేశములు అనేకములున్నాయి. అవి నాకు గుర్తున్నాయి , ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నాతోపాటే ఉన్న మన గౌరీశంకర్ కు తెలుసు. 


ఇటువంటి ఉజ్జ్వలమైన పరంపరయే శృంగేరీ శారదా పీఠపు పరంపర  , ఈ పరంపరను ముందుకు కొనసాగించి తీసుకు వెళ్ళవలసిన భారము నామీద ఉన్నందువలననే , దీన్ని సరిగ్గా నిర్వహించుట నా కర్తవ్యమైనందువల్ల , ఈ దినము ఈ ఉత్తరాధికారియగు శిష్య పరిగ్రహణము చేసినాను , ఈ దినము,  ఆనంద నామ సంవత్సరపు,  ఆశ్వయుజ మాసపు కృష్ణ పక్షపు ద్వాదశి ,సోమవారము అంటే 1974 వ సంవత్సరము నవంబరు పదకొండో తారీఖును గుర్తు చేస్తున్నది. ఇదే రీతి యైనటువంటి సన్నివేశము  ఆనాడు కనిపించింది ,  అదే నేడు మరలా పునరావృత్తమయింది. జయనామ సంవత్సరపు , మాఘ మాసపు శుక్ల పక్షపు తృతీయ శుక్రవారము , 2015 , జనవరి 23 వ తారీఖున . నా గురువులు నాచే శాస్త్రాధ్యయనము చేయించి, నాకు మఠపు సాంప్రదాయములను తెలిపి, మఠపు శిష్యులనందరినీ పరిచయము చేసి, నాకు ఈ భారమును అప్పగించినారు. అదే విధముగా , మా శిష్యులను అదే రీతిలో సిద్ధం చేసి, వారికి సన్యాస దీక్షను ఇచ్చినాను. 


జాతకమును చూసి సన్యాసమును ఇచ్చే పద్దతి ఇక్కడ మా దగ్గరలేదు. పిల్లవాడి జాతకము అనేకులకు చూపించి, ఆ అనేకులలో యే ఒక్కరైనా , ’ ఈ పిల్లవాడి జాతకములో సన్యాస యోగము లేదు ’ అని చెప్పితే , ’ అయితే వద్దు , ఈ పిల్లవాడికి సన్యాస దీక్ష ఇచ్చుట తగదు ’ అని నిర్ధారించుట కొన్ని చోట్ల ఉందని విన్నాము , అయితే మా గురువులు అలాగ చేయలేదు , నేను కూడా అలాగ చేయలేదు. మా గురువులు , నాకు సన్యాసము ఇచ్చిన తరువాత అడిగినారు , " స్వామీ , మీరు పుట్టిన తిథి యేది ? " అని. ఎందుకడిగినారంటే , స్వాముల పుట్టిన దినమున మఠములో ’ వర్ధంతి ’ అని చేస్తారు , అందుకని అడిగినాను ' అన్నారు. నేను కూడా వీరిని అదే అడిగినాను. ’ మీరు పుట్టిన తిథి యేదయ్యా , ఎందుకంటే మఠములో స్వాముల పుట్టిన రోజు ’ వర్ధంతి’ జరుపవలెను అని. 


జాతకమును చూసి సన్యాసమును ఇచ్చుట కాదు , వ్యక్తి గుణమును , స్వభావమునూ చూసి ఇవ్వవలెను. ఆ వ్యక్తికి ఉండవలసిన మనస్సును చూసి. ఈ వ్యక్తి స్వభావము ఎట్లుంది, మనసెట్లుంది, వైరాగ్యము ఎట్లుంది, జనులపైన మమత , ప్రేమ ఎట్లున్నాయి.. వీటిని చూసి మేము సన్యాసము నిస్తాము, ఇది శృంగేరీ మఠపు పద్దతి. ఆ పద్దతికి అనుగుణముగా మా గురువులు యేరీతిలో జరిపించినారో , అదే పద్దతిలో జరిపించుట మాకర్తవ్యము అని భావించి , అట్లే చేసినాము. దిలీప మహారాజు యొక్క రాజ్యమును వర్ణించునపుడు కాళిదాస మహాకవి ఒక మాటంటాడు , 

|| రేఖామాత్రమపిక్షుణ్ణాదామనోర్వర్త్మనఃపరమ్
 నవ్యతీయుర్ప్రజాః తస్య నియంతుర్నేమివృత్తయః ||

దిలీప మహారాజుయొక్క రాజ్యములో ఉండే ప్రజలు , వెనుకటి రఘువంశ రాజులు ఏ మార్గమును యేర్పరచినారో , ఆ మార్గము నుండీ ఒక్క అంగుళము కూడా ఇటుపక్కకు , అటుపక్కకు వెళ్ళేవారు కారు. అదేరీతిలో నడచుకునేవారు. అదే మార్గమును అనుసరించేవారు.  శృంగేరీ పీఠములో కూడా అదే ఉత్క్రమము.వెనుకటి గురువులు యేమార్గమును మనకు వేసి ఇచ్చినారో , ఆ మార్గమునుండీ అటూ ఇటూ వెళ్ళే ప్రశ్నే లేదు. ఈ రోజు ఇక్కడ  శిష్య స్వీకార మహోత్సవమును  ఉదయము మనము జరిపిన క్రమమునే  ,1974 నవంబరులో చూసినవారు ఒక ఐదారు మంది ఉన్నారిక్కడ.  ఆ దినము యేమేమి ఎలాగ జరిగిందో , అదే పద్దతిలో ఈ దినము జరిగింది అన్న సంతోషము వారి ముఖములో నేను చూసినాను. ఇది ఈ శృంగేరీ మఠపు వైశిష్ట్యత. ఆ జగదంబ శారదాంబయే  ఇక్కడి ఉత్తరాధికారిని నిర్ణయించినది. మేము కాదు. ఆ మాత ఎవరిని నిర్ణయిస్తుందో వారికే మేము ఉత్తరాధికారమునిస్తాము. కాబట్టి మేము ఆ బాధ్యతను మాపైన వేసుకున్నదే లేదు. అందువలన , మా గురువులు ఆ సంవత్సరము నవరాత్రులలో చివరిరోజు , పల్లకీ ఉత్సవము అయిన  తరువాత వచ్చి అమ్మ దగ్గరకు వెళ్ళి , అక్కడ ఒక అయిదు నిమిషాలుండి, అమ్మ అనుజ్ఞ పొంది బయటకు వచ్చి ప్రకటన చేసినారు. అంతవరకూ వారు ప్రకటించలేదు. అనేక శిష్యులు వారిని అడిగేవారు ," తమకు వయసు యాభై ఆరు వచ్చిందే , ఉత్తరాధికారి గురించి యేమైనా ఆలోచించినారా ? ’ అని. ’ నాకెందుకయ్యా , ఆ భారము ఆ మహామాతదే.  ఆ మహామాత ఎప్పుడు తీర్మానము చేయునో అప్పుడే అగును , నేనెందుకు దానిగురించి బుర్ర పాడుచేసుకోవలెను ’ అన్నారు. 

ఆ నవరాత్రులలో చెప్పినారు , " ఆ జగన్మాత నాకు అనుజ్ఞనిచ్చింది, ఈ వ్యక్తిని నువ్వు ఉత్తరాధికారిగా నియమించు అంటూ జగన్మాత అనుమతినిచ్చింది,ఇకఎటువంటి ప్రశ్నలకూ తావులేదు , ముందరి ద్వాదశినాడు వీరికి సన్యాసము అగును "  అన్నారు. 


అదే , ఈసారీ పునరావృత్తి అయింది. ఈ పద్దెనిమిది దినముల వెనుక , ఇప్పుడే మన శాస్త్రులు చెప్పినట్టే ,  మనవూరివారందరూ చేరి ,’ తమకు పట్టాభిషేకమై ఇరవై అయిదు సంవత్సరాలైనది, దానిగుర్తుగా ఒక రజతోత్సవము చేయవలెను ’ అని విజృంభణగా చేసినారు. ఆ దినము గురువుల పల్లకీ ఉత్సవము జరగవలెను అని అందరూ భీష్మించినారు. సరేలెమ్మని పల్లకీ ఉత్సవము అయినాక లోపలికి వెళ్ళి అమ్మదగ్గర ప్రార్థన చేసినపుడు , అమ్మ నాకు ప్రేరణ ఇచ్చినారు. ’ ఈ పిల్లవాడికి సన్యాసము నిచ్చివేయవయ్యా ’ అని. ఆ దినము మా గురువులకు యే విధముగా అమ్మ అనుజ్ఞ దొరికినదో , అదే విధముగా నాకు కూడా అమ్మవారి అనుజ్ఞ దొరికినది. ఆ అనుజ్ఞనే నేను ఆ సభాముఖముగా చెప్పినాను. మా అధికారులన్నారు , ’ అదెవ్వరికీ తెలియనే లేదు , గురువులతో పాటే ఎల్లపుడూ ఉండేవారికి కూడా ఆ సంగతే తెలియలేదు , ఉన్నపాటున ఒక్కసారిగా గురువులు చెప్పినారే ’ అని. అమ్మ అనుజ్ఞ లేనిదే నేను మాత్రం ఎలాగ చెప్పగలను ? అమ్మవారి అనుజ్ఞ దొరకగానే వెంటనే చెప్పినాను. కాబట్టి ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమము , శృంగేరీ మఠములో అనూచానముగా వస్తున్నట్టి ఒక కార్యక్రమమే.


 నాకు సంతోషము కలిగించేదేమిటంటే , మన రాష్ట్రపు అనేకులు , మరియూ మన అధికారులు చెప్పినట్లుగా మన రాష్ట్రపు చుక్కానిని పట్టినట్టి అనేక అధికారులు , విశేషమైన అభిమానముతోవచ్చి ఈ కార్యక్రమములో పాలు పంచుకున్నారు.  ప్రతి ఒక్కరికీ , మన రాష్ట్రపు వారే కాదు , బయటి రాష్ట్రాలవారే కాదు , మన దేశపు వారందరికీ ’ శృంగేరీ మఠము యే రాజకీయాలకూ సంబంధించిన మఠము కాదు , శృంగేరీ జగద్గురువులు రాజకీయాలకు అతీతముగా ఉండేవారు , తమ కర్తవ్యములో మాత్రమే నిరతులై ఉండేవారు. తమకు సంబంధము లేని విషయములలో యేమాత్రమూ తలదూర్చనివారు , ’ అన్నట్టి పరిపూర్ణమైన భావము మన దేశములో ప్రతి ఒక్కరికీ ఉంది. కాబట్టి, సర్వులకూ , ఇక్కడికి వచ్చుట , ఆశీర్వాదము పొందుట అనేది ఒక గర్వించతగ్గ విషయము , అదొక సంతోషించ వలసిన విషయము. 


అందువలననే , ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వాదము తీసుకొనుట అనేది ఎప్పటినుండో జరుగుతున్నది. వెనుక , మైసూరు మహారాజుల పాలన మన రాష్ట్రములో ఉన్నపుడు , శృంగేరీపీఠములో ఉత్తరాధికారి నియమితులై శిష్య స్వీకారము చేయువేళ , మహారాజులకు శ్రీముఖమును పంపుట , మహారాజులు స్వయముగా తామే వచ్చుట , లేదా , ఒకవేళ అత్యవసరమైన పరిస్థితిలో వారికి వచ్చుటకు వీలుకాకపోతే , తమకు అత్యంత ఆప్తులైన ప్రతినిధులను , అనగా , దివాను వంటి ప్రతినిధులను పంపుట అనేది, శృంగేరీ మఠములో శత శతమానములనుండీ వస్తున్న ఆచారము. మరియూ , అమ్మవారి అనుజ్ఞ చేత  గురువులు ఎవరిని ఉత్తరాధికారులుగా ఎంచి ప్రకటిస్తారో వారిని కూడా అత్యంత సంతోషముతో స్వీకరించి,  జగద్గురువుల వలెనే గౌరవించే ఒక సంప్రదాయము ఆనాటినుండే వస్తున్నది. ఆ సంప్రదాయము ప్రకారమే  , ఈనాడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వపు ప్రతినిధులుగా జయచంద్రులు , అభయ చంద్రులు వచ్చినారు , అంతే కాక , ఎడ్యూరప్ప , శంకరమూర్తి ,  అనంత కుమార్ , రామచంద్ర గౌడులు , జీవ రాజు  వంటి అనేక ప్రముఖులు అత్యంత ప్రేమ , అభిమానము , మమతలతో ఇక్కడికి వచ్చి  ఈ కార్యక్రమములో  భాగము వహించినారు.  వారందరికీ నా పరిపూర్ణమైన ఆశీర్వాదములు. 


మన మఠపు శాఖా మఠములు మన రాష్ట్రములోనూ , బయటి రాష్ట్రములలోనూ ఉన్నాయి, వాటిలో శివగంగ మఠము , మరియూ ఎడత్తిరి యోగానందేశ్వర మఠముల వారు  మాపై అత్యంత  శ్రద్ధాభక్తులు కలవారు. ఆ మఠాధిపతులు , పురుషోత్తమ భారతీ స్వాములు , మరియూ  శంకర భారతీ స్వాములు అత్యంత సంతోషము , శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చినారు, వారిని నేను పరిపూర్ణముగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే , ఆంధ్ర దేశములోని ’ ధర్మపురి ’ అను ఊరిలో ఉన్నట్టి ’ సచ్చిదానంద సరస్వతీ స్వాములు’  కూడా  ఎంతో శ్రద్ధాభక్తులతో వచ్చినారు , వారికి కూడా నా ఆశీర్వాదములు. 


మా అధికారులు చెప్పినారు, పత్రికా ప్రతినిధులు మరియూ టీవీ మాధ్యమము వారు ఈ కార్యక్రమములో మాకు అధికముగా సహకరించినారు , వారందరికీనూ నా ఆశీర్వాదములు. 


అందరికన్నా ముఖ్యముగా మా మఠపు శిష్యులు , ఈ దినము ఇంత సంఖ్యలో వస్తారని నేను ఊహించనేలేదు. ఎక్కడెక్కడినుండో వచ్చినారు, కేవలము ఈ కార్యక్రమమును చూడవలెనన్న అభిలాషతోనే. ’ నేను ఈ రోజు ఎవరినీ చూచుటకుగానీ మాట్లాడుటకుగానీ వీలుకాదని చెప్పినాను , అయితే , ’ తమరు మమ్మల్ని చూచుట , మాట్లాడుట కాకపోయినా , తమరిని చూచుటకు మేము వస్తాము , మమ్ములను తమరు చూడవలెనని నిర్భంధము చేయము ’ అంటూ అంతటి ప్రేమాభిమానాలతో మా శిష్యులు వేల వేల సంఖ్యలో వచ్చినారు. వారందరికీ కూడా నా పరిపూర్ణ ఆశీర్వాదములు. 


ఇక ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పవలసినది యేమీ లేదు , మా ఉత్తరాధికారి స్వాములకు మేము . ’ విధుశేఖర భారతీ ’ అనే యోగపట్టమును ఇచ్చినాము. అనేకులు అడిగినారట , ’ దీని అర్థమేమి ? ’ అని. మా పరమ గురువులు , ’ చంద్రశేఖర భారతీ ’ అను అవిధానముచేత జగత్ప్రసిద్ధి పొందినవారు , వారి నామమును వినని వారెవరూ ఉండరు , వారి నామధేయమునే వీరికి పెట్టవలెను అని నాకు అభిప్రాయముండినది. కానీ , అదే పేరునే పెడితే , మాకు అత్యంత గౌరవ పాత్రులైన వారి పేరుతో మా శిష్యులను పిలుచుట అన్నది మా మనసుకు సమంజసము అనిపించలేదు. చంద్రశేఖర భారతులు మాకు పరమ గురువులైనప్పుడు , చంద్రశేఖర భారతులు మా శిష్యులు అని అంటే అది సమంజసము కాదు, అయితే , ఆ పేరంటే నాకు అత్యంత అభిమానము , కాబట్టి , సంస్కృతములో చంద్రుడికి ’ విధు ’ అన్నది పర్యాయ పదము కాబట్టి, 


|| హిమాంసుశ్చంద్రమాః చంద్రః ఇందుః కుముదవాన్ భవః విధుఃసుధాంసుః శుభ్రాంశుః || అని కోవై. 


చంద్రునికి ’ విధు ’ అనేది పర్యాయ పదము , ఎలాగంటే , రామః అన్నా , సీతాపతి అన్నా , దాశరథి అన్నా రాముని పేరే అన్నట్లు , అలాగే , చంద్రః అనేది, విధుః ’ అనేది రెండూ ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల , ’ చంద్రశేఖర భారతీ ’ అనుటకు బదులుగా , ’ విధుశేఖర భారతీ ’ అని అంటున్నాను. అంతే తప్ప దీనికి ఇంకే విధమైన అర్థమునూ కల్పించవలసిన అవసరము లేదు. ఆ చంద్ర శేఖర భారతులను జ్ఞాపకము చేసుకొని , వారిని మేము మరలా చూస్తున్నాము అనే అభిప్రాయముతో , ’ విధుశేఖర భారతీ ’ అనే పేరు వారికి పెట్టినామే తప్ప మరేమీ కాదు. 


ఈ మా శిష్య స్వాములు , అత్యంత యోగ్యులై, శాస్త్రములో విశేషమైన పాండిత్యమున్న వారై, మా మనసును అత్యంత సంతోష పరచినారు. అయిదారు సంవత్సరముల నుండీ వారు మాదగ్గర శాస్త్రాధ్యయనము చేస్తున్ననూ కూడా వేరే యే ఇతర విషయములకూ వెళ్ళక , వేరే యే వ్యవహారములకూ తలదూర్చక , ఎవరితోనూ సంబంధములు  పెట్టుకోక , తామేదో , తమ  పాఠమేదో అంతే తప్ప ఇంకే విధమయిన వాటితోనూ సంబంధము లేక ,  వేరే దేనియందూ ఆశ అన్నదే లేకుండా ఉన్న ఈ అన్ని విధముల యోగ్యతలను చూచియే అమ్మవారు అనుజ్ఞ నిచ్చినందు వలన వారికి దీక్షనిచ్చి మా ఉత్తరాధికారులుగా చేసినాము , వారిని సమస్త విధములుగా శక్తియుక్తులను చేసి ఈ మఠాన్ని ఇతోధికంగా ఉఛ్చ్రాయ స్థితి
కి తీసుకువెళ్ళగల సామర్థ్యమును  వారికి ఇవ్వవలెనని ఆ అమ్మవారిని ప్రార్థించి , దానికి మీ అందరి సహకారమూ కూడా అత్యగత్యము అని చెప్పి , మీ అందరికీ నా పరిపూర్ణమైన ఆశీర్వాదములను తెలుపుతూ ఈ ప్రవచనమును సమాప్తి చేస్తున్నాను. 


|| హర నమః పార్వతీ పతయే హరహర మహాదేవ || 




https://www.youtube.com/watch?v=CXNr8p41xyc